వానలో ఎలక్ర్టిక్‌ వాహనాలు ఇలా...

ABN , First Publish Date - 2020-08-19T05:35:09+05:30 IST

ఎడతెరిపిలేని వానలు... రోడ్లపై పారే నీళ్లు... ఈ సీజన్‌లో వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోతే తరువాత అవస్థలు పడక తప్పదు. ముఖ్యంగా సాధారణ కార్లతో పోలిస్తే ఎలక్ర్టిక్‌ వాహనా (ఈవీ)ల విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలి. వానాకాలంలో ఈవీలు సురక్షితం కాదని కొంతమందిలో అపోహ ఉంది...

వానలో ఎలక్ర్టిక్‌ వాహనాలు ఇలా...

ఎడతెరిపిలేని వానలు... రోడ్లపై పారే నీళ్లు... ఈ సీజన్‌లో వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోతే తరువాత అవస్థలు పడక తప్పదు. ముఖ్యంగా సాధారణ కార్లతో పోలిస్తే ఎలక్ర్టిక్‌ వాహనా (ఈవీ)ల విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలి. వానాకాలంలో ఈవీలు సురక్షితం కాదని కొంతమందిలో అపోహ ఉంది. కానీ ఇందులో నిజం లేదని, చిన్న చిన్న సూచనలు పాటిస్తే వీటిపైనా దూసుకుపోవచ్చని అంటున్నారు ‘టాటా మోటార్స్‌ లిమిటెడ్‌’ ఎలక్ర్టికల్‌ వెహికిల్‌ అండ్‌ ఆల్ఫా ఆర్కిటెక్చర్‌ ప్రొడక్ట్‌ లైన్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ కులకర్ణి. 


బ్యాటరీ: సాధారణంగా వర్షాకాలంలో గాలిలో ఉండే తేమ కారణంగా తుప్పు పట్టే అవకాశాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా బ్యాటరీ కనెక్టర్స్‌ లాంటి వాటికి! దీనివల్ల బ్యాటరీ లైఫ్‌ తగ్గుతుంది. అందుకే బ్యాటరీతో పాటు ముఖ్యమైన కనెక్టర్స్‌ను పరీక్షించడం వీలైతే జెల్‌ పెట్టడం వల్ల తుప్పు పట్టకుండా కాపాడుకోవచ్చు. 

పార్కింగ్‌: నగరాల్లో ఉండేవారికి పార్కింగ్‌ అతి పెద్ద సమస్య. వర్షంలో కారు నిలిపినప్పుడు కవర్‌ కప్పడం మంచిదే. కానీ మిగిలిన సమయాల్లో తీయడమే ఉత్తమం. లేదంటే కారు ఎక్స్‌టీరియర్స్‌కు కవర్‌ అంటుకుని పెయింట్‌కు నష్టం జరిగే అవకాశాలున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే వాటర్‌ ఫ్రూఫ్‌ కవర్‌ వాడడం ఉత్తమం. 

వైపర్లు: వర్షాకాలంలో సజావుగా ప్రయాణం సాగాలంటే వైపర్లు పక్కాగా పనిచేయాలి. లేదంటో ఇబ్బందులు కొనితెచ్చుకోవడమే అవుతుంది. కొంతమంది బ్యాటరీ అయిపోతుందేమోనని వర్షం వస్తున్నా వైపర్లను సరిగా ఉపయోగించరు. ఇది సరైంది కాదు. 

బ్రేక్‌లు: కారు బ్రేక్‌లు ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాలి. వాటిలో ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే మెకానిక్‌ను సంప్రతించాలి. తరువాత చేయించుకొందాంలే అనే ధోరణి అస్సలు పనికిరాదు.  

క్యాబిన్‌: చాలామంది కారు ఎక్స్‌టీరియర్‌, బ్రేక్స్‌ లాంటి వాటి పట్ల తీసుకున్న శ్రద్ధ ఇంటీరియర్స్‌పై చూపరు. ఈ కాలంలో ఎక్స్‌టీరియర్స్‌ మాత్రమే కాదు, ఇంటీరియర్స్‌ కూడా పాడయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. దీనికి తోడు తడిసిన లెదర్‌ వల్ల దుర్వాసనలు వెదజల్లుతాయి. ఫుట్‌వెల్‌ దగ్గర న్యూస్‌ పేపర్లు వాడటం, ఏసీలను డిస్‌ఇన్‌ఫెక్ట్‌ చేయడం మంచిది. 

చార్జింగ్‌: విద్యుత్‌ వాహనాలను వర్షాకాలంలో ఎలా చార్జ్‌ చేయాలన్నది పెద్ద ప్రశ్న. అయితే కంపెనీ అందించిన చార్జింగ్‌ మెషీన్‌తో నిర్థిష్టమైన చార్జింగ్‌ పాయింట్ల వద్ద పొడి ప్రాంతంలో కారు ఉంచి చార్జ్‌ చేసుకోవచ్చు. అలా చేస్తే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. 

టైర్లు: ఈ సీజన్‌లో రోడ్లపై నీళ్లు సాధారణం. ఇలాంటి పరిస్థితుల్లో అరిగిపోయిన టైర్లతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువ. బండి బయటకు తీసేముందు ఒక్కసారి పరిశీలించండి. అవసరమనుకొంటే టైర్లు మార్చండి. ఆ తరువాత ప్రధానమైనది టైర్లలో ప్రెషర్‌. కంపెనీ సూచించిన స్థాయిలో ప్రెషర్‌ ఉండేలా చూసుకోండి. అలాగే హెడ్‌ లైట్లు, ఇండికేటర్లు చెక్‌ చేసుకోండి. 

ఇది తెలుసుకోండి: వర్షపు నీటిలో ఎలక్ర్టిక్‌ వెహికిల్‌ ప్రయాణిస్తే నిర్టిష్టమైన ఎత్తు వరకూ నష్టమేమీ జరగదు. సాధారణంగా ఈవీలలో బ్యాటరీ ప్యాక్‌ సహా విద్యుత్‌ ఉపకరణాలన్నింటికీ బహుళ అంచెల రక్షణ వ్యవస్థ ఉంటుంది. మెయిన్‌ బ్యాటరీ సెల్ఫ్‌ ఐసొలేట్‌ అయ్యే ఏర్పాట్లు కూడా వీటిల్లో ఉంటాయి.


Updated Date - 2020-08-19T05:35:09+05:30 IST