జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2022-05-21T06:06:00+05:30 IST

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి
ప్రసంగిస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

మీడియాకు స్వేచ్ఛ ఉన్నప్పుడే సమాజం  ముందుకు

టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఖమ్మం జిల్లా మహాసభలో సీఎల్పీ నేత భట్టి

ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియాపాత్ర కీలకం

ఐజేయు జాతీయ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి

హాజరైన అధికార, విపక్షాల నేతలు

ఖమ్మం (ఆంధ్రజ్యోతిప్రతినిధి)/ఖమ్మంరూరల్‌, మే 20 : జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రతిపక్ష నేతగా తన వంతు కృషి చేస్తానని, ఇళ్లస్థలాలు, హెల్త్‌కార్డులు, అక్రిడేషన్ల సమస్యల విషయంలో జర్నలిస్టులకు అండగా నిలుస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. శుక్రవారం ఖమ్మంరూరల్‌ మండలం నాయుడుపేటలోని ఓఫంక్షన్‌హాలులో నిర్వహించిన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఖమ్మం జిల్లా మూడో మహాసభకు ఆయన హాజరయ్యారు. స్వాతంత్య్రం రాకముందు, తర్వాత మీడియా రంగంలో ఎన్నో మార్పులొచ్చాయని, పత్రికా స్వేచ్ఛకు ఆటంకాలు ఎదురవుతున్నాయని, ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ సాగించాలంటే మీడియా రంగం స్వేచ్ఛగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల పక్షాన మీడియా తనవంతు పాత్ర పోషించినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ సాధించడం సాధ్యమవుతుందన్నారు. అలాంటి జర్నలిస్టుల సమస్యలు, హక్కుల పరిరక్షణకు అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు కేటాయించాలని, అక్రిడేషన్లు మంజూరుచేయాలని, హెల్త్‌కార్డుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఇందుకు ప్రతిపక్ష నేతగా తన వంతు సహకరిస్తానన్నారు. ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దేశంలో అన్నివ్యవస్థలపై అవినీతి ప్రభావం ఉంటున్నా కేవలం మీడియారంగంపైనే అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, మీడియా స్వేచ్ఛగా ఉన్నప్పుడే సమాజం ప్రశాంతంగా ఉంటుందన్నారు. రాజ్యాంగంలో మీడియాకు ప్రత్యేక స్వేచ్ఛ కల్పించారని, అన్ని రంగాలకు దిశానిర్దేశం చేసినా.. మీడియాకు ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని వివరించారు. ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఇళ్లస్థలాలు, అక్రిడేషన్ల సమస్య పరిష్కరిస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులు సమాజంపట్ల బాధ్యతతో పనిచేసి, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలన్నారు. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గ జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇస్తామని, అలాగే జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. అనంతరం జడ్పీచైర్మన లింగాల కమల్‌రాజ్‌, బీజేపీ కిసానమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, పోటు ప్రసాద్‌, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.రాంనారాయణ, ఖమ్మం మేయర్‌ నీరజ, సుడా చైర్మన విజయ్‌కుమార్‌ తదితరరులు ప్రసంగించారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు ఎన.వెంకటరావు జర్నలిస్టుల సమస్యలను వివరించారు. ఐజేయూ జాతీయ కమిటీసభ్యులు రవీంద్రశేషు మాట్లాడుతూ మీడియా కమిషన ఏర్పాటుచేయాలని పెట్టిన తీర్మానాన్ని మహాసభ ఆమోదించింది. 


ఖమ్మం జిల్లా కమిటీ ఎన్నిక

టీయూడబ్ల్యూజే(ఐజేయూ) నూతన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వర్లు, ఎలక్ర్టానిక్‌ మీడియా విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఆవుల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కనకం సైదులు, పలువురు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.



Updated Date - 2022-05-21T06:06:00+05:30 IST