నామినేటెడ్‌ కల...నెరవేరిన వేళ!

ABN , First Publish Date - 2021-07-18T05:37:48+05:30 IST

వైసీపీ నేతల్లో అత్యధికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేటెడ్‌ పదవుల లెక్కల ఎట్టకేలకు తేలింది. జిల్లాలో ఎనిమిది మందికి పదవులు దక్కాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సామాజిక సమతూకం పాటిస్తూ... సీనియార్టీని పరిగణనలోకి తీసుకొని పదవులు కట్టబెట్టినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తం ఎనిమిది పదవులకుగాను... ఐదింటిని మహిళలకే కేటాయించడం విశేషం. ఈసారి నేతల భార్యలు, తల్లులకు పదవులిచ్చారు. మొత్తం ఎనిమిది పదవుల్లో...ఇద్దరికి రాష్ట్ర స్థాయి బోర్డు చైర్మన్లుగా, ఒకరికి ఆర్టీసీ జోనల్‌ చైర్‌పర్సన్‌గా, నలుగురికి జిల్లా స్థాయి పదవులు దక్కాయి.

నామినేటెడ్‌ కల...నెరవేరిన వేళ!

జిల్లాలో ఎనిమిది మందికి పదవులు

ఐదుగురు మహిళా నేతలకు కీలక పోస్టులు

 (విజయనగరం-ఆంధ్రజ్యోతి/పార్వతీపురం/కొత్తవలస/నెల్లిమర్ల)

వైసీపీ నేతల్లో అత్యధికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేటెడ్‌ పదవుల లెక్కల ఎట్టకేలకు తేలింది. జిల్లాలో ఎనిమిది మందికి పదవులు దక్కాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సామాజిక సమతూకం పాటిస్తూ... సీనియార్టీని పరిగణనలోకి తీసుకొని పదవులు కట్టబెట్టినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తం ఎనిమిది పదవులకుగాను... ఐదింటిని మహిళలకే కేటాయించడం విశేషం. ఈసారి నేతల భార్యలు, తల్లులకు పదవులిచ్చారు. మొత్తం ఎనిమిది పదవుల్లో...ఇద్దరికి రాష్ట్ర స్థాయి బోర్డు చైర్మన్లుగా, ఒకరికి ఆర్టీసీ జోనల్‌ చైర్‌పర్సన్‌గా, నలుగురికి జిల్లా స్థాయి పదవులు దక్కాయి. ఎస్‌.కోట నియోజకవర్గానికి చెందిన నెక్కల నాయుడుబాబుకు డీసీసీబీ అధ్యక్షుడిగా ప్రకటించారు. ఆయన వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ పదవిని వేరొకరికి అప్పగించడంలో భాగంగా డీసీసీబీ అధ్యక్ష పదవిని ఆయనకు కట్టబెట్టినట్టు ప్రచారం సాగుతోంది. 


జీసీసీ చైర్‌పర్సన్‌గా స్వాతీరాణి

జడ్పీ మాజీ అధ్యక్షురాలు శోభా స్వాతీరాణికి గిరిజన కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పదవి దక్కింది. ఆమె మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి కుమార్తె. గతంలో వేపాడ మండలం నుంచి టీడీపీ తరుపున జడ్పీటీసీగా గెలుపొందిన స్వాతీరాణి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో సాలూరు అసెంబ్లీ నుంచి  లేదా..అరకు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ టిక్కెట్‌ దక్కలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీలో చేరారు. అప్పటి నుంచి నామినేటెడ్‌ పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతూ వచ్చింది. అందుకు అనుగుణంగానే కీలకమైన జీసీసీ చైర్‌పర్సన్‌ పదవి దక్కించుకున్నారు. శుక్రవారం ఉదయం తెలుగుదేశం పార్టీకి ఆమె తల్లి శోభా హైమావతి రాజీనామా చేశారు. సాయంత్రానికి స్వాతీరాణికి పదవి ప్రకటించడం విశేషం 


 మారిటైమ్‌ బోర్డు చైర్మన్‌గా కేవీఆర్‌

 మారిటైమ్‌ బోర్టు చైర్మన్‌ పదవిని కాయల వెంకటరెడ్డికి కట్టబెట్టారు. కేవీఆర్‌గా సుపరిచితులైన ఆయన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్నారు. పార్టీకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించారు. జగన్‌ పాదయాత్ర సమయంలో, మొన్నటి సాధారణ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపునకు కృషిచేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నామినేటెడ్‌ పదవి ఇవ్వనున్నారని ప్రచారం జరిగింది. ఆయన విజయసాయిరెడ్డికి ప్రధాన అనుచరుడు కావడంతో కీలకమైన మారిటైమ్‌ బోర్టు చైర్మన్‌ పదవి కట్టబెట్టారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లలో ఎగుమతులు, దిగుమతుల పర్యవేక్షణ మారిటైమ్‌ బోర్డు పరిధిలో ఉంటుంది. అధిష్టానం నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని వెంకటరెడ్డి తెలిపారు.


 టిడ్కో చైర్మన్‌గా జమ్మాన

వైసీపీ సీనియర్‌ నాయకుడు జమ్మాన ప్రసన్నకుమార్‌కు ఏపీ టిడ్కో (ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ) బోర్డు చైర్మన్‌గా పదవి దక్కింది. పార్వతీపురం పట్టణానికి చెందిన జమ్మాన ప్రసన్నకుమార్‌ పార్టీ ఆవిర్భావం నుంచీ ఉన్నారు. 2014 ఎన్నికల్లో పార్వతీపురం అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి చవిచూశారు. 2019లో మరోసారి పోటీ చేయడానికి ప్రయత్నించారు. కానీ అలజంగి జోగారావుకు టిక్కెట్‌ దక్కింది. ఆయన గెలుపునకు ప్రసన్నకుమార్‌ కృషి చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సముచిత స్థానం కల్పిస్తామని అధినేత జగన్‌ హామీ ఇచ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగా కీలకమైన టిడ్కో చైర్మన్‌గా పదవి దక్కడంపై ప్రసన్నకుమార్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణాకి కృషి చేస్తానని చెప్పారు.


 ఆర్టీసీ జోనల్‌ చైర్‌పర్సన్‌గా బంగారమ్మ

నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన గదల బంగారమ్మకు ఆర్టీసీ విజయనగరం జోనల్‌ చైర్‌పర్సన్‌ పదవి దక్కింది. ఆమె కుమారుడు గదల సన్యాసినాయుడు వైసీపీ సీనియర్‌ నాయకుడు. నెల్లిమర్ల జడ్పీటీసీగా కూడా పదవి చేపట్టారు. తాజాగా జడ్పీటీసీగా పోటీ చేశారు.  తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో కూడా జడ్పీటీసీగా విజయం సాధించారు.  ఇటీవల ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రాదేశిక స్థానాన్ని ఏకగ్రీవం చేయడంలో కీలక పాత్ర వహించారు. బంగారమ్మ రెండుసార్లు పంచాయతీ సర్పంచ్‌గా వ్యవహరించారు. కుటుంబ నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకొని బంగారమ్మకు ఆర్టీసీ జోనల్‌ చైర్‌పర్సన్‌ పదవిని కేటాయించారు. దీనిపై గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.


 గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌గా పద్మావతి

 సాలూరు మాజీ జడ్పీటీసీ రెడ్డి పద్మావతికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ పదవి దక్కింది. ఆమె రెండుసార్లు జడ్పీటీసీగా వ్యవహరించారు. ఆమె మామ తిరుపతినాయుడు పార్టీలో సీనియర్‌ నాయకులు. సాలూరు జడ్పీటీసీగా వ్యవహరించారు. ప్రస్తుతం పద్మావతి పెదపదం పీఏసీఎస్‌ అధ్యక్షురాలిగా ఉన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆమెకు డీసీసీబీ చైర్మన్‌ పదవి కట్టబెడతారని అంతా భావించారు. కానీ గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌గా నియమించారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పద్మావతి అన్నారు.


 డీసీఎంఎస్‌ చైర్‌పర్సన్‌గా డాక్టర్‌ భావన

డీసీఎంఎస్‌ చైర్‌పర్సన్‌ పదవి డాక్టర్‌ అవనాపు భావనకు వరించింది. ఆమె మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ అవనాపు సూరిబాబు కోడలు. వైసీపీ నేత అవనాపు విక్రమ్‌ భార్య. జగన్‌ పార్టీ ప్రకటించినప్పుడు ముందుగా చేరింది సూరిబాబే. ఆయన మరణానంతరం కుమారులు విక్రమ్‌, విజయ్‌లు క్రియాశీలకంగా వ్యవహరించారు. విజయనగరంలో అవనాపు కుటుంబానికి మంచి పట్టు ఉంది. వీరి వర్గీయులకు మొన్నటి నగరపాలక సంస్థ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా టిక్కెట్లు దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయించారు. అప్పట్లో అధిష్టానం సూచన మేరకు పోటీ నుంచి విరమించారు. నామినేటెడ్‌ పదవి కేటాయిస్తామని అప్పట్లో ప్రచారం జరిగింది. రాష్ట్ర స్థాయిలో పదవి దక్కుతుందని ఆశించినా డీసీఎంఎస్‌ చైర్‌పర్సన్‌ పదవిని కట్టబెట్టారు. 


 బుడా చైర్‌పర్సన్‌గా పార్వతి

బొబ్బిలికి చెందిన ఇంటి పార్వతికి బొబ్బిలి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (బుడా) చైర్‌పర్సన్‌ పదవి దక్కింది. ఆమె బొబ్బిలి మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ ఇంటి గోపాలరావు భార్య. మంత్రి బొత్స అనుచరులుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం వైసీపీ పట్టణ అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీ బలోపేతానికి కృషిచేస్తూ వస్తున్నారు. దీంతో అధిష్టానం పార్వతికి కీలకమైన బుడా చైర్‌పర్సన్‌ పదవిని కట్టబెట్టింది. పార్టీ అధిష్టానం నమ్మకాన్ని వమ్ము చేయనని... కష్టపడి పనిచేస్తానని పార్వతి తెలిపారు. 


 డీసీసీబీ చైర్మన్‌గా నాయుడుబాబు

ఎస్‌.కోట నియోజవర్గంలో కీలక నేతగా ఉన్న నెక్కల నాయుడుబాబుకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్ష పదవి దక్కింది. ఇప్పటికే ఆయన వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఉన్నారు. ఇప్పుడు డీసీసీబీని కేటాయించారు.  గతంలో ఇచ్చిన కార్పొరేషన్‌ పదవి ఉంటుందా? లేదా? వేరే వారికి కేటాయిస్తారా? అన్నది స్పష్టత లేదు. ఆయన మాత్రం డీసీసీబీ పదవిపైనే ఆసక్తి కనబరుస్తున్నారు. రైతులకు మేలు చేసే పదవి అని... తనపై అధిష్టానం ఉంచిన నమ్మకానికి న్యాయం చేస్తానని అన్నారు. 



Updated Date - 2021-07-18T05:37:48+05:30 IST