ఇంకెన్నాళ్లు!

ABN , First Publish Date - 2022-04-24T05:25:51+05:30 IST

జిల్లాకు సోమశిల జలాశయం వరప్రసాది అయితే జిల్లాలోని డెల్టా, నాన్‌డెల్టా ఆయకట్టుకు ఆయువుపట్టు సంగం బ్యారేజ్‌. సుమారు 3.85 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీరు ఇక్కడి నుంచి పంపిణీ జరుగుతుంది.

ఇంకెన్నాళ్లు!
పునాదుల స్థాయిలో ఉన్న సంగం వైపు కనెక్టివిటీ రోడ్డు బ్రిడ్జి పనులు, రిజర్వాయర్‌ కాలువ

సీఎం ఆరువారాల గడువు పూర్తి..

అయినా పూర్తికాని సంగం బ్యారేజీ!

ఇప్పటికీ జరిగింది 89 శాతం పనులే

మరో 3 నెలలు గడిస్తేనే అందుబాటులోకి

పునాదుల్లోనే ఉత్తరం వైపు రోడ్‌ కనెక్టివిటీ పనులు

గేట్ల ఎలకి్ట్రకల్‌ పనుల పూర్తికి నెలన్నరపైనే..

అసంపూర్తిగా కంబైన్డ్‌ రెగ్యులేటర్‌ పనులు, గేట్లు

నేడు బ్యారేజ్‌ పరిశీలనకు మంత్రి కాకాణి రాక


మరో ఆరు వారాల్లో పూర్తయ్యే సంగం బ్యారేజ్‌కు దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌గా నామకరణం చేస్తామని మార్చి 8వ తేదీన అసెంబ్లీ సమావేశాల్లో    సీఎం జగన ప్రకటించారు. శాసనసభ సాక్షిగా సీఎం చెప్పిన గడువు ఈ నెల 20వ తేదీతో ముగిసింది. కానీ ఇంకా పనులు సా...గుతూనే ఉన్నాయి. మరో మూడు నెలలు గడువు ఉంటే తప్ప పనులు పూర్తయ్యేలా లేవు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాకాణి గోవర్థన్‌రెడ్డి నేడు సంగం బ్యారేజ్‌ పరిశీలనకు ఆదివారం రానున్నారు. బ్యారేజ్‌ ఎప్పటిలోగా పూర్తి చేయించి జిల్లాకు అంకితం చేస్తారోనని రైతాంగం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో బ్యారేజీ నిర్మాణ పనుల పురోగతిపై ఆంధ్రజ్యోతి పరిశీలన కథనం..



సంగం, ఏప్రిల్‌ 23 : జిల్లాకు సోమశిల జలాశయం వరప్రసాది అయితే జిల్లాలోని డెల్టా, నాన్‌డెల్టా ఆయకట్టుకు ఆయువుపట్టు సంగం బ్యారేజ్‌. సుమారు 3.85 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీరు ఇక్కడి నుంచి పంపిణీ జరుగుతుంది. ఇంత ప్రాధాన్యత కలిగిన సంగం బ్యారేజ్‌ 1882-84 కాలంలో బ్రిటీష్‌ హయాంలో నిర్మించారు. బ్యారేజ్‌ 120 సంవత్సరాలు దాటడంతో శిథిలస్థితికి చేరింది. 


2006లో శంకుస్థాపన


 శిథిలమైన సంగం బ్యారేజి స్థానంలో 2006లో అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.86.5 కోట్లతో కాంట్రాక్ట్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ నిర్మాణం చేపడితే నష్టం వస్తుందని చేతులెత్తేశారు. దీంతో 2008లో రూ.147 కోట్లకు అంచనాలు పెంచి మళ్లీ రీ టెండర్‌ పిలవగా రూ. 122.5 కోట్లకు హార్విన్‌ కంపెనీ పనులు దక్కించుకుంది. ఆ సంస్థ కూడా 10 శాతం పనులతో తాత్సారం చేసింది.


టీడీపీ హయాంలో వేగవంతం


 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబునాయుడు సీఎం అయిన తరువాత ఆయన రెండు సార్లు సంగం బ్యారేజ్‌ను పరిశీలించారు. ప్రాధాన్యతా బ్యారేజీల్లో చేర్చి నిధులు కేటాయించారు. దీంతో నిర్మాణం ఊపందుకుంది. 2019 ఎన్నికల నాటికి 72 శాతం పూర్తయింది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. పనులు మందగించాయి. అప్పటినుంచి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆరు నెలలకొకసారి గడువు పెంచుకుంటూ పోతున్నారు. 


మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు నామకరణం


 ఈ నేపథ్యంలో ఆత్మకూరు ఎమ్మెల్యే అయిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఫిబ్రవరి 21వ తేదీన హఠాన్మరణం చెందడం మార్చి 8వ తేదీన శాసనసభలో జరిగిన ఆయన సంతాప సభ సీఎం జగన్మోహన్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ఆరు వారాల్లో పూర్తి చేసి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌గా పేరు పెడతామని జీవో కూడా విడుదల చేశారు. ఈ క్రమం లో మార్చి 15వ తేదీన చీఫ్‌ ఇంజనీరు హరినారాయణరెడ్డి బ్యారేజ్‌ను పరిశీలించి జూన్‌ 15వ తేదీలోపు పూర్తి చేస్తామ ని ప్రకటించారు. అప్పుడు జలవనరులశాఖ మంత్రిగా ఉన్న అనీల్‌కుమార్‌ యాదవ్‌ కూడా మార్చి 19వ తేదీన బ్యారేజ్‌ను పరిశీలించి సీఎం చెప్పినట్లు ఆరు వారాల్లో పూర్తి చేయాల్సిందేనని కాంట్రాక్టరుకు, అధికారులకు గట్టిగా చెప్పారు. దీంతో కాంట్రాక్టర్‌ పెండింగ్‌ బిల్లులు విడుదలైతేనే పనులు చేయగలమని తెగేసి చెప్పారు. 


మార్చి వరకు బిల్లుల విడుదల


 కాంట్రాక్టర్‌ కోరిన మేరకు మార్చి వరకు పెండింగ్‌ ఉన్న బిల్లులు ఇటీవల విడుదలయ్యాయని చీఫ్‌ ఇంజనీరు హరినారాయణరెడ్డి నూతన వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి జిల్లా అధికారుల సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ సమక్షంలో వెల్లడించిన విషయమే. ఆ మేరకు కాంట్రాక్టర్‌ కూడా ధృవీకరించారు. అయితే ఇటీవల చేసిన పనులకు సుమారు రూ.12 కోట్ల మేర బిల్లులు పెడుతున్నారని తెలిపారు.


89 శాతం పనుల పూర్తి


 ప్రస్తుతం సంగం బ్యారేజ్‌ 89 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. అంటే ఇప్పటివరకు పెరిగిన బ్యారేజ్‌ పొడవు, అంచనా రేట్ల ప్రకారం బ్యారేజ్‌ నిర్మాణ విలువ సుమారు రూ.179.9 కోట్లకు చేరింది. ఆ మేరకు కాంట్రాక్టర్‌ అగ్రిమెంట్‌ చేసుకున్నారు. 89 శాతం పనులంటే సుమారు రూ.161.9 కోట్ల పనులు జరిగాయి. బిల్లులు కూడా చెల్లించేశారు. మొత్తం బ్యారేజ్‌ పూర్తయ్యేలోగా  నిర్మాణ ఖర్చు రూ.236 కోట్లకు చేరుతుందని అధికారుల అంచనా వేశారు. అంటే ఇంకా 11 శాతం పనులు చేయాల్సి ఉంది. సుమారు రూ.75 కోట్ల పనులు జరగాలన్న మాట.


చేయాల్సిన పనులు ఇవే..


బ్యారేజీలో 85 గేట్ల నిర్వహణకు ఎలకి్ట్రకల్‌ మోటార్‌ సిస్టం పనులు ఇప్పుడే ప్రారంభించారు. 

బ్యారేజీ రహదారి పొడవునా ఫుట్‌పాత్‌ పనులతోపాటు, ప్రొటెక్షన్‌ రైలింగ్‌ పనులు జరగాల్సి ఉంది.

బ్యారేజీ రహదారి 1200 మీటర్ల పొడవునా వెయిరింగ్‌, లైటింగ్‌ సిస్టం ఏర్పాటు చేయాలి.

కనిగిరి రిజర్వాయర్‌, కంబైన్డ్‌ రెగ్యురేటర్‌కు షట్టర్ల అమరిక, కాలువ పనులు, సంగం వైపు కనెక్టివిటీ రోడ్డు వంతెన పునాదుల్లోనే ఉంది.

రివిట్‌మెంట్‌ పనులు అసంపూర్తిగా ఉన్నాయి.

కనుపూరు కాలువల షట్టర్లు, మోటారు సిస్టం ఏర్పా టు చేయాల్సి ఉంది.

నెల్లూరు చెరువు పారుదల కాలువ మోటారు సిస్టం, రోడ్డు కనెక్టివిటీ పనులు జరగాల్సి ఉన్నాయి.

గతంలో వేసిన పొర్టుకట్టలు ఇటీవల వచ్చిన వరదలకు దెబ్బతిన్నాయి. మళ్లీ పొర్లుకట్టల పనులు చేయాలి.





Updated Date - 2022-04-24T05:25:51+05:30 IST