పారిశ్రామిక పార్కుకు గ్రహణం

ABN , First Publish Date - 2022-05-19T06:30:25+05:30 IST

విశాఖపట్నంలో పరిశ్రమలకు పెద్దపీట వేస్తామని, కోరినవన్నీ ఇస్తామని పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

పారిశ్రామిక పార్కుకు గ్రహణం
గుర్రంపాలెంలో సేకరించిన భూమి.

పెందుర్తి మండలం గుర్రంపాలెంలో మైక్రో స్మాల్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ (ఎంఎస్‌ఎంఈ) పార్కు ఏర్పాటు చేస్తామని మూడేళ్ల క్రితం ప్రభుత్వం ప్రకటన

లేఅవుట్‌ కోసం వీఎంఆర్‌డీఏకు ఏపీఐఐసీ దరఖాస్తు

ఇప్పటికీ లభించని అనుమతి

పట్టించుకోని అధికారులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నంలో పరిశ్రమలకు పెద్దపీట వేస్తామని, కోరినవన్నీ ఇస్తామని పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇక్కడ చూస్తే పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వైసీపీ అధికారంలోకి రాగానే నియోజక వర్గానికి ఒక మైక్రో స్మాల్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ (ఎంఎస్‌ఎంఈ) పార్కు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. పెందుర్తి మండలం గుర్రంపాలెంలో అంతకు ముందే (తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో) సేకరించిన 130 ఎకరాల భూమిలోని 43.16 ఎకరాల్లో ఈ పార్కుకు లేఅవుట్‌ వేస్తున్నట్టు ఏపీఐఐసీ ప్రకటించింది. గతంలో అక్కడ ఎలక్ర్టానిక్స్‌ మ్యానుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆ భూమిని 2016లో సేకరించగా ఇప్పటివరకు అభివృద్ధి చేయలేదు. ఆ ప్రాంతమంతా కొండలు, గుట్టలతో కూడుకున్నది. పరిశ్రమలకు అంత అనువైనది కాదనే అభిప్రాయం ఉంది. దాంతో ఎలకా్ట్రనిక్స్‌ క్లస్టర్‌ ప్రతిపాదన ఆగిపోయింది. ఆ తరువాత వైసీపీ నాయకులు ఎంఎస్‌ఎంఈ పార్కు అన్నారు.  మొత్తం 43.16 ఎకరాల్లో రహదారులకు 12.53 ఎకరాలు, మౌలిక వసతులకు 1.57 ఎకరాలు, ఓపెన్‌ స్పేస్‌కు 4.41 ఎకరాలు, పార్కింగ్‌కు 2.11 ఎకరాలు కేటాయించినట్టు ఏపీఐఐసీ ప్రకటించింది. చెరువు స్థలం 2.35 ఎకరాలు పోను మిగిలిన స్థలం సుమారు 20 ఎకరాల్లో 181 ప్లాట్లు వేసి పరిశ్రమలకు ఇస్తామని పేర్కొంది. ఒక్కొక్కటి 300 చ.మీ. విస్తీర్ణం కలిగిన ప్లాట్లు 99, 578 చ.మీ. విస్తీర్ణం కలిగిన ప్లాట్లు 10 వేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ లేఅవుట్‌కు అనుమతి ఇవ్వాలని 2020లో వీఎంఆర్‌డీఏకు దరఖాస్తు సమర్పించింది. 

రెండేళ్లు పరిశీలనలో లేదు 

లేఅవుట్‌ అనుమతి కోసం దరఖాస్తు చేశాక ఏపీఐఐసీ ఆ విషయం మరిచిపోయింది. వీఎంఆర్‌డీఏ అధికారులు కూడా రిమైండర్లు ఇచ్చి, స్పందన లేకపోవడంతో ఊరుకున్నారు. ఇప్పుడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇచ్చిన హామీలపై ప్రజలు ప్రశ్నిస్తుండడంతో ఎంఎస్‌ఎంఈ పార్కులు గుర్తుకు వచ్చాయి. ఆగమేఘాలపై దాని ఫైల్‌ బయటకు తీయించారు. ఆ లేఅవుట్‌పై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వారం రోజుల్లో చెప్పాలంటూ వీఎంఆర్‌డీఏతో ప్రకటన విడుదల చేయించారు. లేఅవుట్‌ అంతా కాగితాలపైనే ఉంది తప్ప వాస్తవంగా అక్కడ భూమిలో ఆ తుప్పలు, రాళ్లే ఉన్నాయి. అనుమతి ఎప్పుడు ఇస్తారో, లేఅవుట్‌ను ఎప్పుడు అభివృద్ధి చేస్తారో...? పరిశ్రమలకు ఎప్పుడు కేటాయిస్తారో ఆ భగవంతుడికే తెలియాలి. దీనిపై వివరణ కోరేందుకు ఏపీఐఐసీ అధికారికి ఫోన్‌  చేయగా, ఆయన స్పందించలేదు. 


Updated Date - 2022-05-19T06:30:25+05:30 IST