ఇంజనీరింగ్‌ సీట్లు.. భర్తీ అయ్యేనా?

ABN , First Publish Date - 2021-12-06T05:53:21+05:30 IST

ఎంసెట్‌ నోటిఫికేషన్‌ నుంచి కౌన్సెలింగ్‌ వరకు ఈ ఏడాది ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ఇంజనీరింగ్‌ యాజమాన్యాలు భారీమూల్యం చెల్లించుకుంటున్నాయి.

ఇంజనీరింగ్‌ సీట్లు..  భర్తీ అయ్యేనా?
కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులు(పాతచిత్రం)

తొలి విడత నాలుగు కాలేజీల్లోని నూరుశాతం సీట్లు భర్తీ

13 కళాశాలల్లో 50శాతం కన్నా తక్కువ..

తొలివిడతలో మిగిలిపోయినవి 4,648

మలివిడత కౌన్సెలింగ్‌పై ఇంజనీరింగ్‌ యాజమాన్యాలు ఆశలు

గుంటూరు(విద్య), డిసెంబరు5: ఎంసెట్‌ నోటిఫికేషన్‌ నుంచి కౌన్సెలింగ్‌ వరకు ఈ ఏడాది ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ఇంజనీరింగ్‌ యాజమాన్యాలు భారీమూల్యం చెల్లించుకుంటున్నాయి. ఏటా మొదటి విడతలోనే 50శాతం కళాశాలల్లో 70 నుంచి 100 శాతం ఇంజనీరింగ్‌ సీట్లు భర్తీ అయ్యేవి. ఈ ఏడాది మాత్రం మొదటి విడతలో కేవలం నాలుగు ఇంజనీరింగ్‌ కళాశాలల్లోనే సీట్లు భర్తీ అయ్యాయి. దీంతో ఈనెల 2 నుంచి 7వతేదీ వరకు జరిగే రెండో కౌన్సెలింగ్‌పై యాజమాన్యాలు దృష్టిపెట్టాయి. రెండో కౌన్సెలింగ్‌లో అయినా సీట్లు భర్తీ కాకుంటే ఈ ఏడాది అనేక ఇంజనీరింగ్‌ కళాశాలల్లో భారీగా సీట్లు మిగిలిపోనున్నాయి. జిల్లాలో 37ఇంజనీరింగ్‌ కళాశాలలున్నాయి. ఆయా కళాశాలల్లో 15,398 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే తొలివిడతలో మాత్రం 10,750 సీట్ల భర్తీ అయినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. జిల్లాలో ఇంకా 4,648 సీట్లు భర్తీ కావాల్సి ఉంది.

ఇతర రాష్ట్రాలకు విద్యార్థులు..

జిల్లాలో ఈ ఏడాది భారీసంఖ్యలో విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్ళారు. కౌన్సెలింగ్‌ నిర్వహణలో జాప్యం, ఇక్కడ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో అనుసరిస్తున్న విధానాల ఫలితంగా దాదాపు 2,500 మందికిపైగా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు తరలి వెళ్లారు. ఇందులో మరికొంతమంది జిల్లాలో డీమ్డ్‌ యూనివర్సిటీల్లో చేరినట్లు ఇంజనీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు వెల్లడిస్తున్నాయి. ఫలితంగా ఏడాది అనేక కళాశాలల్లో సీట్లు భారీగా మిలిగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో మొదటి విడత కౌన్సెలింగ్‌లో కేవలం నాలుగు కళాశాలల్లో మాత్రమే నూరుశాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 90శాతంపైగా సీట్లు భర్తీ అయిన కళాశాలలు నాలుగు ఉండగా, 65 నుంచి 80శాతం సీట్లు భర్తీ అయిన కళాశాలలు 13 ఉన్నాయి. ఇంకా 25 నుంచి 50శాతం సీట్ల భర్తీ అయిన కళాశాలలు తొమ్మిది ఉన్నాయి. కనీసం వందసీట్లు కూడా భర్తీ కాని కళాశాలలు దాదాపు ఐదు వరకు జిల్లాలో ఉన్నాయంటే పరిస్థితి  అర్ధం చేసుకోవచ్చు. ఈనేపథ్యంలో రెండోవిడత కౌన్సిలింగ్‌పై యాజమాన్యాలు ఆశలు పెట్టుకున్నాయి. ఇతర జిల్లాల నుంచి విద్యార్థుల్ని తరలించే యోచనలో ఉన్నారు. ఇందుకోసం ప్రత్యేక క్యాంపెయినింగ్‌ అనేక కళాశాలలు నిర్వహిస్తున్నాయి. విద్యార్థులకు భారీ తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ఫీజులో రాయితీ, స్కాలర్‌షిప్‌, బస్సు ఫీజులో రాయితీ ఇస్తామంటూ విద్యార్థుల్ని కళాశాలల్లో చేర్పించే పనిలో యాజమాన్యాలు నిమగ్నమయ్యాయి. 

 

Updated Date - 2021-12-06T05:53:21+05:30 IST