సస్పెండైన ఈజీ అధికారి ఇంట్లో రూ.4 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనం

ABN , First Publish Date - 2021-07-25T14:18:06+05:30 IST

లంచం తీసుకుంటూ పట్టుబడి అరెస్టయిన విద్యుత్‌ బోర్డు మాజీ అధికారి ఇంట్లో తనిఖీలు చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు రూ.4 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన దస్తావేజుల

సస్పెండైన ఈజీ అధికారి ఇంట్లో రూ.4 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనం

పెరంబూర్‌(చెన్నై): లంచం తీసుకుంటూ పట్టుబడి అరెస్టయిన విద్యుత్‌ బోర్డు మాజీ అధికారి ఇంట్లో తనిఖీలు చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు రూ.4 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. పెరంబలూర్‌ దురైమంగళంకు చెందిన శరవణన్‌ (40) తన ఇంటి ముందు వెళుతున్న విద్యుత్‌ స్తంభాన్ని మార్చాలంటూ 2019 నవంబరులో విద్యుత్‌ సహాయ ఇంజనీర్‌ మాణిక్యం (51)కు దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు నమోదుచేయాలంటూ రూ.1,000 ఇవ్వాలని ఇంజనీర్‌ తెలుపడంతో శరవణన్‌ జిల్లా అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. అధికారుల సూచనలతో మాణిక్యంకు శరవణన్‌ రూ.1,000 అందిస్తుండగా, అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని జైలుకు తరలించారు. ఈ వ్యవహారంలో మాణిక్యంకు సస్పెండ్‌ చేస్తూ విద్యుత్‌ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసులో బెయిలుపై మాణిక్యం వెలుపలికి రాగా, అవినీతి నిరోధక శాఖ పోలీసులు గత జనవరి 13న మాణిక్యంపై అక్రమార్జన కేసు నమోదు చేశారు. ఆ కేసులో మాణిక్యం ఇంట్లో తనిఖీలు నిర్వహించాలని పెరంబలూర్‌ చీప్‌ మేజిస్ట్రేట్‌ క్రిమినల్‌ కోర్టు జడ్జి మూర్తి సర్చ్‌ వారెంట్‌ జారీచేశారు. దీంతో, అరియలూరు జిల్లా అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ చంద్రశేఖర్‌, పెరంబలూర్‌ జిల్లా అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ హేమచంద్రన్‌ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు మాణక్యం, ఆయన తల్లి నివాసాల్లో శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.

Updated Date - 2021-07-25T14:18:06+05:30 IST