Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 16 Jul 2022 17:31:37 IST

Eknath Shinde: ఏక్‌నాథ్ షిండే సర్కార్ కీలక నిర్ణయం.. ఉద్ధవ్ కంటే ఒకడుగు ముందుకేసి మరీ..

twitter-iconwatsapp-iconfb-icon
Eknath Shinde: ఏక్‌నాథ్ షిండే సర్కార్ కీలక నిర్ణయం.. ఉద్ధవ్ కంటే ఒకడుగు ముందుకేసి మరీ..

ముంబై: మహారాష్ట్రలో (Maharashtra) రాజకీయ సంక్షోభానికి తెరపడినప్పటికీ శివసేన (Shivsena) పార్టీలో మాత్రం బాల్‌ఠాక్రేకు (Bal Thackeray) తామే నిజమైన వారసులమని, తామే నిజమైన హిందుత్వవాదులమని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే ప్రయత్నాలు మాత్రం ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తాజాగా.. బీజేపీతో (BJP) కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శివసేన రెబల్ నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) శనివారం తీసుకున్న నిర్ణయం ఈ విషయాన్ని రుజువు చేసింది. ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) ముఖ్యమంత్రిగా దిగిపోయే కొన్ని గంటల ముందు ఆయన కేబినెట్ మహారాష్ట్రలోని రెండు నగరాల పేర్లు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఔరంగాబాద్ (Aurangabad), ఉస్మానాబాద్ (Osmanabad) నగరాల పేర్లను శంభాజీనగర్ (Sambhaji Nagar), ధారాశివ్‌గా (Dharashiv) మార్చుతున్నట్లు ఉద్ధవ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి కొన్ని గంటల ముందు ప్రకటించారు. ఈ చర్య ద్వారా ఉద్ధవ్ తాను కూడా హిందుత్వవాదినేనని ఆయనపై అప్పటివరకూ వచ్చిన ‘హిందూ వ్యతిరేకి’ అనే విమర్శను చెరిపేసుకునేందుకు ప్రయత్నం చేశారు.


తాజాగా.. ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం కూడా ఔరంగాబాద్, ఉస్మానాబాద్ నగరాల పేర్లను ఛత్రపతి శంభాజీనగర్ (Chhatrapati Sambhaji Nagar), ధారాశివ్‌గా (Dharashiv) మార్చే ప్రతిపాదనపై దృష్టి పెట్టింది. ఆ ప్రతిపాదనకు షిండే కేబినెట్ (Eknath Shinde Cabinet) శనివారం నాడు ఆమోదం తెలిపింది. గవర్నర్ మెజార్టీని నిరూపించుకోవాలని చెప్పిన తర్వాత కూడా మైనార్టీలో పడిన ఉద్ధవ్ ప్రభుత్వం నగరాల పేర్లను మార్చుతూ నిర్ణయం తీసుకుందని, ఆ పేర్ల మార్పు చెల్లదని షిండే ప్రభుత్వం చెబుతోంది. పైగా.. బీజేపీతో కలిసి తాము ఏర్పాటు చేసిన ప్రభుత్వం హిందువుల పట్ల పూర్తి సానుకూల వైఖరితో ఉందని చెప్పేందుకు శంభాజీనగర్‌కు ముందు ‘ఛత్రపతి’ అని కూడా చేర్చి బాల్‌ఠాక్రే నిజమైన వారసత్వం తమదేనని ఏక్‌నాథ్ షిండే తాజాగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. తాజాగా నగరాల పేర్లను మార్చుతూ చేసిన కొత్త ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు, కేంద్రానికి కూడా ఈ సమాచారం పంపినట్లు షిండే సర్కార్ ప్రకటన విడుదల చేసింది. నేవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పేరును కూడా డీబీ పాటిల్ ఎయిర్‌పోర్ట్‌గా మార్చినట్లు ఆ ప్రకటనలో షిండే ప్రభుత్వం తెలిపింది.


బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) కూడా పలు నగరాల పేర్లను మార్చుతూ యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్రలో (Maharashtra) ఔరంగాబాద్, ఉస్మానాబాద్ నగరాల పేర్ల మార్పు కూడా అలాంటిదే. హిందుత్వ రాజకీయాలకు చేస్తానని చెప్పుకునేందుకు ఏమాత్రం వెనుకాడని బాల్‌ఠాక్రే ఔరంగాబాద్ పేరును శంభాజీనగర్‌గా గతంలోనే మార్చారని, దానికి ప్రజల ఆమోదం కూడా లభించిందని శివసేన అధికార పత్రిక సామ్నా అప్పట్లోనే స్పష్టం చేసింది. శివసేన పత్రిక సామ్నాలో రాసే వ్యాసాల్లో కూడా ఔరంగాబాద్ పేరును శంభాజీనగర్‌గానే రాస్తుంటారు. ఔరంగజేబు లాంటి ఒక నియంత పేరు మీద నగరం పేరు ఉండకూడదని, అందుకే పేరు మార్పు అనివార్యమని ‘శంభాజీనగర్‌’కు మద్దతు తెలిపే రాజకీయ పార్టీల ప్రధాన వాదన.


శివసేన (Shivsena), బీజేపీ (BJP) 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేశాయి. 288 అసెంబ్లీ సీట్లకు గానూ బీజేపీ 105, మిత్రపక్షమైన శివసేన 58 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి ఉన్నప్పటికీ బీజేపీ, శివసేన మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. చెరో రెండున్నరేళ్ల కాలం పదవీ కాలాన్ని పంచుకోవాలనే షరతుకు బీజేపీ ‘నో’ చెప్పడంతో శివసేన తిరుగుబాటు చేసింది. బీజేపీకి మద్దతు ఇవ్వకపోవడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ (Congress), ఎన్సీపీ (NCP) మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వంలో శివసేనకు (Shivsena) ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఉద్ధవ్ ఠాక్రే సీఎం అయ్యారు. ఇటీవల జరిగిన పరిణామాలతో.. ఉద్ధవ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ మద్దతుతో ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. నిజమైన శివసేన మాదంటే మాదంటూ ఉద్ధవ్, షిండే మధ్య ఇప్పటికీ రాజకీయం నడుస్తోంది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.