Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 25 May 2022 03:11:43 IST

కృత్రిమ మేధతోనే సమర్థ పోలీసింగ్‌

twitter-iconwatsapp-iconfb-icon

డేటా భద్రత, ప్రజల విశ్వాసమే అసలు సవాల్‌

ప్రపంచ ఆర్థిక సదస్సులో కేటీఆర్‌

రైతుల ఆదాయం పెంపునకు తెలంగాణ సర్కార్‌తో కలిసి పనిచేస్తాం: జగ్గీ వాసుదేవ్‌

ద్రవ్యోల్బణానికి దారితీస్తున్న చమురు ధరలు

దావోస్‌లో కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరి


ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ వల్ల.. నేరస్థులను, తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడానికి వ్యక్తులపై ఆధారపడే అవసరం పోలీసులకు తగ్గుతోంది. ఈ టెక్నాలజీని సరైన విధానంలో వినియోగిస్తే పోలీసులతో పాటు ప్రజలకూ ప్రయోజనం కలుగుతుంది.

-మంత్రి కేటీఆర్‌


హైదరాబాద్‌, మే 24(ఆంధ్రజ్యోతి): కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌, బ్లాక్‌ చైన్‌, డాటా సైన్సెస్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానాలు రెండు వైపులా పదును ఉన్న కత్తిలాంటివని.. వాటితో కలిగే లాభనష్టాలపై ప్రభుత్వాలకు పూర్తి అవగాహన ఉండాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దావో్‌సలో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం చర్చాగోష్ఠిలో భాగంగా ‘కృత్రిమ మేధ వినియోగం.. ప్రజల విశ్వాసం’ అనే అంశంపై కేటీఆర్‌ మంగళవారం మాట్లాడారు. ఫేషియల్‌ రికగ్నిషన్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వంటి టెక్నాలజీల వినియోగానికి ప్రజల విశ్వాసం, నమ్మకం పొందడమే ప్రభుత్వాలకు అసలైన సవాల్‌ అని ఆయన అభిప్రాయపడ్డారు. డేటా భద్రత, వినియోగంలో నిష్పాక్షికతతోపాటు..  అనుమతి లేకుండా ఈ టెక్నాలజీని నిఘా కార్యకలాపాలకు ఉపయోగించబోమన్న భరోసా ప్రజలకు కల్పించాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ టెక్నాలజీ వినియోగంపై ప్రభుత్వ విభాగాలకు ఉండాల్సిన నియంత్రణ అధికారాలను స్పష్టంగా నిర్దేశించినప్పుడే ఇది సాధ్యం అవుతుందన్నారు.

కృత్రిమ మేధతోనే సమర్థ పోలీసింగ్‌

పార్లమెంటరీ పద్థతిలో, పారదర్శకంగా ఈ అధికారాలను ప్రభుత్వ విభాగాలకు కల్పించాలన్నారు. ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ వల్ల.. నేరస్థులను, తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడానికి వ్యక్తులపై ఆధారపడే అవసరం పోలీసులకు తగ్గుతోందని మంత్రి తెలిపారు. ఈ టెక్నాలజీని సరైన విధానంలో వినియోగిస్తే పోలీసులతో పాటు ప్రజలకు కూడా విస్తృత ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఫేషియల్‌ రికగ్నిషన్‌తోనే నేర నియంత్రణ, సమర్థ పోలీసింగ్‌ సాధ్యమవుతుందని ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకుంటున్నాయని తెలిపారు.  ఈ చర్చాగోష్ఠిలో మంత్రితో పాటు ఎన్‌ఈసీ కార్ప్‌ (జపాన్‌) అధ్యక్షుడు తకాయుకి మోరిటా, ఉషాహిది (దక్షిణాఫ్రికా) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎంజీ నికోల్‌, ఎడ్జ్‌ టెక్‌ సీఈవో వ్యవస్థాపకుడు కోయెన్‌ వాన్‌ ఓస్ర్టోమ్‌ పాల్గొన్నారు.


నోవార్టిస్‌ సీఈవోతో.. 

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ వేదికగా.. నోవార్టిస్‌ సీఈవో వసంత్‌ నరసింహన్‌తో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. తెలంగాణలో నోవార్టిస్‌ కంపెనీ విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో తమ కేంద్ర కార్యాలయం తర్వాత సుమారు 9వేల ఉద్యోగులతో హైదరాబాద్‌ కేంద్రం రెండవ అతి పెద్ద కార్యాలయంగా మారిందని వసంత్‌ నరసింహన్‌ తెలిపారు. హైదరాబాద్‌ కేంద్రాన్ని తమ ఏఐ, డేటా, డిజిటల్‌ కార్యక్రమాలకు ఆసియా పసిఫిక్‌  కేంద్రంగా ఎంచుకున్నట్లు తెలిపారు. నోవార్టిస్‌ వల్ల.. ప్రపంచ లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో హైదరాబాద్‌ ఒక అగ్ర శ్రేణి, ఆకర్షణీయ పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని కేటీఆర్‌ అన్నారు. అనంతరం ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ భారతి మిత్తల్‌, వైస్‌ ఛైర్మన్‌ రాజన్‌ భారతి మిత్తల్‌తో కేటీఆర్‌, ఐటి, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీఇంటర్‌నెట్‌ అందించేందుకు అమలుచేస్తున్న టి-ఫైబర్‌ ప్రాజెక్టులో ఎయిర్‌టెల్‌ భాగస్వామ్యంపై చర్చించారు. రాష్ట్రంలో ఎయిర్‌టెల్‌ డేటాసెంటర్‌ ఏర్పాటుచేయాలని కోరారు. అనంతరం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విజయ్‌ గుంటూర్‌, ఇతర పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. కాగా.. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌లో పాల్గొన్న కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరి ముడిచమురు ధరలు భారీగా పెరిగిపోవడం ద్రవ్యోల్బణానికి దారితీస్తోందని ఆందోళన వెలిబుచ్చారు. బ్యారెల్‌ ముడిచమురు ధర 110 డాలర్లకు చేరిందని.. ఈ పెంపును భరించడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఇంధన సంక్షోభం మేనేజ్‌మెంట్‌ క్రైసిస్‌ అని.. చమురు ఉత్పత్తి దేశాలు ఎక్కువ చమురును మార్కెట్‌లోకి విడుదల చేస్తే ఈ పరిస్థితిని రివర్స్‌ చేయొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

కృత్రిమ మేధతోనే సమర్థ పోలీసింగ్‌

దావో్‌సలో జగన్‌తో కేటీఆర్‌ భేటీ

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాల్లో పాల్గొంటున్న మంత్రి కేటీఆర్‌ మంగళవారం ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని కలిశారు. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలిపిన కేటీఆర్‌.. ‘‘సోదరుడు జగన్‌తో సమావేశం అద్భుతంగా ఉంద’’ని పేర్కొన్నారు. అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు, ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే, రాజంపేట ఎంపీ మిథున్‌ రెడ్డిని కూడా కేటీఆర్‌ కలుసుకున్నారు. వారిని సన్మానించి జ్ఞాపికను అందించారు.


ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం: జగ్గీ వాసుదేవ్‌

వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సమావేశాల్లో భాగంగా మంగళవారం తెలంగాణ పెవిలియన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సద్గురు జగ్గీ వాసుదేవ్‌తో మంత్రి కేటీఆర్‌ సంభాషించారు. ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న ‘సేవ్‌ సాయిల్‌’ ఉద్యమంపై ఈ సందర్భంగా సద్గురు మాట్లాడారు. రెండు మూడు దశాబ్దాల్లో ప్రపంచంలోని వ్యవసాయ యోగ్యమైన నేలలు అంతరించిపోయే ప్రమాదం ఉందని.. తద్వారా ఆహార కొరత ఏర్పడే ముప్పు పొంచి ఉందన్నారు. దీనిని నివారించాలంటే భూమిని సారవంతం చేసే కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టాలన్నారు. ఇందుకోసం లండన్‌ నుంచి కావేరి వరకూ తాను నిర్వహిస్తున్న ‘సేవ్‌ సాయిల్‌’ ర్యాలీలో భాగంగా పలువురు ప్రభుత్వాధినేతలను, ప్రముఖ కంపెనీలను కలిసి ఈ కార్యక్రమం ప్రాధాన్యాన్ని వివరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు పర్యావరణ అనుకూల కార్యక్రమాల గురించి జగ్గీ వాసుదేవ్‌కు తెలిపారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ కార్యక్రమాలను ప్రశంసించిన సద్గురు.. రైతుల ఆదాయం పెంపునకు చేపట్టిన కార్యక్రమాల పైన తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.