‘శివారు’ సూపర్‌

ABN , First Publish Date - 2020-12-03T06:05:48+05:30 IST

గ్రేటర్‌ పోరులో శివారు డివిజన్ల ఓటర్లు చైతన్యం కనబరిచారు. నగరంలోని మిగతా డివిజన్లతో పోల్చితే ఓటింగ్‌ నమోదులో శివారులోని మూడు డివిజన్లు అదుర్స్‌ అనిపించాయి.

‘శివారు’ సూపర్‌

సంగారెడ్డి జిల్లాలోని మూడు డివిజన్లలోనూ అత్యధిక శాతం ఓటింగ్‌

గ్రేటర్‌ పోలింగ్‌లో ఆర్సీపురం అదుర్స్‌ 

తర్వాత స్థానాల్లో పటాన్‌చెరు, భారతీనగర్‌

ఉత్సాహం చూపించిన బస్తీ ఓటర్లు.. కాలనీల్లో నిరాసక్తత

పోలింగ్‌ బూత్‌లకు కదిలొచ్చిన కార్మికవర్గం


పటాన్‌చెరు, డిసెంబరు 2 : గ్రేటర్‌ పోరులో శివారు డివిజన్ల ఓటర్లు చైతన్యం కనబరిచారు. నగరంలోని మిగతా డివిజన్లతో పోల్చితే ఓటింగ్‌ నమోదులో శివారులోని మూడు డివిజన్లు అదుర్స్‌ అనిపించాయి. సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు, రామచంద్రాపురం(ఆర్సీపురం), భారతీనగర్‌ డివిజన్లలో అత్యధిక పోలింగ్‌ శాతం నమోదైంది. అందులోనూ 112వ డివిజన్‌ అయిన ఆర్సీపురం గ్రేటర్‌లోనే రికార్డు స్థాయి పోలింగ్‌ను నమోదు చేసింది. 

పటాన్‌చెరు డివిజన్‌లో మొత్తం 41,667 ఓట్లకు గాను 27,396 మంది ఓటేశారు. 65.75 శాతం పోలింగ్‌ నమోదైంది. రామచంద్రాపురం డివిజన్‌ పరిధిలో అత్యధికంగా 67.71 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 28,118 ఓట్లకు గాను 19,039 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారతీనగర్‌ డివిజన్‌ పరిధిలో 61.89 శాతం నమోదైంది. మొత్తం 31,829 ఓటర్లకు గాను 19,699 మంది ఓటేశారు. మొత్తం మూడు డివిజన్ల పరిధిలో 1,01,614 ఓటర్లు ఉండగా అందులో పురుషులు 52,032 ఉండగా 49,578 మంది మహిళా ఓటర్లు, ఇతరులు నలుగురు ఉన్నారు. ఎన్నికల్లో 66,134 మంది ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. అందులో 34,521 మంది పురుషులు, 31,613 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని మొత్తం 150 డివిజన్లలో రామచంద్రాపురం డివిజన్‌లో 67.71 శాతం పోలింగ్‌తో ప్రథమ స్థానంలో నిలిచింది. పటాన్‌చెరు, భారీనగర్‌ డివిజన్లు రెండు మూడు స్థానాల్లో నిలవడం గమనార్హం. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పోల్చితే పోలింగ్‌ శాతం పెరిగింది. గత ఎన్నికల్లో పటాన్‌చెరులో 57.96 శాతం నమోదవగా ఈసారి 7.79 శాతం ఓటింగ్‌ పెరిగింది. ఆర్సీపురం గతంలో 58.30 శాతం నమోదవగా ఈసారి 9.41 శాతం పోలింగ్‌ పెరిగింది. భారతీనగర్‌లో 53.36 శాతం కాగా గతం కంటే 8.53 శాతం ఎక్కువగా నమోదైంది.


బస్తీ ఓటరు భేష్‌ 

మూడు డివిజన్లలో కాలనీ ఓటర్లతో పోల్చితే బస్తీ ఓటరు పోలింగ్‌ కేంద్రాలకు ఎక్కువగా తరలివచ్చారు. ఆర్సీపురం(112) డివిజన్‌ పరిధిలో పాత రామచంద్రాపురంలోని పోలింగ్‌ బూత్‌లలో 75 నుంచి 80 శాతం వరకు పోలింగ్‌ నమోదైంది. కాలనీలలో మాత్రం 45 నుంచి 50 శాతమే ఓటేశారు. పటాన్‌చెరు(113) డివిజన్‌ పరిధిలోని చైతన్యనగర్‌, పటాన్‌చెరు పాత పట్టణం, బండ్లగూడ పరిధిలోని పోలింగ్‌ బూత్‌లలో 70 నుంచి 80 శాతం పోలింగ్‌ నమోదైంది. బండ్లగూడ మార్క్స్‌నగర్‌ 51వ పోలింగ్‌బూత్‌లో 627 ఓట్లకు 505 ఓట్లు పోలింగ్‌ కాగా అత్యధికంగా 80.54 శాతం నమోదైంది. పటాన్‌చెరు పట్టణంలోని జేపీ.కాలనీ సెయింట్‌ మేరీస్‌ పాఠశాలలోని 28వ పోలింగ్‌బూత్‌లో 981 ఓట్లకు గాను 423 ఓట్లు పోలై అతి తక్కువగా 43.63 శాతం నమోదైంది. 


చైతన్యం కనబర్చిన కార్మికులు 

పటన్‌చెరు, రామచంద్రాపురం, భారతీనగర్‌ డివిజన్లు ప్రధానంగా పారిశ్రామికవాడ పట్టణాలు. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఉండే కార్మికుల కుటుంబాలు ఓట్లు వేసేందుకు ఆసక్తిని చూపించారు. పటాన్‌చెరు, పాషమైలారం పారిశ్రామికవాడల్లోని పరిశ్రమలకు సెలవు ప్రకటించడం కూడా  ఓటింగ్‌ పెరగడానికి తొడ్పడింది. అన్ని పార్టీల రాజకీయ నాయకులు కార్మికుల యూనియన్‌ కార్యకలాపాల్లో పాలుపంచుకోవడం వల్ల సత్సబంధాలున్నాయి. ఆయా పార్టీలకు అనుబంధంగా పనిచేసే కార్మిక సంఘాలు సైతం ఎన్నికలను ప్రభావితం చేయడం పారిశ్రామికవాడ రాజకీయాల్లో ఆనవాయితీగా వస్తోంది. పోలింగ్‌శాతం పెరిగేందుకు ఇది దోహదపడింది.  


అభ్యర్థులు, నాయకుల కృషి                                        

ఓటింగ్‌ శాతం పెరిగేందుకు ఆయా పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు కావడం కూడా పోలింగ్‌ శాతం పెరిగేందుకు దోహదపడింది. పటాన్‌చెరులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జేపీ.కాలనీ నుంచి బీజేపీ అభ్యర్థి గౌతంనగర్‌ నుంచి, కాంగ్రెస్‌, టీడీపీ అభ్యర్థులు బండ్లగూడకు చెందిన వారు కావడంతో స్థాన బలంతో ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు తరలించేందుకు కృషి చేశారు. గ్రేటర్‌లోనే ఎక్కువ శాతం పోలింగ్‌ నమోదైన 112వ డివిజన్‌ రామచంద్రాపురంలో బస్తీలు అనేకం ఉన్నాయి. బస్తీవాసులు ఓటు వేసేందుకు ఆసక్తిని చూపించారు. పైగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి రామచంద్రాపురం పట్టణానికి చెందిన వారు కాగా బీజేపీ అభ్యర్థి అశోక్‌నగర్‌ నివాసి కావడంతో చుట్టు పక్కల ఉన్న కాలనీలలో పోలింగ్‌ శాతం పెరిగేందుకు కృషి చేశారు. పోలింగ్‌ తక్కువశాతం నమోదైతే ఇబ్బందులు తలెత్తుతాయని భావించి ఓటర్లను కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. ముందు రోజు రాత్రి పెద్ద ఎత్తున ఓటర్లకు నగదు పంపిణీ చేసి ఓటు వేయాల్సిందిగా ప్రత్యేకించి అభ్యర్థించారు. నగదు తీసుకుని ఓటు వేయకపోతే సమస్యలు తలెత్తుతాయని భావించి కొందరు ఓటింగ్‌లో పాల్గొన్నట్లు భావిస్తున్నారు. కొన్ని కాలనీల్లో నివాసం ఉండే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఓట్లు వేసేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. కరోనాతో భయపడి కొందరు ఇంటికే పరిమితం కాగా, కొందరు వరుస సెలవులు రావడంతో వివాహాలకు వెళ్లినట్లు తెలిసింది.


డివిజన్ల వారీగా నమోదైన పోలింగ్‌ శాతం

  డివిజన్‌ 2016 2020

 రామచంద్రాపురం 58.30 67.71

 పటాన్‌చెరు 57.96 65.77

 భారతీనగర్‌ 53.36 61.89


ఎవరి ధీమా వారిది

హోరాహోరీగా సాగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముగియడంతో అభ్యర్థులు, ఆయా పార్టీల నాయకులు ఎన్ని ఓట్లు తమకు పడుతాయో సమీక్ష చేసుకున్నారు. బుధవారం అభ్యర్థులు లెక్కల్లో తలమునకలయ్యారు. పెరిగిన పోలింగ్‌ శాతం ఎవరికి మేలు చేస్తుందో లెక్కింపు వరకు వేచి చూడాల్సిందే. 

ఇదిలా ఉండగా పోలింగ్‌ సరళిపై అభ్యర్థులు, ఆయా పార్టీల నాయకులు బేరీజు వేసుకుంటున్నారు. బూత్‌ల వారీగా పోలైన ఓట్లలో తమకు ఏ మేరకు పడ్డాయన్న దానిపై ఆరా తీశారు. తటస్థ ఓటర్ల తీర్పుపైనే అభ్యర్థుల గెలుపు ఓటముల ప్రభావం ఉండబోతోంది. ప్రధానంగా టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు నిర్వహించిన ప్రచారం సంకుల సమరాన్ని తలపించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌, ఎంపీ అరవింద్‌, ఎమ్మెల్యే రఘునంధన్‌రావులు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం సాగించారు. బండి సంజయ్‌ సభ సక్సెస్‌ కావడంతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున ఎన్నికల మాంత్రికుడు, మంత్రి హరీశ్‌రావు తన వ్యూహాలకు పదును పెట్టి స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకత్వాన్ని ఉరుకులు, పరుగులు పెట్టించారు. స్థానికంగా కార్మికుల ఓట్లు అధికంగా ఉండడంతో వారిని ఆకట్టుకునే విధంగా చేసిన ప్రసంగాలు ఫలితం చూపించాయి. ఆయా పార్టీల కార్యకర్తల ఓట్లను వదిలేస్తే తటస్థ ఓటర్లు ఎవరికి ఆకర్శితులయ్యారనేది కీలకంగా మారింది. గెలుపుపై ఎవరికి వారుగా ధీమాను వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2020-12-03T06:05:48+05:30 IST