కార్యాలయాన్ని ఖాళీ చేయండి

ABN , First Publish Date - 2022-08-10T06:12:51+05:30 IST

జలవనరుల శాఖలోని ఉపకార్యాలయాలను వలసల శాపం వెంటాడుతోంది.

కార్యాలయాన్ని ఖాళీ చేయండి

  ఈఎన్‌సీ కార్యాలయం కోసం కేసీ డివిజన్‌కు ఎసరు

  తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశాలు

 ప్రత్యామ్నాయం చూపని అధికారులు

(ఆంధ్రజ్యోతి - విజయవాడ) : జలవనరుల శాఖలోని ఉపకార్యాలయాలను వలసల శాపం వెంటాడుతోంది. ఒకచోట కుదురుకునే సమయానికి ఎవరో ఒకరు వచ్చి ఎర్త్‌ పెడుతున్నారు. స్వరాజ్‌ మైదానాన్ని అంబేడ్కర్‌ స్మృతివనం కోసం కేటాయించినప్పటి నుంచి వలసలు కొనసాగుతున్నాయి. జరిగిందేదో జరిగింది ఒక గూడు కుదిరిందని భావించిన తరుణంలోనే జలవనరుల శాఖలోని కేసీ (కృష్ణా సెంట్రల్‌) డివిజన్‌కు ఎసరు పెట్టారు. 

జలవనరుల శాఖ కార్యాలయం ఆవరణలో నాలుగు అంతస్తులతో భారీ భవనాన్ని నిర్మించారు. అప్పటి జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఈ భవనాన్ని ప్రారంభించారు. ఇందులో రాష్ట్ర కార్యాలయాలతోపాటు జిల్లా జలవనరుల శాఖకు అనుబంధంగా ఉండే కార్యాలయాలు కొలువుదీరాయి. ఇప్పుడు ఈ భవనం నాలుగో అంతస్తులో ఉన్న కేసీ డివిజన్‌ మొత్తం కార్యాలయాన్ని అక్కడి నుంచి ఖాళీ చేయాలని ఆదేశాలు అందాయి. ఇక్కడ రామవరప్పాడులో ఉన్న జలవనరుల శాఖ ఈఎన్‌సీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేశారు. 

  కేటాయించి.. అంతలోనే మార్పు

కేసీ డివిజన్‌తోపాటు స్పెషల్‌ డివిజన్‌, తూర్పు డివిజన్‌, క్వాలిటీ కంట్రోల్‌ కార్యాలయాలు స్వరాజ్య మైదానం ప్రాంగణంలో ఉండేవి. స్వరాజ్య మైదానాన్ని మొత్తం అంబేడ్కర్‌ స్మృతివనం కోసం కేటాయించడంతో ఇక్కడున్న కార్యాలయాలను ఖాళీ ఉన్న చోటకు తరలించారు. అందులో భాగంగానే ఈ కార్యాలయాలను జలవనరుల శాఖ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన కాంప్లెక్స్‌లోకి మార్పు చేశారు. ఖాళీ లేకపోవడంతో కొన్ని కార్యాలయాలను షెడ్లలో నిర్వహిస్తున్నారు. కార్యాలయానికి సొంత భవనం కుదిరిందని ఆనందించేలోపు దాన్ని వదిలేయాల్సిన పరిస్థితి కేసీ డివిజన్‌కు వచ్చింది. 

  కార్యాలయం మారినప్పుడల్లా ఫైళ్లు మిస్సింగ్‌

జలవనరుల శాఖ అన్ని డివిజన్లలో కేసీ డివిజన్‌ అతి ముఖ్యమైనది. ప్రకాశం బ్యారేజ్‌ దీని పరిధిలోనే ఉంటుంది. దీంతోపాటు నది పరిరక్షణ ఈ డివిజన్‌ బాధ్యత. ప్రకాశం బ్యారేజ్‌, నదీ పరిరక్షణకు సంబంధించిన ఫైళ్లు మొత్తం ఈ డివిజన్‌లోనే ఉంటాయి. పిల్లి పిల్లలను పెట్టి వందిళ్లు తిప్పినట్టు తమ పరిస్థితి ఉందని జలవనరుల శాఖలోని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయం ఒకచోట నుంచి మరోచోటకు మారినప్పుడల్లా కొన్ని ఫైళ్లు కనిపించకుండా పోతున్నాయని సమాచారం. వాస్తవానికి విజయవాడలో జలవనరుల శాఖకు ఉన్న భూములు మరి ఏ ఇతర శాఖలకు లేవు. ఈ భూములను కొన్ని శాఖలు అద్దెకు తీసుకుని కార్యాలయాలను నడుపుకుంటున్నాయి. ఆస్తులు ఉన్నప్పటికీ ఆ పంచన, ఈ పంచన చేరాల్సిన పరిస్థితి జలవనరుల శాఖకు వస్తోంది. ఉన్నట్టుండి ఇప్పుడు కేసీ డివిజన్‌ కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సి రావడంతో అధికారులు, సిబ్బంది అయోమయంలో పడ్డారు. ఇప్పటికే జలవనరుల శాఖ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న అన్ని భవనాల్లో వివిధ కార్యాలయాలు నడుస్తున్నాయి. ఈ తరుణంలో తాము ఎక్కడ తలదాచుకోవాలన్న ప్రశ్న కేసీ డివిజన్‌ ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతోంది.  

Updated Date - 2022-08-10T06:12:51+05:30 IST