ధర్మవరం- పాకాల మార్గంలో 15 రోజుల్లో విద్యుత్‌ రైళ్లు

ABN , First Publish Date - 2022-08-07T07:36:13+05:30 IST

గుంతకల్లు రైల్వే డివిజన్‌లో మూడు వేల కిలోమీటర్ల విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయని,

ధర్మవరం- పాకాల మార్గంలో 15 రోజుల్లో విద్యుత్‌ రైళ్లు
తుమ్మణంగుట్ట నుంచి కలికిరికి వెళుతున్న ప్రత్యేక విద్యుత్‌ రైలు


విద్యుదీకరణ పనుల పరిశీలన కోసం 

ములకలచెరువు / వాల్మీకిపురం/రేణిగుంట, ఆగస్టు 6: గుంతకల్లు రైల్వే డివిజన్‌లో మూడు వేల కిలోమీటర్ల విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయని, ఈ మార్గంలో 15 రోజుల్లోగా విద్యుత్‌ రైళ్లను నడుపుతామని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ సోమేశ్‌కుమార్‌ తెలిపారు. బి.కొత్తకోట మండలం తుమ్మణంగుట్ట నుంచి కలికిరి వరకు మూడో విడతలో పూర్తయిన రైల్యే విద్యుదీకరణ పనులను శనివారం ఆయన తనిఖీ చేశారు.రూ.390 కోట్లతో  ఽధర్మవరం నుంచి పాకాల వరకు 227 కిలోమీటర్లలో చేపట్టిన పనులు పూర్తయ్యాయి. ఈ మార్గంలో మిగిలిపోయిన తుమ్మణంగుట్ట నుంచి కలికిరి వరకు చేపట్టిన పనులు తాజాగా ముగియడంతో తనిఖీల నిమిత్తం రైల్వే ఉన్నతాధికారులు వచ్చారు. రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఇంజనీర్‌తో పాటు గుంతకల్లు ఉన్నతాధికారులు తొలుత డీజిల్‌ ఇంజన్‌తో నడిచే ప్రత్యేక రైలులో కలికిరి నుంచి తుమ్మణంగుట్ట వరకు పనులను పరిశీలించుకుంటూ వచ్చారు. అనంతరం తుమ్మణంగుట్ట నుంచి కలికిరి వరకు విద్యుత్‌ ఇంజన్‌తో నడిచే ప్రత్యేక రైలులో తనిఖీలు చేసుకుంటూ వెళ్లారు. పవర్‌డ్రిప్‌ డౌన్‌ టెస్ట్‌, కరెంటు కనెక్షన్‌ టెస్ట్‌, స్పీడ్‌ టెస్ట్‌, షార్ట్‌ సర్క్యూట్లు తదితర పనుల పురోగతిని తనిఖీ చేశారు. తుమ్మణంగుట్ట స్టేషన్‌లో జరిగిన విద్యుదీకరణ పనులను ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ సోమేశ్‌కుమార్‌, గుంతకల్లు రైల్వే డివిజన్‌ ఏడీఆర్‌ఎం మురళీకృష్ణ పరిశీలించారు. అలాగే తుమ్మణంగుట్ట రైల్వేస్టేషన్‌ సమీపంలో జరిగిన ఫ్లైఓవర్‌ బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంతకల్లు రైల్వే డివిజన్‌ పరిధిలోని ధర్మవరం నుంచి పాకాల వరకు విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయన్నారు. ఈ మార్గంలో 15 రోజుల్లోగా విద్యుత్‌ రైళ్లను నడుపుతామని తెలిపారు. అలాగే ధర్మవరం నుంచి గుత్తి వరకు కొంతమేర నిలిచిపోయిన డబ్లింగ్‌ పనులు కూడా చేస్తున్నామని తెలిపారు.సికింద్రాబాద్‌, గుంతకల్లు రైల్వే సీపీడీ నాగులప్రసాద్‌, సీఈడీఈ రెడ్డి, సీఎ్‌సఈ గంగూలీ, సీనియర్‌ డీవోఎం బాలాజీకిరణ్‌, సీనియర్‌ డీఈఈలు మల్లికార్జున, నరేష్‌, డీఎ్‌సటీఈ శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

మీటర్‌ గేజ్‌ నుంచి విద్యుదీకరణ దాకా.....

ధర్మవరం నుంచి ములకలచెరువు మీదుగా పాకాల వరకు ఉన్న రైల్వే మార్గం మీటర్‌ గేజ్‌ నుంచి విద్యుదీకరణకు మారింది. తొలుత బ్రిటీష్‌ వారు 1920లో ఈ మార్గంలో రైల్వే లైను నిర్మించారు. అప్పట్లో ఇది మీటర్‌ గేజ్‌గా ఉండేది. తరువాత 2001వ సంవత్సరంలో బ్రాడ్‌గేజ్‌గా  మారింది.   

Updated Date - 2022-08-07T07:36:13+05:30 IST