ఎన్నికల వ్యయం రూ.15.50 కోట్లు..!

ABN , First Publish Date - 2021-02-24T04:57:54+05:30 IST

జిల్లాలో పంచాయతీల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం అక్షరాలా రూ.15.50 కోట్లు పైమాటే.

ఎన్నికల వ్యయం రూ.15.50 కోట్లు..!

పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం చేసిన ఖర్చు

మూడు విడత్లో రూ.10.50 కోట్లు విడుదల

రావాల్సిన నిధులు రూ.5 కోట్లు


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో పంచాయతీల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం అక్షరాలా రూ.15.50 కోట్లు పైమాటే. ఎంపీడీవోలు మొత్తం బిల్లులు పంపితే ఈ వ్యయం పెరగవచ్చని అధికారుల అంచనా. 

జిల్లాలో 806 గ్రామ పంచాయతీలు, 7,892 వార్డులకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇచ్చింది. నాలుగు విడతల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు ప్రకటించారు. జనవరి 29వ తేదితో మొదలైన పల్లెపోరు ప్రక్రియ ఈ నెల 21వ తేదితో ముగిసింది. హైకోర్టు స్టే వల్ల 13 పంచాయతీల ఎన్నికలు వాయిదా  పడ్డాయి. 793 పంచాయతీలకు ఎన్నికలు  నిర్వహించాల్సి ఉండగా అందులో 258 ఏకగ్రీవం కాగా.. ఒక పంచాయతీలో అభ్యర్థులు అందరూ విత్‌డ్రా చేసుకోవడంతో 534 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 

ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సుమారు రూ.15.50 కోట్లు ఖర్చు చేసింది. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ, ఓటరు బ్యాలెట్‌ పత్రాలు,  ఓటర్ల జాబితా, ఎన్నికల నియమావళి పుస్తకాల ముద్రణ, బ్యాలెట్‌ బాక్సులు మరమ్మతులు, క్లీనింగ్‌, బ్యారికేడ్లు, షామియానాలు, తాగునీరు వంటి ఏర్పాట్లు, ఓటరు స్లిప్పులు, వీడియో చిత్రీకణ వంటి వాటికి ఖర్చు చేశారు. 

ఎన్నికల విధుల్లో నాలుగు విడతల్లో పీవోలు, ఏపీవోలు, ఓపీవోలు, ఇతర సిబ్బంది కలిపి సుమారుగా 20 వేల మంది పాల్గొన్నారు. స్టేజ్‌-1, స్టేజ్‌-2 ఆఫీసర్లు, ఆర్‌వోలు, మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్‌ సిబ్బందికి ప్రభుత్వం కేటాయించిన మేరకు రోజు వారి టీఏ, డీఏలు చెల్లించాలి. అలాగే.. పోలింగ్‌ సిబ్బందిని మండల కేంద్రాల నుంచి వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు చేర్చేందుకు ఆర్టీసీ బస్పులు అద్దెకు తీసుకున్నారు. సిబ్బంది టీఏ, డీఏలు రూ.4.50 కోట్లు, రవాణా రూ.2.50 కోట్లు, మౌలిక వసతులకు రూ.2.50 కోట్లు, వీడియో చిత్రీకణ, సీసీ కెమరాలకు రూ.1.50 కోట్లు, మిసిలేనియర్స్‌ రూ.కోటి, ఇతర ఖర్చులు రూ.4 కోట్లు వెచ్చించినట్లు అంచనా వేశారు. ఇందులో మూడు విడతల్లో రూ.10.50 కోట్లు నిధులు వచ్చాయని, మరో రూ.5 కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని డీపీవో ప్రభాకర్‌రెడ్డి ఆంధ్రజ్యోతికి వివరించారు. రక్షణ విధుల్లో ప్రతి విడతకు 2 వేల మంది పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. ఈ లెక్కన నాలుగు విడత్లో 8 వేల మంది సిబ్బందికి నిబంధన ప్రకారం టీఏ, డీఏ చెల్లించారు.


Updated Date - 2021-02-24T04:57:54+05:30 IST