ఏవోబీలో ఏనుగుల బీభత్సం

ABN , First Publish Date - 2022-01-26T04:27:04+05:30 IST

ఏవోబీలో ఏనుగుల బీభత్సం

ఏవోబీలో ఏనుగుల బీభత్సం
ఏనుగులు ధ్వంసం చేసిన ధాన్యం బస్తాలను చూపిస్తున్న రైతులు

పొలాల్లో ధాన్యం ధ్వంసం

ఆందోళనలో రైతులు

ఇచ్ఛాపురం రూరల్‌, జనవరి 25 : ఏవోబీలో ఏనుగుల గుంపు  బీభత్సం సృష్టిస్తోంది. సోమవారం రాత్రి ముచ్చింద్ర పొలాల్లో రైతులకు చెందిన ధాన్యం బస్తాలను ఏనుగులు ధ్వంసం చేశాయి. మంగళవారం రైతులు పొలాలకు వెళ్లి చూడగా ధాన్యం బస్తాలు చెల్లాచెదురుగా కనిపించాయి. అక్కడ ఉన్న అడుగులు, ఆనవాళ్లను బట్టి ఏనుగులుగా నిర్ధారించుకున్న రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కాశీబుగ్గ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి మురళీకృష్ణనాయుడు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒడిశాలోని గోపీనాథపురం కొండల నుంచి ఇక్కడికి వచ్చినట్టు అనుమానిస్తున్నారు. ఏనుగుల దాడిలో సాడి చంద్రశేఖర్‌కు చెందిన 50 బస్తాలు, బీర రామలక్ష్మికి చెందిన 35 బస్తాలు, సాడి గున్నమ్మకు చెందిన 25 ధాన్యం బస్తాలు ధ్వంసమయ్యాయి. ఈ ఏడాది వ్యయప్రయాసలకోర్చి రైతులు ధాన్యం పండించారు. వర్షాలు, చీడపీడలు, అడవి పందుల బెడద మధ్య పండించిన ధాన్యం దిగుబడులు అంతంతమాత్రమే. ఈ పరిస్థితుల్లో పండిన కొద్దిపాటి ధాన్యాన్ని ఇప్పుడు ఏనుగులు ధ్వంసం చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏనుగులను నియంత్రించాలని కోరుతున్నారు. బాధితులను తహసీల్దారు శ్రీహరిబాబు పరామర్శించారు. 

Updated Date - 2022-01-26T04:27:04+05:30 IST