Budget 2022 LIVE: ఉద్యోగులు, సామాన్యులు ఆశిస్తున్నదేంటి?

ABN , First Publish Date - 2022-02-01T14:52:25+05:30 IST

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.

Budget 2022 LIVE: ఉద్యోగులు, సామాన్యులు ఆశిస్తున్నదేంటి?

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను ఇవాళ  ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. అయితే, నేటి బడ్జెట్ మునుపటి అన్ని బడ్జెట్‌ల కంటే చాలా ప్రత్యేకమైందని చెప్పాలి. ఎందుకంటే.. ఈసారి కీలకమైన ఐదు రాష్ట్రాల ఎన్నికలు, కరోనా ప్రభావం లాంటి అంశాల నేపథ్యంలో ఈ బడ్జెట్ ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక ఈ బడ్జెట్‌పై ఉద్యోగులు, సామాన్యులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. అటు ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి బడ్జెట్ రికవరీ, అలాగే వృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా కారణంగా లాక్‌డౌన్, తొలగింపులు, జీతాల కోతల ఈ వాతావరణంలో వేతన జీవులు, పన్ను చెల్లింపుదారులు ఎక్కువగా ఉపశమన బడ్జెట్‌ను కోరుకుంటున్నారు.


ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు తాజా ట్యాక్స్ స్లాబ్ విషయమై అంతగా సంతృప్తిగా లేరనేది కాదనలేని వాస్తవం. దేశవ్యాప్తంగా ఉన్న 5.89 కోట్ల మంది పన్నుచెల్లింపుదారుల్లో కేవలం ఐదు శాతం మంది మాత్రమే ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ స్లాబ్‌లపై సంతృప్తిగా ఉన్నారంటే ఈ విషయంలో కేంద్రం కొంచెం ఆలోచించాల్సి ఉంది. అందుకే పన్ను చెల్లింపుదారుల విషయమై కొంతమేర ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి కొన్ని షరతులతో పాత పన్ను విధానంతో పాటు కొత్త పన్ను విధానంలో గృహ రుణ వడ్డీపై ప్రామాణిక మినహాయింపు, పన్ను ఉపశమనం వంటి ప్రయోజనాలను జోడించాలని ఆశిస్తున్నారు. 


ముఖ్యంగా 80సీ కింద మినహాయింపుల పెంపుపై వేతన జీవులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 80సీ కింద గరిష్ఠంగా ఇస్తున్న రూ.1.50 లక్షల మినహాయింపుల పరిమితిని రూ.3 లక్షలకు పెంచాలని వేతన జీవులు కేంద్రాన్ని కోరుతున్నారు. దీంతోపాటు ప్రామాణిక మినహాయింపుల(స్టాండర్డ్‌ డిడక్షన్‌)ను మరో రూ.50వేల మేర పెంచితే ఉద్యోగులకు కొంత మేలు జరుగుతుందని అంటున్నారు. 80సీ కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.1.50 లక్షల మినహాయింపులను సవరించక ఏళ్లు గడుస్తున్నాయని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. 80సీ కింద ఇస్తున్న మినహాయింపు కేటగిరీలు ఇప్పటికే విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో వాటిని పునఃసమీక్షించి పరిమితిని రూ.3లక్షలకు పెంచితే పన్ను ప్రణాళిక విషయంలో వేతన జీవులకు కొంత ఉపశమనం లభిస్తుందనేది నిపుణుల అభిప్రాయం.


ప్రస్తుత ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం 60 ఏళ్ల వయస్సు వరకు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి సంవత్సరానికి రూ. 2.5 లక్షలు మాత్రమే. 2014-15 నుంచి ఇప్పటి వరకు ఈ పరిమితిని పెంచలేదు. ప్రస్తుతం వంట నూనే నుంచి పెట్రోల్, డిజిల్‌తో సహా ఇతర అన్ని ఆహార, పానీయాల ధరలు భారీగా పెరిగిపోయాయి. కారు, ఇళ్ల కొనుగోలు సామాన్యులకు గగనంగా మారింది. అటు పిల్లల స్కూల్ ఫీజులు చుక్కలు చూపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు పన్ను చెల్లింపుదారులు తమపై పన్నుల భారం తగ్గేలా బడ్జెట్ ఉండాలని ఆశిస్తున్నారు. 

Updated Date - 2022-02-01T14:52:25+05:30 IST