ఫీజు పరేషాన్‌..!

ABN , First Publish Date - 2022-05-23T06:12:14+05:30 IST

‘ప్రతి విద్యార్థీ పూర్తి ఫీజు చెల్లించాలి. లేదంటే ప్రాజెక్ట్‌ వైవాకు సంబంధించిన రిజిస్ర్టేషన్‌ చేయడం కుదరదు.

ఫీజు పరేషాన్‌..!

నాలుగో ఏడాది ఇంజనీరింగ్‌ విద్యార్థులపై ఒత్తిడి

పూర్తి ఫీజు చెల్లిస్తేనే ప్రాజెక్ట్‌ వైవాకు అనుమతిస్తామంటున్న కళాశాలలు  

ఇప్పటివరకు ఒక విడత జగనన్న విద్యా దీవెన చెల్లింపు

మిగిలిన మూడు విడతలపై సందిగ్ధం

వేలకు వేలు చెల్లించలేమని విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన  


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 


‘ప్రతి విద్యార్థీ పూర్తి ఫీజు చెల్లించాలి. లేదంటే ప్రాజెక్ట్‌ వైవాకు సంబంధించిన రిజిస్ర్టేషన్‌ చేయడం కుదరదు. రెండు రోజుల్లో బకాయిలు చెల్లించని విద్యార్థులను వైవాకు అనుమతించే ప్రసక్తే లేదు’ ఇదీ ఇంజనీరింగ్‌ ఫైనలియర్‌ విద్యార్థులకు ఆయా కళాశాలల నిర్వాహకుల హుకుం.

విద్యార్థుల ఉన్నత చదువులకు ఫీజు మొత్తం చెల్లిస్తామని ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగా జగనన్న విద్యా, వసతి దీవెన కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నట్టు ప్రకటిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ (జగన్న విద్యా దీవెన) సకాలంలో చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఇంజనీరింగ్‌ ఫైనలియర్‌ చదువుతున్న విద్యార్థులకు ఈ సమస్య ఎదురవుతోంది. మరి కొద్దిరోజుల్లో ఫైనలియర్‌ విద్యార్థులు సెకండ్‌ సెమిస్టర్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. దానికి ముందు ప్రాజెక్ట్‌ వైవా పూర్తిచేయాల్సి ఉంది. ఈ నెలాఖరున వైవా నిర్వహణకు కాలేజీలు సిద్ధమవుతున్నాయి. అయితే అంతకుముందే యాజమాన్యాలు వారికి షాక్‌ ఇచ్చాయి. ప్రభుత్వం విద్యా దీవెన కింద చెల్లిస్తానన్న మొత్తం ఫీజు (ఇప్పటికి ఒక విడత విడుదల చేశారు) చెల్లిస్తేనే వైవాకు అనుమతిస్తామని స్పష్టం చేస్తున్నాయి. అందుకు అనుగుణంగా సర్క్యులర్లు విడుదల చేస్తున్న ప్రిన్సిపాల్స్‌.. డెడ్‌లైన్లు కూడా విధించారు. కొన్ని కాలేజీలు ఈనెల 24లోగా చెల్లించాలని ఆదేశించగా, మరికొన్ని కాలేజీలు 25 వరకు గడువు ఇచ్చాయి. మొదటి విడత కింద విడుదల చేసిన మొత్తాన్ని ఇప్పటికే చెల్లించిన విద్యార్థులు.. మిగిలిన మొత్తాన్ని ఒకే దఫా చెల్లించాలన్నది సారాంశం. ఈ మేరకు ఫీజు వసూలు బాధ్యతను కళాశాల సిబ్బందికి అప్పగించారు. 


ఆందోళనలో విద్యార్థులు

కాలేజీలకు ప్రభుత్వమే ఫీజులు నిర్ణయించి.. తామే చెల్లిస్తామని పేర్కొందని, ఇప్పుడు యాజమాన్యాలు తమను చెల్లించమంటే ఒక్కసారిగా రూ.వేలు ఎక్కడి నుంచి తెస్తామని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు అంగీకరించే అడ్మిషన్లు చేసుకున్న కాలేజీ యాజమాన్యాలు ఇప్పుడు.. అందుకు విరుద్ధంగా ఫీజులు చెల్లించమని ఒత్తిడి తేవడం ఎంతవరకు భావ్యమని ప్రశ్నిస్తున్నారు. 


స్పష్టత కరువు.. 

ప్రభుత్వం విద్యాదీవెన చెల్లింపుపై స్పష్టతనివ్వకపోడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పథకం ప్రారంభంలో.. ఏటా కాలేజీలకు నాలుగు విడతల్లో ఫీజు చెల్లిస్తామని పేర్కొన్న ప్రభుత్వం గత ఏడాది మూడు విడతలు మాత్రమే ఇచ్చింది. దీనిపై ఆయా కాలేజీలకు సర్క్యులర్‌ను విడుదల చేసింది. కొవిడ్‌ కారణంగా తరగతులు నిర్వహించకపోవడంతో ఒక విడత ఫీజు చెల్లించడం లేదని పేర్కొంది. అయితే కాలేజీ యాజమాన్యాలు ఆ విషయాన్ని పక్కనబెట్టి, నాలుగో విడత ఫీజు చెల్లించమని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ప్రభుత్వం రెండు విడతల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేసిన్పటికీ.. కాలేజీలు మాత్రం ఒక్కవిడతే చెల్లించిందని, గతేడాది బకాయి ఈ ఏడాది విడుదల చేసిందని వాదిస్తున్నాయి. మూడు విడతల బకాయిలను తక్షణమే చెల్లించి వైవాకు హాజరు కావాలని కండిషన్‌ పెడుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి సమస్య పరిష్కరించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. 



Updated Date - 2022-05-23T06:12:14+05:30 IST