సైజుతగ్గిన గుడ్డు

ABN , First Publish Date - 2022-04-24T04:59:12+05:30 IST

సైజుతగ్గిన గుడ్డు

సైజుతగ్గిన గుడ్డు
ఉడికిస్తుండగా పగిలి రూపం కోల్పోయిన గుడ్లు

  • అంగన్‌వాడీ కాంట్రాక్టర్ల కక్కుర్తి 
  • ప్రమాణాలు పాటించని సరుకుల సరఫరాదారులు 
  • పౌష్టికాహారంలో నాణ్యతాలోపం 
  • చిన్న సైజు, మురిగిన గుడ్ల సరఫరా 
  • చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందని పౌష్టికాహారం
  • ఇబ్బందుల్లో లబ్ధిదారులు, కేంద్రాల నిర్వాహకులు


 అంగన్వాడీ కేంద్రాలంటే చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించే ప్రదేశాలు. కానీ ఈ కేంద్రాలకు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్ల కక్కుర్తితో పౌష్టికాహారం మాట అటుంచితే పాడైన, నాణ్యతలేని ఆహారాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా కేంద్రాలకు సరఫరా చేసే గుడ్లలో నాణ్యతుండడం లేదు. చిన్న, మురిగిన, ఎక్కువ కాలం నిల్వ ఉన్న వాటిని అందజేస్తున్నారు. వాటిని ఉడికిస్తున్న సమయంలోనే దుర్వాసన వస్తోంది. పగులుతున్నాయి. దీంతో చిన్నారులు, గర్భిణులు తినడం లేదు. అంగన్వాడీల నిర్వహణపై అధికారులు పట్టించుకోవడం లేదు.


జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు 1,600

7 నెలల నుంచి 3 సంవత్సరాల్లోపు పిల్లలు 68,494

3-6సంవత్సరాల్లోపు పిల్లలు         29,007

గర్భిణులు, బాలింతలు         21,646


కేశంపేట, ఏప్రిల్‌ 23: అంగన్‌వాడీలు కాంట్రాక్టర్లకు కాసుల పంటగా మారుతున్నాయి. ఐదేళ్లలోపు చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు ఇవ్వాల్సిన పౌష్టికాహారంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. అంగన్‌వాడీలపై ఉన్నతాధికారుల అజమాయిషీ పెద్దగా లేకపోవడంతోనే ఈ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. కాంట్రాక్టర్ల లాభాపేక్ష ఎక్కువై అందించాల్సిన పరిమాణంలో పౌష్టికాహారాన్ని సరఫరా చేయడం లేదు. పేదల కడుపు కొట్టి దండుకుంటున్నారు. అంగన్‌వాడీల కేంద్రాలకు రోజూ గుడ్లు, అరటిపండ్లు, పెరుగు, పాయసం, బిస్కెట్లు సరఫరా చేయాలి. వీటి సరఫరాను ప్రభుత్వం కాంట్రాక్టర్లకు అప్పగించింది. కాంట్రాక్టర్లు వాటిని పెద్దమొత్తంలో కొనుగోలు చేసి నిల్వ ఉంచడంతో వాటిలో పోషకాలు నషిస్తున్నాయని. వాటిని తిన్నా పెద్దగా ఫలితం ఉండటం లేదని గర్భిణులు, బాలింతలు, అంగన్‌వాడీ చిన్నారుల తల్లిదండ్రులు అంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.


  • కేశంపేట మండల పరిధి ప్రతీ కేంద్రంలోనూ ఇదే పరిస్థితి

కేశంపేట మండలంలో కేశంపేట, కొత్తపేట రెండు సెక్టార్లు ఉన్నాయి. వీటి పరిధిలో 48 మెయిన్‌ అంగన్‌వాడీలు, 6 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. వాటిల్లో గర్భిణులు బాలింతలు 820 మంది, ఏడో నెల నుంచి మూడేళ్లలోపు చిన్నారులు 1,735 మంది. 3 సంవత్సరాల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 1,076 మంది ఉన్నారు. వీరికి రోజూ ఒక గుడ్డు ఇవ్వాలి. దాని బరువు కనీసం 50గ్రాములుండాలి. కానీ కేశంపేట మండల అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న గుడ్ల బరువు 39, 40గ్రాములకు మించడం లేదు. అదీగాక తరచూ కుళ్లిన గుడ్లు సరఫరా చేస్తున్నారు. పొరపాటున ఇవి చిన్నారులు, గర్భిణులు, బాలింతలు తింటే ఫుడ్‌ పాయిజన్‌ అయ్యే ఆస్కారం ఉంది. ఈ గుడ్లను ఉడికించే సమయంలో దుర్వాసన వస్తున్నాయి. ఉడికిస్తున్న సమయంలోనే పగులుతున్నాయి. వాటిని చిన్నారులు తినడం లేదు. దీంతో ప్రభుత్వం లక్ష్యం నెరవేరడం లేదు. పౌష్టికాహారం పేరుతో నాణ్యత లేని, కుళ్లిన ఆహార పదార్థాలను ఎలా పెడుతామని కాంట్రాక్టర్లను అంగన్‌వాడీలు ప్రశ్నిస్తున్నా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు.


  • 15 రోజులకోసారి సరఫరా 

అంగన్‌వాడీ సెంటర్లకు 15 రోజులకు సరిపడా గుడ్లను ఒకేసారి సరఫరా చేస్తున్నారు. ఒక గుడ్డు వారం కన్నా ఎక్కువ రోజులు నిల్వ ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఫ్రిడ్జ్‌లో పెట్టినా 15రోజులకు మించి నిల్వ ఉంచకూడదు. కాంట్రాక్టర్లు ఎప్పటికప్పుడు తాజా గుడ్లను కాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉన్న వాటిని సరఫరా చేస్తున్నందునే పాడవుతున్నాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉన్న గుడ్లు ఉడికిస్తుండగానే దుర్వాసన వస్తూ పగిలిపోయితున్నాయి. భరించ లేని కౌసుతో చిన్నారులు తినడం లేదు. అదీగాక వేసివిలో గుడ్లు తొందరగా పాడవుతాయి. ఫాం నుంచి తాజా గుడ్లు తెప్పించి ఉడికిస్తేనే తినే వీలుంటుంది. కానీ కాంట్రాక్టర్లు బల్క్‌గా తెప్పించి నిల్వచేసి సరఫరా చేస్తుండడంతో వాటిని చిన్నారులు,  గర్భిణులు, బాలింతలు తినలేకపోతున్నారు.


  • గుడ్డు ముట్టడం లేదు : మానస, చిన్నారుల తల్లి, చింతకుంటపల్లి

మా పిల్లలను గ్రామ అంగన్‌వాడీ కేంద్రానికి పంపుతున్నాను. అందులో ఇచ్చే గుడ్లను పిల్లలు తినడం లేదు. గుడ్లు సైజూ చిన్నగా ఉంటోంది. గుడ్డు పసుపు రంగు సోన నల్లగా అవుతోంది. అంటే గడ్డు ఖరాబైనట్టే కదా? మరి అలాంటి ఆహారం పిల్లలెలా తింటారు? తిన్నా జీర్ణం అవుతుందా? ఫుడ్‌ పాయిజన్‌ కాదా? అంగన్‌వాడీలకు పంపి చిన్నారులను అనారోగ్యం పాలు చేయాలా? అధికారులు కనీసం పట్టించుకోకపోవడం వల్లే చిన్నారులకు పౌష్టికాహారం అందడం లేదు. కాంట్రాక్టర్లు డబ్బు కక్కుర్తితో పేదల కడుపు కొడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి.


  • గుడ్ల సరఫరా సక్రమంగా లేదు : ఆకుల శ్రీదేవి, అంగన్‌వాడీ టీచర్‌, చింతకుంటపల్లి

 అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరా సక్రమంగా లేదు. నెలలో మొదటి విడత పదో తేదీలోపు, రెండో విడత 20వ తేదీలోపు గుడ్ల సరఫరా చేయాలి. కానీ కాంట్రాక్టర్‌ ఇష్టానుసారం పంపుతున్నాడు. వాటిల్లో ఎక్కువగా చిన్నసైజు గుడ్లే ఉంటున్నాయి. గర్భిణులు, చిన్నారుల తల్లితండ్రులు, బాలింతలు తమకు పెద్దసైజు గుడ్లే ఇవ్వాలని కోరుతున్నారు. మేం సొంతంగా కొని ఇవ్వలేం కదా? లాభం ఎక్కువ చూసుకునేందుకే కాంట్రాక్టర్‌ నాణ్యత లేని చిన్న గుడ్లను తీసుకుంటున్నారు. వాటిల్లో పోషకాలూ తక్కువే. అంగన్‌వాడీ కేంద్రాలకు పెద్ద, తాజాగుడ్లు సరఫరా అయ్యేలా అధికారులే చర్యలు తీసుకోవాలి.

Updated Date - 2022-04-24T04:59:12+05:30 IST