Abn logo
Jul 27 2021 @ 12:59PM

రాజకీయంగా అన్నీ అగ్నిపరీక్షలే..

- వార్డు సభ్యుడి నుంచి ముఖ్యమత్రి దాకా పోరాటాలు

- శికారిపుర ప్రజల ఆశీస్సులతో ఏడుసార్లు ఎమ్మెల్యేగా..

- సీఎంగా చివరి సభలో యడియూరప్ప కంటతడి


బెంగళూరు: రాష్ట్ర రాజకీయాలలో ఓ శక్తిగా దశాబ్దాల పాటు రాణించిన యడియూరప్ప ముఖ్యమంత్రి హోదాలో చివరిగా చేసిన ప్రసంగం అభిమానులకు ఆవేదన మిగిల్చింది. కేవలం 20 నిమిషాలలోనే పుట్టుక నుంచి  సీఎం పదవికి రాజీనామా చేసేదాకా వివరిస్తూనే భావోద్వేగంతో కంటతడి పెట్టారు. యడియూరప్ప ముఖ్యమంత్రిగా రెండేళ్ల పాలనపై సోమవారం విధానసౌధలోని బ్యాంక్వెంట్‌ హాల్‌లో ప్రజాసంక్షేమ పాలన- సవాళ్లను అధిగమిస్తూనే సాధన పేరిట ప్రత్యేక సమావేశం జరిగింది. సీఎం యడియూరప్ప మాట్లాడుతూ మండ్య జిల్లా బూకనకెరె గ్రామంలో జన్మించి శివమొగ్గ జిల్లా శికారిపురకు వెళ్లి ఆర్‌ఎస్స్‌, సంఘ్‌పరివార్‌ వెంట నడిచానన్నారు. బీజేపీ సమావేశాలకు పదిమంది కూడా రానప్పుడు పాదయాత్రల ద్వారా ప్రజలలోకి వెళ్లానన్నారు. ఇద్దరం ఎమ్మెల్యేలుగా ఎన్నికైనా వసంతబంగేరా వీడిపోవడంతో ఒంటరిగానే పోరాటాలు చేశానన్నారు. ఎక్కడా వెనుతిరగలేదని, అన్నివర్గాలకు అండగా నిలచానన్నారు. శికారిపుర వార్డు సభ్యుడిగా ఎన్నికై తొలి పదవి చేపట్టానన్నారు. అప్పట్లో తనపై దాడి జరిగిందని చనిపోయాడని వదిలేశారని, ఆ తర్వాత కోలుకున్నాక పునర్జన్మ ప్రజలకే అంకితం చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. ప్రధానమంత్రి వాజపేయి కేంద్ర కేబినెట్‌లోకి రావాలని ఆహ్వానించారని, కర్ణాటక రాజకీయాలకే పరిమితం చేయాలని వేడుకున్నట్లు చెబుతూనే కంటతడిపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు అగ్రనేతలు అమిత్‌షా తదితరులు 75 ఏళ్లు పైబడిన వారికి బీజేపీలో కీలక పదవులు ఇవ్వరాదని తీర్మానించారన్నారు. కానీ తనకు మాత్రమే మినహాయింపు ఇచ్చారన్నారు. ఇలా అగ్రనేతల సహకారంతో రెండేళ్ల పాటు పాలన సాగించానన్నారు. వరుసగా రెండేళ్లు వరదలు అంతకంటే ఏడాదిన్నర కాలంగా కొవిడ్‌తో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నట్లు విచారం వ్యక్తం చేశారు. సుధీర్ఘ రాజకీయంలో కొనసాగినా అనుకోకుండా జేడీఎస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశానన్నారు. తండ్రీ కొడుకు (దేవేగౌడ, కుమారస్వామి) ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఆ తర్వాతి ఎన్నికలలో పార్టీని సొంతంగా అధికారంలోకి  తీసుకువచ్చానన్నారు. కేవలం ఒక ఎమ్మెల్యేగా శాసనసభలో బీజేపీ తరపున అడుగుపెట్టి ప్రస్తుతం అధికారంలో కొనసాగేంతదాకా తీసుకువచ్చానన్నారు. ఈ రాజకీయ ప్రయాణంలో అలుపెరగకుండా పోరాటాలు చేశానన్నారు. తనపై ఎవరి ఒత్తిడి లేదని, అయినా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటిస్తూనే ఏడ్చేశారు. ఇప్పుడే రాజ్‌భవన్‌కు వెళ్తానని సంతోషంగా, సంతృప్తికరంగా రాజీనామా చేస్తానన్నారు. సాధన సభకు మంత్రులు శశికళా జొళ్లె, సీపీ యోగేశ్వర్‌తో పాటు పలువురు దూరంగా ఉన్నారు. ఉదయం నుంచి రాజీనామా దాకా మంత్రులు సుధాకర్‌, అశ్వత్థనారాయణ, గోవిందకారజోళ, బసవరాజబొమ్మై మాత్రమే వెంట ఉన్నారు.