ఉపాధి అడుగులు

ABN , First Publish Date - 2022-05-17T05:28:00+05:30 IST

రిజర్వాయర్లతో నిర్వాసితులైన కుటుంబాలకు ఆయా రిజర్వాయర్లలో మత్స్య సంపదపై పూర్తి హక్కులు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఉపాధి అడుగులు

 రిజర్వాయర్ల భూనిర్వాసితులకు మత్స్యసంపదపై హక్కులు


గజ్వేల్‌, మే 16 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లా పరిధిలోని అనంతగిరి, కొండపోచమ్మసాగర్‌, మల్లన్నసాగర్‌ రిజర్వాయర్లతో నిర్వాసితులైన కుటుంబాలకు ఆయా రిజర్వాయర్లలో మత్స్య సంపదపై పూర్తి హక్కులు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ గత నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసింది. ఇళ్లు, భూములు, సర్వం కోల్పోయిన భూనిర్వాసితులకు ఉపాధి కల్పించేందుకు రిజర్వాయర్లలో పెంచే మత్స్య సంపదపై హక్కులు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేస్తే సిద్దిపేట జిల్లా పరిధిలోని మూడు రిజర్వాయర్లలో సర్వస్వం కోల్పోయిన 7,812 కుటుంబాలకు లబ్ధి చేకూరునుంది.


మల్లన్నసాగర్‌ పరిధిలో అధికం


రిజర్వాయర్లలో భూములు, సర్వస్వం కోల్పోయిన వారిలో మల్లన్నసాగర్‌ భూనిర్వాసితులే అధికంగా ఉన్నారు. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్నసాగర్‌లో ఎనిమిది గ్రామాలు ముంపునకు గురయ్యాయి. బ్రాహ్మణబంజేరుపల్లిలో 318 కుటుంబాలు, రాంపూర్‌లో 269 కుటుంబాలు, లక్ష్మాపూర్‌లో 423 కుటుంబాలు, ఏటిగడ ్డ కిష్టాపూర్‌లో 1,293 కుటుంబాలు, వేములఘాట్‌లో 1,434 కుటుంబాలు, పల్లెపహాడ్‌లో 971 కుటుంబాలు, ఎర్రవల్లిలో 826 కుటుంబాలు, సింగారంలో 256 కుటుంబాలు లబ్ధిపొందనున్నాయి. కొండపోచమ్మసాగర్‌ పరిధిలో మూడు గ్రామాలు ముంపునకు గురికాగా 1,849 కుటుంబాలకు లబ్ధి చేకూరునుంది. బైలంపూర్‌కు చెందిన 674, మామిడ్యాలకు చెందిన 879, తానేదార్‌పల్లికి చెందిన 296 కుటంబాల ప్రజలు లబ్ధి పొందనున్నారు. అనంతగిరి రిజార్వాయర్‌ పరిధిలో కొచ్చగుట్టపల్లికి చెందిన 153, చెల్కలపల్లికి చెందిన 4, అల్లాపూర్‌కు చెందిన 16 కుటుంబాలు మత్స్య సంపద ద్వారా లబ్ధి పొందనున్నాయి.


త్వరలోనే ప్రభుత్వ నిర్ణయం


మత్స్య సంపదపై హక్కులు కల్పించే విషయమై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఉపాధి, జీవనాధారం కల్పించడం, గ్రామాలకు రెవెన్యూ కల్పించేందుకు ప్రభుత్వం త్వరతిగతిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. గత నెలలోనే జిల్లా కలెక్టర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయమై నివేధించినట్లు సమాచారం. ఇప్పటికే భూనిర్వాసితులకు భూరిజిస్ట్రేషన్లు, ఇళ్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఛార్జీలను ప్రభుత్వం రద్దు చేసింది. ఓపెన్‌ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన యూజర్‌ ఛార్జీలు, స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 13న జీవోను విడుదల చేసింది. ఈ జీవోతో కొండపోచమ్మసాగర్‌, మల్లన్నసాగర్‌ రిజర్వాయర్ల పరిధిలోని 7650 కుటుంబాలకు రుసుము లేకుండా ఇళ్లు, ఫ్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు. దీంతో భూనిర్వాసితులపై రూ.140 కోట్ల భారం తప్పినట్లైంది. తాజాగా మత్స్య సంపదపై నిర్ణయం తీసుకుంటే భూనిర్వాసితులకు మరింత లాభం చేకూరే అవకాశాలున్నాయి.


 

Updated Date - 2022-05-17T05:28:00+05:30 IST