శివరాత్రికి మహాలఘు దర్శనం

ABN , First Publish Date - 2021-03-05T05:11:12+05:30 IST

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి రోజు భక్తుల సౌకర్యార్థం మహా లఘుదర్శనం ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు చెప్పారు.

శివరాత్రికి మహాలఘు దర్శనం
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఈవో పెద్దిరాజు

సామాన్య భక్తులకే అగ్రతాంబూలం

అందరి సహకారంతో ముందుకు పోతాం

 కొవిడ్‌ నిబంధనల మేరకే ఉత్సవాలు

 ముక్కంటి ఆలయ ఈవో పెద్దిరాజు


శ్రీకాళహస్తి, మార్చి 4: శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి రోజు భక్తుల సౌకర్యార్థం మహా లఘుదర్శనం ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు చెప్పారు. ఆలయ పరిపాలన భవనంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహాశివరాత్రి రోజు ముక్కంటి దర్శనం కోసం లక్ష మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున మహాలఘు దర్శనం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భద్రత దృష్ట్యా ఈ ఏడాది తిరుమంజన గోపురం మార్గాన్ని మూసి వేశామని.... దక్షిణగోపురం మార్గంలో ప్రముఖులను అనుమతి స్తామని.... బిక్షాల గాలిగోపురం, శివయ్య గోపురం మార్గాల్లో సామాన్య భక్తులను అనుమతించనున్నట్లు వెల్లడించారు. స్వామి, అమ్మవార్ల దర్శన విషయంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామన్నారు. ఈ ఏడాది మహాశివరాత్రి ఉత్సవాలు కొవిడ్‌ నిబంధనల మేరకు నిర్వహిస్తామని పెద్దిరాజు చెప్పారు. మాస్క్‌ ధరించిన వారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని, ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉత్సవాలు విజయవంతం చేయడానికి అందరి సహకారం తీసు కుంటా మన్నారు. ఇప్పటికే శ్రీకాళహసి ఎమ్మెల్యే మధుసూదనరెడ్డి, కలెక్టరు హరినారాయణన్‌ వివిధ శాఖల అధికారులతో ఉత్సవాల నిర్వహణ, సహకారంపై సమీక్ష చేసినట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 

ఆలయ ప్రాంగణంలో భక్తులు వేచి ఉండేందుకు వసతి, ఆలయం లోపలకు వెళ్ళిన భక్తులు 30నిమిషాల వ్యవధిలో స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకుని బయటకు వచ్చే విధంగా క్యూలైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. బహ్మోత్సవాల సందర్భంగా స్వామి, అమ్మవార్లకు చేసే వాహన సేవల్లో తప్పకుండా సమయపాలన పాటిస్తామని హామీ ఇచ్చారు.  వాహనాలు బయలుదేరే ముందు సైరన్‌ మోగిస్తామన్నారు. గత ఏడాదిలాగే శ్రీకాళహస్తీశ్వర, జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి స్వర్ణాభరణాలు అలంకరించి వీధుల్లో ఊరేగించునున్నట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఇప్పటికే 90శాతం పనులు పూర్తయ్యాయనీ... మిగిలిన  పనులు రెండు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం ఈ ఏడాది రూ.3కోట్లు బడ్జెట్‌ కేటాయించినట్లు ఆయన తెలిపారు. మహాశివరాత్రి రోజున వాహనాలను మార్కెట్‌ యార్డు ప్రాంతంలో పార్క్‌ చేయాల్సి ఉంటుందన్నారు. మహాశివరాత్రి రోజు భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సులు ఏర్పాటు చేసి రైల్వేస్టేషన్‌, ఆర్టీసీ బస్టాండు వద్ద అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.  ఇక స్వామి, అమ్మవార్ల ఊరేగింపు సందర్భంగా కళాకారులచే నృత్యాలు, వివిధ రకాల కళారూపాలను ప్రదర్శించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. లింగోద్భవ దర్శనం సందర్భంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా...సామాన్య భక్తులు సైతం దర్శనం చేసుకునే విధంగా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.  అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పెద్దిరాజు తెలిపారు.  ఈ ఏడాది సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవాలను ఇంటి పండుగగా భావించి జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.

Updated Date - 2021-03-05T05:11:12+05:30 IST