డ్రోన్లు అందరికీ అందుబాటులోకి రావడంతో పెరిగిన సవాళ్ళు : ఆర్మీ చీఫ్
ABN , First Publish Date - 2021-07-01T21:45:25+05:30 IST
డ్రోన్లు ప్రభుత్వానికి, ప్రభుత్వేతర సంస్థలకు సులువుగా
న్యూఢిల్లీ : డ్రోన్లు ప్రభుత్వానికి, ప్రభుత్వేతర సంస్థలకు సులువుగా అందుబాటులోకి రావడంతో భద్రతాపరమైన సవాళ్ళు పెరుగుతున్నాయని భారత సైన్యం చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవనే చెప్పారు. డ్రోన్ల తయారీ ఓ కుటీర పరిశ్రమగా మారిందన్నారు. ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు భవిష్యత్తులో అన్ని రకాల పోరాటాల్లో డ్రోన్లను ఉపయోగించడం పెరుగుతుందన్నారు. భవిష్యత్తు ప్రణాళికలో దీనిని చేర్చాలని తెలిపారు. డ్రోన్ల వల్ల కలిగే ముప్పును నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గురువారం ఆయన ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడారు.
భారీ నష్టం కలగజేసే ఆయుధాలను, మానవులకు ప్రమాదకరం కానటువంటి ఆయుధాలను తిప్పికొట్టేందుకు తగిన సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. కొత్త ముప్పుల పట్ల దళాలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. దూకుడుగా దాడి చేయడానికి, అదేవిధంగా ఈ ముప్పును దీటుగా ఎదుర్కొనడానికి కౌంటర్ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించడం పట్ల దృష్టి సారించినట్లు వివరించారు. డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్‌ను దూకుడుగా దాడి చేయడానికి, అదేవిధంగా ఆత్మరక్షణకు ఉపయోగించుకోవడంపై సైన్యం దృష్టి పెట్టిందన్నారు.
జమ్మూలోని భారత వాయు సేన స్థావరంపై జూన్ 27న డ్రోన్లతో దాడి జరిగిన సంగతి తెలిసిందే. భారత సైనిక స్థావరంపై డ్రోన్లతో దాడి జరగడం ఇదే తొలిసారి. ఈ దాడికి పాకిస్థాన్ ప్రభుత్వ సహకారం కూడా ఉందని, పాకిస్థాన్‌లోని లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.