ఎండలోనే ఉపాధి

ABN , First Publish Date - 2022-04-18T05:07:06+05:30 IST

జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటలకు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. అలాంటి మండుటెండల్లోనే ఉపాధి హామీ కూలీలు కూలీ పని చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది.

ఎండలోనే ఉపాధి
ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు

- పని చేసే చోట ఉపాధి కూలీలకు కనీస సౌకర్యాలు కరువు 

- నిల్వ నీడ లేకపోవడంతో వడ దెబ్బకు గురవుతున్న కూలీలు

- స్థానికంగా టెంట్లు అందుబాటులో ఉంచని పరిస్థితి

- కనీసం నీటి సౌకర్యం కూడా కల్పించరు

- ప్రథమ చికిత్స బాక్స్‌ కిట్లు కరువు


 కామారెడ్డి, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటలకు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. అలాంటి మండుటెండల్లోనే ఉపాధి హామీ కూలీలు కూలీ పని చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది. కూలీలు ఎండ భారిన పడి అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు ఉన్నాయి. శనివారం కామారెడ్డి మండలం గుడెం గ్రామంలో వైకుంఠధామంలో ఉపాధిహామీ పనులు చేస్తుండగా ఓ కూలీ వడదెబ్బ తగిలి మృతి చెందాడు. ఇలా చాలా మంది కూలీలు వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురవుతున్నారు. జిల్లాలో ఎండల తీవ్రతను బట్టి ఉపాధి హామీ కూలీలకు పని చేసే చోట కనీస సౌకర్యాలు కల్పించడంలో సంబంధిత శాఖ విఫలమవుతోంది. నిల్వ నీడ లేక పని చేసే చోట కూలీలు ఎండ బారిన పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం టెంట్లు, తాగడానికి మంచి నీటి వసతిని కూడా కల్పించడం లేదని కూలీలు మండిపడుతున్నారు. ఎండలోనే కష్టపడి కూలీ పని చేస్తున్నా ఉపాధి హామీ డబ్బులు అందడంలోనూ జాప్యం నెలకొంటుంది. ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ఉపాధి హామీ కూలీలకు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పడమే తప్ప ఆచరణలో మాత్రం నెరవేర్చడం లేదు. ప్రతీ సంవత్సరం  కూలీలు పడరాని పాట్లు పడుతున్నారు. 

జిల్లాలో 2.15 లక్షల జాబ్‌ కార్డులు

కామారెడ్డి జిల్లాలో చాలా వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. వేసవి కాలంలో నీటి లభ్యత లేకపోవడంతో పంట పొలాలు బీడు భూములుగానే మారుతుంటాయి. కూలీ పనులు దొరకక కూలీలు వలసలకు వెళ్తున్నారు. ఈ వలసలను ఆపేందుకు ఉపాధిహామీ పథకం ద్వారా కూలీలకు పని కల్పిస్తున్నారు. ఇలా ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో 2,15,659 జాబ్‌కార్డులు ఉన్నాయి. మొత్తం 5,14,347 మంది కూలీలు ఉపాధి హామీ పని చేస్తుంటారు. వీరందరికీ పని దినాలు కల్పించడమే లక్ష్యంగా గ్రామీణ అభివృద్ధి శాఖ లక్ష్యాలను పెట్టుకొని  ఉపాధి హామీ పనులను చేయిస్తోంది. కాని ఉపాధి హామీ పనులు చేసే చోట కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు. 

సౌకర్యాలు లేక ఉపాధి కూలీల ఇబ్బందులు

ఉదయం 8 గంటలకే ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. ఎవరైన పనులు చేసేందుకు బయటకు వెళ్లాలనుకున్న వారు 10 గంటల లోపు ముగించుకొని నీడపట్టుకు ఉంటున్నారు. వ్యవసాయ కూలీలు, ఇతర కూలీ పనులు చేసే వారు సైతం ఉదయం 7 గంటలకే వెళ్లి 11 గంటల లోపు ముగించుకొని వస్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద పని చేసే కూలీలు సైతం ఉదయాన్నే వెళ్లి 12 గంటల లోపు పనులు ముగించుకొని ఇళ్లలోకి చేరుతున్నారు. ఉపాధి హామీ కూలీ పనులు చేసే చోట కనీస సౌకర్యాలు ఉండడం లేదు. ముఖ్యంగా నీడ వసతి, నీటి సౌకర్యాలు లేకపోవడంతో కూలీలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎర్రటి ఎండలో పని చేసిన కూలీలు కొద్ది సేపైనా సేదతీరడానికి టెంట్లు వేయాల్సి ఉంది. కానీ ఎక్కడ టెంట్లు వేయకపోవడంతో కూలీలకు స్థానికంగా నిల్వ నీడ కరువవుతోంది. చెట్ల కిందికి వెళ్లి సేద తీరుతున్నారు. ఇళ్ల నుంచి కాలినడకన పనులు జరిగే చోటుదాక వెళ్లి రావడానికి ఎక్కువ సమయం అవుతోంది. పని పూర్తి స్థాయిలో చేయలేక, చేసిన పనికి సరిపడా డబ్బులు రాకపోవడంతో కూలీలు నిరాశ చెందుతున్నారు. పని చేసే చోట నీటి సౌకర్యం లేక ఎండలకు వేడిగా అవుతోంది. దీంతో ఆ నీటిని తాగలేకపోతున్నారు. ఎండదెబ్బ తగిలి స్థానికంగా స్పృహకోల్పోతే ప్రథమ చికిత్సకై ఫస్టేడ్‌ కిట్లు కూడా ఉండడంతో లేదు. నీటితో పాటు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. అధికారులు నీడ, నీటి వసతితో పాటు ఫస్టేడ్‌ కిట్లు అందుబాటులో ఉంచాలని కూలీలు కోరుతున్నారు. 

సమయానికి అందని కూలీ డబ్బులు 

మండుటెండల్లో ఉపాధి హామీ కూలీ పనులు చేస్తున్నా కూలీలకు సమయానికి ఉపాధి డబ్బులు అందక ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మొత్తం 5.14 లక్షల మంది కూలీలు ఉపాధి హామీ పని చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 84 లక్షలకు పైగానే పని దినాలు కల్పించాల్సి ఉంది. కూలీలకు లక్ష్యాలకు అనుగుణంగా పని దినాలు కల్పిస్తునప్పటికీ కూలీ డబ్బులు చెల్లించడంలో ఆలస్యం నెలకొంటుంది. మండుటెండులను లెక్క చేయకుండా, కనీస సౌకర్యాలు కల్పించనప్పటికీ కూడా ఉపాది హామీ పనులు చేస్తున్నా సమయానికి డబ్బులు అందడం లేదని కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాది డబ్బులు వెంటనే చెల్లించాలని కూలీలు కోరుతున్నారు.

Updated Date - 2022-04-18T05:07:06+05:30 IST