మార్కెట్‌ కమిటీల బలోపేతానికి కృషి

ABN , First Publish Date - 2022-08-20T05:00:54+05:30 IST

దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్‌

మార్కెట్‌ కమిటీల బలోపేతానికి కృషి
మాట్లాడుతున్న మంత్రి సబితారెడ్డి

  • విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి 

మహేశ్వరం, ఆగస్టు 19 ః దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను బలోపేతం చేస్తున్నామని, దీనిద్వారా అన్నిరకాల వ్యవసాయ ఉత్పత్తులను గిట్టుబాటు ధరలకు విక్రయించుకునే వెసులుబాటు ఉంటుందని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మహేశ్వరంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా సురసాని సురేందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా స్వర్ణగంటి ఆనందం పాలకవర్గం డైరెక్టర్లు ప్రమాణం చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో వ్యవసాయ మార్కెట్‌లలో కనీస సౌకర్యాలు లేక రైతులు దళారులను ఆశ్రయించి మోసపోయేవారని అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో రైతు సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌ అమలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమ పథకాలకు అడ్డుకట్ట వేస్తుందన్నారు. రైతుల బోరు మోటార్లకు మీటర్లు బిగించేలా రాష్ట్రంపై ఒత్తిడి తెస్తుందన్నారు. రైతుబీమా కోసం రాష్ట్ర ప్రభు త్వం సంవత్సరానికి రూ.1400కోట్ల బీమా సొమ్ము చెల్లిస్తుందన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోదీ ప్రభుత్వం డీజిల్‌, పెట్రోల్‌, ఎరువుల ధరలను పెంచి వ్యవసాయ రంగంపై పెనుభారం మోపిందన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచకుండా అదాని, అంబానీలకు మాత్రం డబుల్‌ ఇన్‌కం చేసిపెట్టిన కేంద్రానికి రైతులు సరైన సమయంలో బుద్ది చెబుతారన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతువ్యతిరేక నల్లచట్టాలు తెచ్చి మార్కెట్‌ కమిటీలు లేకుండా ప్రయత్నిస్తే.. కేసీఆర్‌ రైతుల పక్షాన నిలబడి నల్ల చట్టాలు వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేశారని తెలిపారు. నల్లదనం తెచ్చి ప్రతిఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామన్న కేంద్ర ప్రభుత్వం.. నేటికీ 15 రూపాయలు కూడా వేయలేదని విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, మార్కెట్‌కమిటీ చైర్మన్‌ సురసాని సురేందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ ఆనందం, ఎంపీపీ కె.రఘుమారెడ్డి, వైస్‌ ఎంపీపీ ఆర్‌.సునితఅంద్యానాయక్‌, రైతుబంధు కమిటీ జిల్లా కోఆర్డినేటర్‌ కూనయాదయ్య, రాఘవేందర్‌రెడ్డి, డైరెక్టర్లు పొట్టి ఆనంద్‌, బాట సురేష్‌, రవీనాయక్‌, చంద్రశేఖర్‌రెడ్డి, నాసర్‌ఖాన్‌, ఆంజనేయులు, దేవవరం, కిష్టయ్య, పాండు, కిరణ్మయి, దేవ్లానాయక్‌, రాజుగౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఆంగోత్‌రాజునాయక్‌, జెల్లల లక్ష్మయ్య, నాయకులు లక్ష్మీనర్సింహారెడ్డి, సమీర్‌, ఎం.నవీన్‌, వీరానాయక్‌, మండల కృష్ణ పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-20T05:00:54+05:30 IST