Girl Kabaddi Players: మహిళా కబడ్డీ ప్లేయర్లకు టాయిలెట్‌ గదిలో అన్నం వడ్డింపు.. యూపీ ప్రభుత్వంపై ముప్పేట దాడి!

ABN , First Publish Date - 2022-09-21T00:55:01+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో అమ్మాయిలకు తీవ్ర అవమానం జరిగింది. పోటీలో పాల్గొన్న అమ్మాయిలకు

Girl Kabaddi Players: మహిళా కబడ్డీ ప్లేయర్లకు టాయిలెట్‌ గదిలో అన్నం వడ్డింపు.. యూపీ ప్రభుత్వంపై ముప్పేట దాడి!

మీరట్: ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో అమ్మాయిలకు తీవ్ర అవమానం జరిగింది. పోటీలో పాల్గొన్న అమ్మాయిలకు టాయిలెట్ గదిలో అన్నం వడ్డించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన వారు యూపీ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. షహరాన్‌పూర్(Saharanpur) జిల్లాలో ఈ నెల 16న అండర్-17 బాలికల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి 200 మంది బాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. 


అంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన వీడియోలు, ఫొటోలు తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి. క్రీడాకారిణుల కోసం సిద్ధం చేసిన  అన్నం, పప్పులు, కూరలు, ఇతర ఆహార పదార్థాల గిన్నెలను టాయిలెట్ గదిలో పెట్టగా అందులోంచే అమ్మాయిలు వడ్డించుకుని తినడం ఆ వీడియోలో కనిపిస్తోంది. అలాగే, పూరీలను టాయిలెట్ గదిలో నేలపై ఓ పేపర్ వేసి ఉంచారు. ఇది చూసిన నెటిజన్లు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. దేశానికి గర్వకారణంగా నిలిచే క్రీడాకారిణులకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్లు చేస్తున్నారు.


వీడియో కాస్తా బయటకు వచ్చి వైరల్ కావడంతో షహరాన్‌పూర్ క్రీడా అధికారి అనిమేష్ సక్సేనా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. వర్షం పడుతుండడంతో మరో మార్గం లేక స్విమ్మింగ్ పూల్ వద్ద భోజనాలు ఏర్పాటు చేశామని, స్టేడియం నిర్మాణ దశలో ఉండడం, వర్షం పడుతుండడంతో వంట పాత్రలను తప్పనిసరి పరిస్థితుల్లో చేంజింగ్ రూములో పెట్టాల్సి వచ్చిందని చెప్పారు.


మరోవైపు, ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ‘‘జై శ్రీరామ్ అని కానీ, భారత్ మాతా కీ జై’’ అని కానీ ఎవరూ నినదించడం లేదంటూ యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. వీళ్లెవరూ ఏమీ చేయరని, ఎవరూ మారరని మరో నెటిజన్ పేర్కొన్నాడు. రిజిస్ట్రేషన్ కోసం తాను పెద్దమొత్తంలో సమర్పించుకున్నానని, నిజానికి దాని ఖర్చు రూ. 2వేలేనని ఆవేదన వ్యక్తం చేశాడు. డబ్బులు ఇచ్చుకోలేకపోతే ఏదో ఒక కారణంతో మనల్ని పక్కనపెట్టేస్తారని పేర్కొన్నాడు.


మరో యూజర్ ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి కామెంట్ చేశాడు. ఈ అమ్మాయిలకు మీరు సాయం చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు కోల్పోతారని అన్నాడు. కాగా, కబడ్డీ అమ్మాయిలకు టాయిలెట్‌లో అన్నం వడ్డించడంపై నలువైపుల నుంచి విమర్శల దాడి మొదలవడంతో యూపీ ప్రభుత్వం స్పందించింది. స్పోర్ట్స్ అధికారి అనిమేష్ సక్సేనాను సస్పెండ్ చేసి దర్యాప్తుకు ఆదేశించింది.



Updated Date - 2022-09-21T00:55:01+05:30 IST