బకాయిల షాక్‌

ABN , First Publish Date - 2020-07-04T11:22:35+05:30 IST

లాక్‌డౌన్‌ వేళ.. గృహ విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగింది. కానీ, అందుకు తగ్గట్టు బిల్లుల చెల్లింపుపై వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు.

బకాయిల షాక్‌

రూ.9 కోట్ల మేర నిలిచిన ‘విద్యుత్‌’ బిల్లులు

లాక్‌డౌన్‌ ప్రభావంతో చెల్లింపునకు వెనుకంజ


(ఇచ్ఛాపురం): లాక్‌డౌన్‌ వేళ.. గృహ విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగింది. కానీ, అందుకు తగ్గట్టు బిల్లుల చెల్లింపుపై వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. మూడు నెలల్లో రూ.9 కోట్ల మేర విద్యుత్‌ బిల్లుల బకాయిలు పేరుకుపోయాయి. మార్చి 23 నుంచి లాక్‌డౌన్‌ మొదలైంది. అప్పటి నుంచే వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. పారిశ్రామిక రంగంలో ఉత్పత్తులు ఆగిపోయాయి. అన్ని రంగాలపైనా లాక్‌డౌన్‌ ప్రభావం పడింది. లాక్‌డౌన్‌ కారణంగా అందరూ ఇళ్లల్లోనే ఉండడం.. మరోవైపు మండువేసవి కావడంతో విద్యుత్‌ వినియోగం పెరిగింది. జిల్లాలో మొత్తం 8,41,337 విద్యుత్‌ సర్వీసులు ఉన్నాయి.


ఏప్రిల్‌లో జిల్లా ప్రజలు 830.97 మెగావాట్ల విద్యుత్‌ వినియోగించారు. గత ఏడాది ఏప్రిల్‌లో 735.05 మెగావాట్లు వినియోగించారు. అంటే ఒక నెలలోనే సుమారు 100 మెగావాట్ల వినియోగం పెరిగింది. ఇలా మూడు నెలల్లోనూ సుమారు 300 మెగావాట్లు అధికంగా వినియోగించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి బిల్లుల చెల్లింపుపై మాత్రం వినియోగదారులు వెనుకంజ వేస్తున్నారు. లాక్‌డౌన్‌ ప్రభావంతో ఆర్థిక ఇబ్బందులు పడుతుండడంతో విద్యుత్‌ బిల్లులు చెల్లించడం లేదు. ఫలితంగా  విద్యుత్‌ శాఖ అధికారులు.. బిల్లుల వసూళ్లు లక్ష్యం సాధించలేకపోతున్నారు.


జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో ఎల్‌టీ, హెచ్‌టీ సర్వీసుల నుంచి లక్ష్యం రూ.186 కోట్లు కాగా... రూ.177 కోట్ల మేర బిల్లులు వసూలయ్యాయి. ఇంకా రూ.9కోట్లు బకాయి ఉందని విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ రమేష్‌ తెలిపారు. బిల్లుల వసూళ్లకు చర్యలు చేపడుతున్నామన్నారు. నెలల తరబడి బకాయిలు ఉన్న పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నామని తెలిపారు. 


పొదుపు పాటించాలి:  రాజేంద్రప్రసాద్‌, విద్యుత్‌ శాఖ ఏడీ 

వేసవిలో గృహ, వాణిజ్య, విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగింది. లాక్‌డౌన్‌ కారణంగా చిన్న పరిశ్రమలు మూతపడినా, విద్యుత్‌ వాడకం తగ్గలేదు. నిరంతరాయంగా సరఫరా చేస్తున్నాం. విద్యుత్‌  పొదుపు పాటించాల్సిన అవసరం ఉంది. 


నిరంతర సరఫరా:  రమణమూర్తి, ఏఈ, ఇచ్ఛాపురం

ఇచ్ఛాపురంలో 26వేల విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. విద్యుత్‌ వినియోగం పెరిగినా.. నిరంతరాయంగా సరఫరా అందిస్తున్నాం. రోజుకు 80 వేల యూనిట్ల విద్యుత్‌ ఖర్చవుతోంది. పూర్తిస్థాయిలో బిల్లుల వసూళ్లకు చర్యలు చేపడుతున్నాం.   

Updated Date - 2020-07-04T11:22:35+05:30 IST