ఈ-కేవైసీ చేసుకోవాల్సిందే

ABN , First Publish Date - 2022-05-21T06:15:19+05:30 IST

సంవత్సరానికి రూ.ఆరువేలు (పదకొం డో విడత) రైతుల ఖాతాల్లో జమకావాలంటే అర్హులైన వారంతా ఈ నెల 31వ తేదీలోగా ఈకేవైసీ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

ఈ-కేవైసీ చేసుకోవాల్సిందే

 పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధికి తప్పనిసరి 8 ఈ నెల 31వ తేదీ వరకు గడువు

 రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు

మోత్కూరు, మే 20: సంవత్సరానికి రూ.ఆరువేలు (పదకొం డో విడత) రైతుల ఖాతాల్లో జమకావాలంటే అర్హులైన వారంతా ఈ నెల 31వ తేదీలోగా ఈకేవైసీ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. రైతుల ఆధార్‌ లింకు ఉన్న బ్యాంకు ఖాతాలకు సెల్‌ నెంబర్లు అనుసందానం సరిగా లేకపోవడం, మరణించిన రైతుల వివరాలు తొలగించకపోవడంలాంటి సమస్యలతో అనర్హులకు నిధులు జమవుతున్నట్లు కేంద్రం గుర్తించింది. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా మరోసారి ఈకేవైసీ చేయించాలని సూచించింది. 


గ్రామాల్లో రైతులకు అవగాహన 

జిల్లాలో 1,08,826 మంది రైతులకుగాను ఇప్పటివరకు 2061 మంది రైతులు ఈకేవైసీ చేయించుకోగా, ఇంకా 1,06,675 మంది రైతులు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. ఈ నెలాఖరులోగా ఐదెకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులు ఈకేవైసీ నమోదు చేయించుకోలేదంటే కేంద్రం సంవత్సరానికి ఒకసారి ఇచ్చే రూ.ఆరువేలు రైతుల ఖాతాల్లో జమ కాకుండా ఆగిపోతాయని గ్రామాల్లో రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. మండల పరిషత్‌ సమావేశాల్లో, రైతువేదికల్లో నిర్వహించే రైతుల అవగాహన సమావేశాల్లో ఏవోలు, ఏఈవోలు ఈ విషయాన్ని రైతులకు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఐదెకరాల్లోపు రైతులకు రూ.రెండు వేల చొప్పున మూడు విడతల్లో సంవత్సరానికి రూ.ఆరువేలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తోంది. 


నమోదు చేసుకోండిలా..

రైతులు పీఎం కిసాన్‌ పోర్టల్‌ ఉచిత యాప్‌ ద్వారా ఈకేవైసీని నమోదు చేసుకోవచ్చు. లేదా మీ సేవ, ఈ సేవ కేంద్రాల్లో, ఏఈవోల వద్ద నమోదు చేసుకోవచ్చు. సొంతంగా నమోదు చేసుకోవడానికి పీఎం కిసాన్‌ పోర్టల్‌ ఓపెన్‌చేసి అందులో ఫార్మర్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. వెంటనే సెర్చ్‌ బటన్‌ నొక్కాలి. ఆధార్‌కు అనుసంధానమైన సెల్‌ఫోన్‌ నంబ రు నమోదు చేసి ఓటీపీ కోసం క్లిక్‌ చేయాలి. ఓటీపీని నమోదుచేసి ఆధార్‌ ఓటీపీ కోసం మరోసారి క్లిక్‌ చేయాలి. దాన్నీ నమోదు చేయాలి. ఓటీపీ పరిశీలన అనంతరం ఈకేవైసీ సక్సెస్‌ అని వస్తుంది. ఆధార్‌, సెల్‌ఫోన్‌ లింక్‌ చేయించని వారు, ఇతర ఇబ్బందులు ఉన్న రైతులు మీ సేవా కేంద్రాలకు వెళ్లి చేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు.



ఈ నెల 31లోగా నమోదు చేసుకోవాలి :  వెంకటేశ్వర్‌రావు, ఏడీఏ, ఆలేరు 

పీఎంకిసాన్‌ సమ్మాన్‌నిధి 11వ విడత డబ్బులు రైతుల బ్యాంకు ఖాతా ల్లో జమ కావడానికి రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ నమోదు చేసుకోవా లి. ఈ నెల 31వరకు నమోదుకు గడువు ఉంది. స్మార్ట్‌ ఫోన్‌ ఉన్నవారు సొంతంగాగాని, లేదా మీ సేవా కేంద్రాల్లో గాని ఈకేవైసీ నమోదు చేసుకోవాలి. 

Updated Date - 2022-05-21T06:15:19+05:30 IST