మమ్మల్ని మా ఇంట్లోకి రానీ బిడ్డా !

ABN , First Publish Date - 2022-06-29T15:51:55+05:30 IST

వృద్ధాప్యంలో ఉన్న అమ్మానాన్నకు అండగా ఉండాల్సిన ఓ కొడుకు భార్యతో కలిసి వారిని రోడ్డునపడేశాడు. దీంతో కలెక్టర్‌ను ఆశ్రయించిన ఆ వృద్ధ దంపతులను

మమ్మల్ని మా ఇంట్లోకి రానీ బిడ్డా !

అమ్మానాన్నను రోడ్డునపడేసిన పుత్రరత్నం 

హైదరాబాద్/మన్సూరాబాద్‌: వృద్ధాప్యంలో ఉన్న అమ్మానాన్నకు అండగా ఉండాల్సిన ఓ కొడుకు భార్యతో కలిసి వారిని రోడ్డునపడేశాడు. దీంతో కలెక్టర్‌ను ఆశ్రయించిన ఆ వృద్ధ దంపతులను వారి ఇంట్లోకి చేర్చాలని అధికారులను ఆదేశించారు. ఆ మేరకు అధికారులు యత్నించగా విషయం తెలుసుకున్న ఆ పుత్రరత్నం ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. దీంతో వారి ఇంటి ముందే ఆ దంపతులు నిరసనకు దిగారు. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మన్సూరాబాద్‌ డివిజన్‌ శ్రీరాంనగర్‌ కాలనీకి చెందిన కావేటి లింగమయ్య, కౌసల్యాదేవి దంపతులకు చంద్రశేఖర్‌, రాజశేఖర్‌ కుమారులు. చంద్రశేఖర్‌ తన కుటుంబంతో కలిసి హయత్‌నగర్‌లో ఉంటున్నారు.


చిన్నకొడుకు రాజశేఖర్‌, అతని భార్య జయశ్రీతో కలిసి తల్లిదండ్రులతోనే ఉంటున్నారు. వారుంటున్న ఇల్లు కౌసల్యాదేవి పేరిట ఉంది. అయితే, రాజశేఖర్‌, జయశ్రీ కొన్నాళ్లుగా ఆస్తి కోసం సదరు వృద్ధ దంపతులను వేధింపులకు గురి చేస్తున్నారు. ల్యాండ్‌ మాఫియాతో చంపిస్తామని బెదిరించారు. మరోపక్క, కౌసల్యాదేవీ, రాజశేఖర్‌ కలిసి ఓ బ్యాంక్‌లో జాయింట్‌ లాకర్‌ తెరిచారు. అందులో కౌసల్యాదేవికి చెందిన 10 తులాల బంగారం భద్రపరిచారు. కొన్నాళ్ల క్రితం రాజశేఖర్‌ ఆ బంగారాన్ని మాయం చేయగా, ఇదేమని ప్రశ్నించిన తల్లిదండ్రులను భార్యతో కలిసి వేధింపులకు గురి చేశాడు. వాళ్లని చీకటి గదిలో వేసి ఎవరితోనూ మాట్లాకుండా చేశాడు.  ఇల్లు, ఇతర ఆస్తులన్నీ తనకే ఇవ్వాలని బెదిరించేవాడు. వీటిని భరించలేక ఆ దంపతులు గత సెప్టెంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రాజశేఖర్‌ తన తల్లిదండ్రులను ఇంటి నుంచి వెళ్లగొట్టగా.. హ్యూమన్‌రైట్స్‌ పీపుల్‌ వాచ్‌ కమిటీ ఆ దంపతులను దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ఆశ్రమంలో చేర్చింది.


అనంతరం తమకు జరిగిన అన్యాయంపై ఆ దంపతులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్‌ ఆ దంపతులకు వారి ఇంటితోపాటు బంగారాన్ని ఇప్పించాలని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌, ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆ దంపతులను వారి ఇంట్లోకి పంపేందుకు అధికారులు మంగళవారం వచ్చారు. కానీ, రాజశేఖర్‌, జయశ్రీ అప్పటికే ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఆ వృద్ధ దంపతులు తమ ఇంటి ముందే నిరసనకు దిగారు. మధ్యాహ్నం వరకు నిరసన చేసిన వారిని హ్యూమన్‌రైట్స్‌ పీపుల్‌ వాచ్‌ కమిటీ ప్రతినిధులు తిరిగి ఆశ్రమానికి తీసుకెళ్లారు.

Updated Date - 2022-06-29T15:51:55+05:30 IST