భవిష్య నిధి.. ఏదీ?

ABN , First Publish Date - 2022-08-14T04:38:50+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు భవిష్యనిధి (పీఎఫ్‌) కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. తమ అవసరాల కోసం వేతనాల నుంచి భవిష్య నిధిగా కొంత మొత్తం దాచుకున్న డబ్బులు చేతికి అందక ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులకు ఫైనల్‌ పేమెంట్‌, సర్వీస్‌లో ఉన్నవారికి పార్ట్‌ ఫైనల్‌, రుణాలను ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదు. గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈ ఏడాది మార్చి నెలకు సంబంధించిన చెల్లింపులు రెండు కిందట క్రెడిట్‌ అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి చెల్లింపులు నిలిచిపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

భవిష్య నిధి.. ఏదీ?

- 750 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల పీఎఫ్‌ కోసం దరఖాస్తు
- రూ.42.5 కోట్లపైగా బకాయిలు
- ఏప్రిల్‌ నుంచి ఎదురుచూపు
- సీఎఫ్‌ఎంఎస్‌లో ‘నోబడ్జెట్‌’ అని చూపుతున్న వైనం
- ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్న గురువులు
(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు భవిష్యనిధి (పీఎఫ్‌) కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. తమ అవసరాల కోసం వేతనాల నుంచి భవిష్య నిధిగా కొంత మొత్తం దాచుకున్న డబ్బులు చేతికి అందక ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులకు ఫైనల్‌ పేమెంట్‌, సర్వీస్‌లో ఉన్నవారికి పార్ట్‌ ఫైనల్‌, రుణాలను ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదు. గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈ ఏడాది మార్చి నెలకు సంబంధించిన చెల్లింపులు రెండు కిందట క్రెడిట్‌ అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి చెల్లింపులు నిలిచిపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఉపాధ్యాయుల జీతాల నుంచి ప్రతి నెలా కొంత మొత్తం జిల్లాపరిషత్‌ ద్వారా భవిష్యనిధి ఖాతాకు జమవుతుంది. ఉపాధ్యాయులు తమ అవసరాల కోసం ఎప్పుడైనా ఈ డబ్బుల్లో 1/3 వంతుకు వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనిని పార్ట్‌ ఫైనల్‌ అంటారు. అలాగే ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం మొత్తం పీఎఫ్‌ సొమ్ము విడుదల చేయాలి. దీనిని ఫైనల్‌ పేమెంట్‌ అంటారు. ఇంకా ఉపాధ్యాయుల అవసరాల కోసం రుణానికి దరఖాస్తు చేస్తే గరిష్టంగా మూడు నెలల జీతం ఇవ్వాలి. ఇలా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు 750 మంది ఉపాధ్యాయులు పీఎఫ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి రూ.42.5 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. దరఖాస్తులన్నీ సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేశారు. కానీ, ఇంతవరకు నిధులు విడుదల కాలేదు. దీంతో వారంతా జడ్పీలోని పీఎఫ్‌ విభాగం వద్ద ఆరా తీస్తున్నారు. సీఎఫ్‌ఎంఎస్‌కు అప్‌లోడ్‌ చేయగా ‘నో బడ్జెట్‌’ అని వస్తోందని సంబంధిత అధికారులు సమాధానమిస్తున్నారు. దీంతో ఉపాధ్యాయులంతా గగ్గోలు పెడుతున్నారు. పిల్లల వివాహాలు, చదువులు, ఇతరత్రా అవసరాల కోసం దాచుకున్న సొమ్ము సకాలంలో ఇవ్వకపోవడం దారుణమని వాపోతున్నారు.

నిలిచిన ఏపీజీఎల్‌ఐ చెల్లింపులు  
ప్రభుత్వ సర్వీస్‌లో ఉన్న ఉద్యోగి, ఉపాధ్యాయుడు ప్రతి నెలా స్కేల్‌ను బట్టి గరిష్టంగా రూ.2వేలు ఏపీజీఎల్‌ఐ (ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఫండ్‌) చెల్లిస్తారు. కొందరు జీతంలో ఆరు శాతం చెల్లిస్తుంటారు. బాండ్‌ కాల పరిమితి ముగిసిన వెంటనే ఒక్కొక్కరికి ఏపీజీఎల్‌ఐ కింద రూ. 3 లక్షల నుంచి రూ.4లక్షలు వస్తాయి. ఈ చెల్లింపులు కూడా ఆలస్యమవుతున్నాయి. గతేడాది నవంబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు సంబంధించిన డబ్బులను గురువారం చెల్లించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు 300 మందికి సుమారు రూ.12 కోట్లమేర బకాయిలు ఉన్నాయి.  జీతం తప్ప పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ, సరెండర్‌ లీవ్‌, ఇతర అలవెన్సుల బకాయిలు ఏవీ రావడం లేదని ఉపాధ్యాయలు వాపోతున్నారు. ఇదిలా ఉండగా టీచర్లు, ఉద్యోగుల భవిష్య నిధి సొమ్ములను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించిందన్న ఆరోపణల్లో వాస్తవం ఉందని ఇటీవల పార్లమెంట్‌లో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

క్రెడిట్‌కాని సరెండర్‌ లీవ్‌లు
ఆరు నెలలుగా సరెండర్‌ లీవ్‌లు క్రెడిట్‌ కావడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులకు ఈ పరిస్థితి లేదని.. తమకే ఎందుకిలా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
 
జాప్యం సరికాదు  
ఉద్యోగులు, ఉపాధ్యాయుల పీఎఫ్‌, ఎపీజీఎల్‌ఐ చెల్లింపు విషయంలో జాప్యం సరికాదు. ఇది ప్రభుత్వం అదనంగా చెల్లించే సొమ్ము కాదు. మేం దాచుకున్న సొమ్ము తిరిగి మాకు చెల్లించడంలో ఇంత నిర్లక్ష్యమా? ఇది ప్రభుత్వ వైఫల్యంగా భావిస్తున్నాం. గతంలో ఈ పరిస్థితి లేదు. ‘సరెండర్‌ లీవ్‌’  పైనా గందరగోళం నెలకొంది. డీఏ విషయంలో ఇన్‌కంటాక్స్‌ కూడా కట్టిన పరిస్థితి ఉద్యోగ ఉపాధ్యాయులది. ప్రభుత్వం వెంటనే బకాయిలను చెల్లించకపోతే పోరాటం తప్పదు.
- ఎస్‌.కిషోర్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్‌

ప్రభుత్వమే కారణం
పీఎఫ్‌ సొమ్మును ప్రభుత్వం తీసుకుందని సాక్షాత్తు పార్లమెంట్‌లో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఇది సరికాదు. ఉపాధ్యాయులు దాచుకున్న డబ్బులను ప్రభుత్వం తీసుకోవడమేంటి?  సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో ఎంతోమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. అయినా తమను ప్రభుత్వం పట్టించుకోకపోవడం మంచి పద్ధతి కాదు
- చావలి శ్రీనివాస్‌, ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి.


Updated Date - 2022-08-14T04:38:50+05:30 IST