ఉపాధి బిల్లులకు గ్రహణం

ABN , First Publish Date - 2020-05-23T09:49:36+05:30 IST

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వివిధ పనులు చేపట్టి నెలలు గడుస్తున్నా నేటికీ బిల్లులు

ఉపాధి బిల్లులకు గ్రహణం

నెలలు గడుస్తున్నా అందని వైనం

కాంట్రాక్టర్ల ఆందోళన ఫక్వాలిటీ కంట్రోల్‌ ఇంజనీర్ల పరిశీలన 


ఎచ్చెర్ల, మే 22: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వివిధ పనులు చేపట్టి నెలలు గడుస్తున్నా నేటికీ బిల్లులు మంజూరుకాలేదు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో గ్రామాల్లో ఉపాధి హామీ పఽథకం కింద రోడ్లు, శ్మశానవాటికలు, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు, క్రీడా మైదానాలు, ఇంకుడు గుంతలు, తదితర వాటిని నిర్మించారు. ఇవి నిర్మించి నెలలు కావస్తున్నా, ఇప్పటికీ బిల్లులు అందకపోవడంతో కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఉపాధి వేతనంతో పాటు మెటీరియల్‌ కాంపోనెంట్‌తో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. సాధారణ ఎన్నికల కోడ్‌కు ముందే ఎంబుక్‌లో వివరాలు నమోదుచేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో సుమారు 4 కోట్ల రూపాయల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు సంబంధిత అధికారులు చెబుతున్నారు.


ఎచ్చెర్ల మండలంలో బుడగట్లపాలెం, బడివానిపేటలో మత్స్యకారులు చేపలు ఆరబెట్టేందకు వీలుగా రూ.18 లక్షలతో ప్లాట్‌ఫారంలు నిర్మించారు. ఒక్కో ప్లాట్‌ఫారం రూ.1.25 లక్షలతో నిర్మించారు. అరిణాం అక్కివలస, దోమాం, చిలకపాలెం గ్రామాల్లో చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలను ఒక్కొక్కటి రూ.2.50 లక్షలతో నిర్మించారు. బొంతలకోడూరు, పొన్నాడ, ముద్దాడ గ్రామాల్లో రూ.13 లక్షలు వెచ్చించి గ్రావెల్‌ రోడ్లు వేశారు. డి.మత్స్యలేశం, దోమాం, పూడివలస, భ గీరథపురం తదితర గ్రామాల్లో నిర్మించిన ఇంకుడు గుంతలకు 8 లక్షల రూపాయల మేరకు చెల్లించాల్సి ఉంది. లక్షల రూపాయలు బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. 


వచ్చే బడ్జెట్‌లో చెల్లిస్తారన్న ఆశ..

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పనులు చేపట్టి, బిల్లులు పెండిం గ్‌లో ఉన్న పనులను క్వాలిటీ కంట్రోల్‌ ఇంజనీర్లు పరిశీలిస్తున్నారు.  దీంతో వచ్చే బడ్జెట్‌లోనైనా బిల్లులు మంజూరు చేస్తారన్న ఆశతో కాంట్రాక్టర్లు ఉన్నారు. 


బిల్లుల కోసం ఎదురుచూస్తున్నాం

చేపలు ఆరబెట్టేందుకు తీర గ్రామాల్లో ప్లాట్‌ఫారంలు నిర్మించాం. అలాగే గ్రావెల్‌ రోడ్లను నిర్మించాం. పనులు చేపట్టి నెలలు గడిచాయి. బిల్లులు త్వరగా వస్తాయన్న ఆశతో ఉన్నాం. త్వరితగతిన బిల్లులు వచ్చేలా చర్యలు చేపట్టాలి. 

- అల్లుపల్లి రాంబాబు, మాజీ సర్పంచ్‌, బుడగట్లపాలెం


అధికారులకు నివేదించాం

మెటీరియల్‌ కాంపోనెంట్‌తో చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లింపు విషయాన్నిు అధికారులకు నివేదించాం. త్వరలో బిల్లులు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదు. 

- శోభాదేవి, ఏపీవో, ఎచ్చెర్ల  

Updated Date - 2020-05-23T09:49:36+05:30 IST