కరెంటు, నీరు లేక...!

ABN , First Publish Date - 2022-04-22T05:11:57+05:30 IST

కవైపు కరెంటు కోతలు, మరోవైపు అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి చుక్కనీరు లేకపోవడంతో సంబంధిత ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది.

కరెంటు, నీరు లేక...!
అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో చుక్క నీరు లేక వెలవెలబోతున్న ప్రాజెక్టు కాలువ

అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి...

ఎండిపోతున్న తోటలు

మూడు గంటలు కూడా రాని కరెంటు

రాజంపేట, పుల్లంపేట మండలాల్లో రైతుల పరిస్థితి దయనీయం 


అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి నీరు రాక... బోర్ల కింద సాగు చేసిన పంటలను కాపాడుకుందామన్నా కరెంటు లేక పంటలు ఎండిపోతుండటంతో రైతన్నల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం రోజుకు 3 గంటలు కూడా వ్యవసాయానికి కరెంటు సరఫరా కావడం లేదు. మామూలుగా అయితే రోజుకు 9 గంటలు వ్యవసాయానికి కరెంటు సరఫరా కావాల్సి ఉంది. 15 రోజులుగా కరెంటు కోతలతో పొలాల వద్ద పడికాపులు కాయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.



రాజంపేట, ఏప్రిల్‌ 21 : ఒకవైపు కరెంటు కోతలు, మరోవైపు అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి చుక్కనీరు లేకపోవడంతో సంబంధిత ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. గత 10 సంవత్సరాలుగా ప్రాజెక్టు ఆధారంగా రాజంపేట, పుల్లంపేట మండలాల్లోని 22 వేల ఎకరాల ఆయకట్టుకు అన్నమయ్య ప్రాజెక్టు ద్వారా నీరు అందాయి. ఖరీఫ్‌, రబీ సీజన్‌లు కలిపి 22,500 ఎకరాలకు నీరందేవి. ప్రాజెక్టులో 2.30 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. అయితే నవంబరులో ప్రాజెక్టు తెగిపోవడం వల్ల చుక్కనీరు లేకుండాపోయింది. ప్రస్తుతం బోరుబావుల ద్వారా భూగర్భజలాలు పుష్కలంగా ఉండటం వల్ల ఈ ఆయకట్టు పరిధిలోని పంటలకు నీరందుతోంది. ఒక్కసారిగా 15 రోజులుగా కరెంటు కోతలు తీవ్రతరం కావడంతో పరిస్థితి తారుమారైంది. మామూలుగా అయితే ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉండటం వల్ల కాలువల ద్వారా, చెరువుల ద్వారా నీరు కావాల్సినంత అందేది. దీనివల్ల మొత్తం పంటలన్నీ పండేవి. ఏడాదికి రెండు పంటలు పండించుకునేవారు. ప్రాజెక్టు ఎలాగో తెగిపోయింది.. ఇక బోరుబావుల ద్వారానైనా పంటలు పండించుకోవాలన్న వారి ఆశలు అడియాశలవుతున్నాయి. బ్రాహ్మణపల్లె, ఆకేపాడు, హస్తవరం, కూచివారిపల్లె, వత్తలూరు, మిట్టమీదపల్లె, కొల్లావారిపల్లె తదితర 20 గ్రామాల పరిధిలోని 5 వేల మంది రైతులకు సంబంధించిన వేలాది ఎకరాల ఆయకట్టు పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం రోజుకు 3 గంటలు కూడా వ్యవసాయానికి కరెంటు సరఫరా కావడం లేదు. మామూలుగా అయితే రోజుకు 9 గంటలు వ్యవసాయానికి కరెంటు సరఫరా కావాల్సి ఉంది. 15 రోజులుగా రోజుకు 3 గంటలు కూడా సరఫరా రాని పరిస్థితి ఉంది. ప్రస్తుతం 5 వేల ఎకరాల పైబడి అరటి, 2 వేల ఎకరాల్లో బొప్పాయి, సుమారు 500 ఎకరాల్లో నిమ్మ, 100 ఎకరాల పైబడి ఆకుతోటలు, దానిమ్మ లాంటి ఇతరత్రా పంటలు సాగు చేశారు. కరెంటు సరఫరాలో రోజురోజుకు తీవ్ర ఇబ్బందులు వస్తుండటంతో పంటలకు నీరందక మలమలా మాడిపోతున్నాయి. చేసేది లేక రైతులు అరటి తోటలను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కిలో అరటి కాయలు 14 రూపాయలు పలుకుతోంది. ఒక్కో గెలకు 600 రూపాయల ఆదాయం వస్తోంది. పంట చేతికందే స్థితిలో నీరందక కాయలన్నీ ఎండిపోతున్నాయి. చెట్లు మలమలామాడిపోతున్నాయి. దీనివల్ల ఒక్కసారిగా చేతికొచ్చే పంటను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎకరాకు ప్రస్తుత రేట్ల ప్రకారం 2 లక్షల రూపాయలకు తక్కువ లేకుండా ఆదాయం వస్తోంది. అటువంటిది కళ్ల ముందే పంటలను ఎండబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక బొప్పాయి తోటలు ఇప్పుడిప్పుడే పంట చేతికందే పరిస్థితిలో ఉన్నాయి. పెద్ద ఎత్తున బొప్పాయి తోటలను సాగు చేశారు. ఎకరాకు 1000 చెట్లు వేసి 50 వేల రూపాయల వరకు ఒక్కో ఎకరాకు ఖర్చు చేసి ఉన్నారు. ఈ పంటలకు ప్రస్తుత సీజన్‌లో పుష్కలంగా నీరందాల్సి ఉంది. అయితే కరెంటు లేనందువల్ల ఈ పంట కూడా ఎండిపోతోంది. ఇక ఆకుతోటలకు నిత్యం నీరు అవసరం. వంద ఎకరాల్లో పైబడి ఊటుకూరు, భువనగిరిపల్లె చుట్టుపక్కల గ్రామాల్లో సాగు చేసిన ఆకుతోటలన్నీ దెబ్బతినే పరిస్థితిలో ఉన్నాయి. ఇక మిట్టమీదపల్లె, కొల్లావారిపల్లె, బావికాడపల్లె, వత్తలూరు ప్రాంతాల్లో 500 ఎకరాల్లో పైబడి నిమ్మ పంట ఉంది. వీటికి కూడా నీరందకపోవడం వల్ల పెద్ద ఎత్తున పంట దెబ్బతింటోంది. చెట్లు మలమలా మాడి ఎండిపోతున్నాయి. ప్రస్తుతం 800 బస్తా నిమ్మకాయలు 4 వేల ధర పలుకుతున్నాయి. నిమ్మచెట్లకు పుష్కలంగా నీరుంటే తప్ప కాయలు సైజుకు రావు. కరెంటు లేక నీరందకపోవడంతో ఈ పంటంతా దెబ్బతింటోంది. అదేవిధంగా ఇతరత్రా పంటలను విరివిగా సాగు చేసి ఉన్నారు. కరెంటు సరఫరాలో తీవ్ర అంతరాయం జరుగుతోంది. 9 గంటలు కరెంటు అన్నది ఒట్టిమాటగా మిగిలిపోయింది. రోజుకు 7 గంటలు తక్కువ లేకుండా విద్యుత్‌ సరఫరా చేస్తామన్న సంబంధిత అధికారుల ప్రకటనలు కూడా ఒట్టి బూటకంగానే ఉన్నాయి. ఈ విధంగా అటు ప్రాజెక్టు తెగిపోయి నీరు లేక, ఇటు కరెంటు సక్రమంగా లేక భూగర్భజలాల్లో ఉన్న నీటిని వాడుకోలేక పంటలు ఎండబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల రైతులు కోట్లాది రూపాయలు నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. 


కరెంటు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి 

కరెంటు సక్రమంగా సరఫరా కాక పంటలన్నీ భారీ ఎత్తున ఎండిపోతున్నాయి. విద్యుత్‌ శాఖాధికారులు రోజుకు 9 గంటలు వ్యవసాయానికి కరెంటు సరఫరా చేస్తామని మూడు గంటలు కూడా సరఫరా చేయడం లేదు. దీనివల్ల మేము పండించిన అరటి, బొప్పాయి పంట పూర్తిగా ఎండిపోయింది. మేము అరటి బొప్పాయి కలిపి 5 ఎకరాల్లో సాగు చేశాం. వీటికి కరెంటు కోత వల్ల నీరు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఇకనైనా విద్యుత్‌ శాఖాధికారులు 9 గంటల కరెంటును సరఫరా చేయాల్సి ఉంది. 

- లవిడి చెంగల్‌రాయులు, ఊటుకూరు


7 గంటలు తక్కువ లేకుండా సరఫరా చేస్తున్నాం

రోజుకు 7 గంటలు తక్కువ లేకుండా వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం. ఇందులో ఎటువంటి దాపరికం లేదు. కొన్ని సాంకేతిక కారణాలు ఏర్పడినప్పుడు మాత్రమే 7 గంటలు సరఫరా చేయలేకపోతున్నాం. ముందుగా 9 గంటలు సరఫరా చేయాల్సి ఉన్నా.. బొగ్గు కొరత వల్ల 7 గంటలకు కుదించాం.. ఏదైనా అవాంతరాలు జరిగితే తప్ప ఖచ్చితంగా ప్రతిరోజూ కరెంటు సరఫరా చేస్తున్నాం. కేవలం 3 గంటలు మాత్రమే విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం అన్నది అవాస్తవం.

- పేరూరు యుగంధర్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, విద్యుత్‌ శాఖ, రాజంపేట



Updated Date - 2022-04-22T05:11:57+05:30 IST