న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జులై 5న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఈసీ ప్రకటించింది. జులై 19న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ, ఆగస్ట్ 6న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అదే రోజున కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించి ఫలితం కూడా వెల్లడించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ప్రధాని మోదీ నుంచి ప్రతికూలత ఎదురైన సంగతి తెలిసిందే. ఏబీవీపీ కార్యకర్తగా మొదలుపెట్టి.. జనసంఘ్, భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి సుదీర్ఘకాలం ఆ పార్టీ బాధ్యతలు నిర్వహించిన వెంకయ్యను రాష్ట్రపతి పదవి విషయంలో మోదీ విస్మరించారు.
ఎల్కే ఆడ్వాణీని, ఆయన టీమ్‌ను పక్కన పెడుతూ, తన సొంత టీమ్‌ను నిర్మించుకుంటూ వస్తున్న మోదీ.. వెంకయ్యను కూడా పక్కన పెట్టారు. నిజానికి వెంకయ్య ఉపరాష్ట్రపతి పదవి చేపట్టేందుకు నిరాకరించినప్పుడు కూడా మోదీ ఆయనపై ఒత్తిడి తెచ్చారు. మొదటినుంచీ మోదీకి వెంకయ్య అండగా ఉన్నా ఆయనను దూరంగా ఉంచేందుకే మోదీ ప్రయత్నించారు. అయితే.. రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యను దూరం పెట్టిన మోదీ రెండోసారి కూడా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడినే ప్రతిపాదించే అవకాశం ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.