Warning: వారంలోగా చేరకపోతే అడ్మిషన్‌ రద్దు

ABN , First Publish Date - 2022-08-06T13:58:41+05:30 IST

కౌన్సెలింగ్‌ ద్వారా ఎంపిక చేసుకున్న ఇంజనీరింగ్‌(Engineering) కళాశాలల్లో విద్యార్థులు వారంలోగా చేరకపోతే వారి

Warning: వారంలోగా చేరకపోతే అడ్మిషన్‌ రద్దు

                   - ఇంజనీరింగ్‌ విద్యార్థులను హెచ్చరించిన అధికారులు


చెన్నై, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): కౌన్సెలింగ్‌ ద్వారా ఎంపిక చేసుకున్న ఇంజనీరింగ్‌(Engineering) కళాశాలల్లో విద్యార్థులు వారంలోగా చేరకపోతే వారి అడ్మిషన్లు(Admissions) రద్దవుతాయని రాష్ట్ర ఇంజనీరింగ్‌ విద్యార్థుల అడ్మిషన్ల కమిటీ కార్యదర్శి పురుషోత్తమన్‌ స్పష్టం చేశారు. ఆ మేరకు ఈ యేడాది నుంచి ఇంజనీరింగ్‌ సీట్ల కౌన్సెలింగ్‌ విధి విధానాల్లో మార్పు చేసినట్లు చెప్పారు. ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌(Engineering Counselling)లో జరిగిన మార్పులపై శిక్షణా శిబిరం గిండిలోని అన్నా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో శుక్రవారం ఉదయం జరిగింది. ఈ శిక్షణా శిబిరంలో రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఇంజనీరింగ్‌ అడ్మిషన్ల సేవా కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో పురుషోత్తమన్‌ మాట్లాడుతూ ప్రతియేటా ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో సీట్లను భర్తీ చేసేందుకు కౌన్సెలింగ్‌(Counselling) జరుపుతున్నారని, అయితే కోర్సులు ఎంపిక చేసుకుని కౌన్సెలింగ్‌ ద్వారా తమకు నచ్చిన కళాశాలను కూడా ఎంపిక చేసుకున్న విద్యార్థులు అందులో చేరకపోవడంతో సీట్లు ఖాళీగా వుండిపోతున్నాయన్నారు. ఇకపై ఈ పరిస్థితి రాకుండా ఉండేందుకు అన్నా విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్‌ నిబంధనల్లో మార్పు తీసుకువచ్చిందన్నారు. ఆ మేరకు కౌన్సెలింగ్‌ ద్వారా ఇంజనీరింగ్‌ కళాశాలను ఎంపిక చేసుకున్న అభ్యర్థులు వారం లోగా చేరకుంటే ఆ సీటు ఖాళీ అయినట్లుగా ప్రకటించి, రిజర్వేషన్ల ప్రాతిపదికగా భర్తీ చేస్తామని వెల్లడించారు. ఇక ఈ యేడాది నుంచి రిజిస్ట్రేషన్‌(Registration) రుసుము రూ.5వేలు చెల్లించకుండా నేరుగా కళాశాలలో మొత్తం ఫీజు చెల్లించి సీట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మార్పులు ఈ యేడాది నుండే అమలు చేయనున్నామని ఆయన వివరించారు.

Updated Date - 2022-08-06T13:58:41+05:30 IST