గుడ్డు తగ్గింది!

ABN , First Publish Date - 2020-11-01T06:47:02+05:30 IST

మార్కెట్‌లో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. గుడ్డు ధర కూడా ఈమధ్య అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.

గుడ్డు తగ్గింది!

  • ప్రస్తుత రైతు ధర రూ 5.05 
  • రిటైల్‌లో మొన్నటి వరకు ఆరు నుంచి ఏడు రూపాయల వరకు విక్రయాలు
  • తగ్గడంతో వినియోగదారులకు కాస్త ఊరట

మండపేట, అక్టోబరు 31:  మార్కెట్‌లో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. గుడ్డు ధర కూడా ఈమధ్య అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. మార్చి నెలలో రూ.1.90 ఉన్న గుడ్డు ధర ఉండగా కొవి డ్‌ భయంతో ఎవరూ కొనడానికి ముందుకు వచ్చేవారు కాదు. కొవిడ్‌కు చికెన్‌, గుడ్డు కారణమనే అపోహలతో ఆ మార్కెట్‌ వైపు చూసినవారే లేరు. దాంతో కోళ్ల పరిశ్రమ నిర్వాహకులు నష్టాలపాలయ్యారు. కొంతకాలానికి వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి గుడ్డు ప్రధానమని వైద్య నిపుణులు చెప్పడంతో అంతా గుడ్లు తినడంపై దృష్టి పెట్టారు. రోజూ గుడ్డు తినేవారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది. దాంతో గుడ్డు ధర ఎగబాకడం మొదలైంది. చివరకు రికార్డు స్థాయిలో రైతు వద్దే రూ.5.29కి చేరింది. బహిరంగ మార్కెట్‌లో ఆరు నుంచి ఏడు రూపాయల వరకు విక్రయాలు సాగాయి. ఈ పెరుగుదలతో కోళ్ల పరిశ్రమ కొవిడ్‌ తొలిరోజుల్లో వచ్చిన నష్టాలను పూడ్చుకుని లాభాల బాట పట్టింది. ఇప్పుడు మళ్లీ గుడ్డు ధర తగ్గుతూ వస్తోంది. దాదాపు 24 పైసలు ధర పడిపోయింది. ఇది వినియోగదారులకు ఊరటనిస్తోంది. రిటైల్‌ మార్కెట్‌లో కూడా ఈ ధర ప్రభావం కనిపిస్తోంది. నిర్వాహకులకు మాత్రం నిరాశ కలిగించింది. గతేడాది నష్టాల బాటలో కొనసాగిన కోళ్ల పరిశ్రమ ఈ ఏడాది కొవిడ్‌ తర్వాత గడ్డుకాలం ఎదుర్కొంది. కానీ గుడ్డు ధర పెరుగుదలతో నిర్వాహకులు ఊరటచెందారు. దసరా వరకు గుడ్డు ధర వారికి ఉత్సాహాన్ని ఇవ్వగా, దీపావళి ముందు తగ్గుముఖం పట్టింది. వాస్తవానికి ఈశాన్య రాష్ట్రాల్లో శీతలం పెరగడంతో గుడ్డు వినియోగం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ధర తగ్గడం వారిని ఆందోళనలోకి నెడుతోంది.

Updated Date - 2020-11-01T06:47:02+05:30 IST