న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికల సందర్భంగా ప్రచార సభల నిర్వహణపై నిర్ణయం తీసుకునేందుకు ఎన్నికల కమిషన్ శనివారం వర్చువల్ సమావేశాలను నిర్వహిస్తోంది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో రోడ్ షోలు, ప్రత్యక్ష బహిరంగ సభలు నిర్వహించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయా? లేవా? అనే అంశాన్ని పరిశీలిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నిపుణులు, ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల అధికారులు, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లతో చర్చిస్తోంది.
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసన సభల ఎన్నికల షెడ్యూలును ఈ నెల 8న ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో రోడ్ షోలు, బహిరంగ సభల నిర్వహణపై జనవరి 15 వరకు నిషేధం విధించింది. అనంతరం ఈ నిషేధాన్ని జనవరి 22 వరకు పొడిగించింది. అయితే సమావేశ మందిరాల్లో గరిష్ఠంగా 300 మందితో లేదా 50 శాతం సీటింగ్ కెపాసిటీతో సమావేశాలు నిర్వహించుకోవచ్చునని తెలిపింది.
ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు జరిగే ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది. ఉత్తర ప్రదేశ్‌లో ఏడు దశల్లోనూ, మణిపూర్‌లో రెండు దశల్లోనూ, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్‌లలో ఒక దశలోనూ ఈ ఎన్నికలు జరుగుతాయి.
ఇవి కూడా చదవండి