తూర్పు వైసీపీలో ముసలం!

ABN , First Publish Date - 2022-07-04T06:13:25+05:30 IST

తూర్పు నియోజకవర్గ వైసీపీలో ముసలం ఏర్పడింది.

తూర్పు వైసీపీలో ముసలం!
అక్కరమాని విజయనిర్మల

అక్కరమాని తీరుపై నేతలు, కొందరు కార్పొరేటర్ల్ల అసంతృప్తి 

పార్టీలో సీనియర్లకు గుర్తింపు ఇవ్వడం లేదని అసహనం 

నిన్న ఎమ్మెల్సీ, నేడు మొల్లి ఇంట్లో భేటీ 

హాజరైన మేయర్‌ హరికుమారి భర్త 

సమన్వయకర్త మార్పుపై అధిష్ఠానానికి నివేదించాలని నిర్ణయం?


 (విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

తూర్పు నియోజకవర్గ వైసీపీలో ముసలం ఏర్పడింది. నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మలకు వ్యతిరేకంగా సీనియర్‌ నేతలు, కొంతమంది కార్పొరేటర్లు తిరుగుబాటుకు యోచిస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌ నివాసంలో శనివారం అసంతృప్త నేతలు భేటీ కాగా, ఆదివారం మరోనేత మొల్లి అప్పారావు ఇంట్లో మరో నలుగురు కార్పొరేటర్లతో సహా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా సమన్వయకర్తను మార్చాలనే డిమాండ్‌ను పార్టీ అధిష్ఠానం వద్ద ఉంచాలని వారంతా నిర్ణయించినట్టు తెలిసింది. 

తూర్పు నియోజకవర్గం వైసీపీలో కొంతకాలంగా నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. తాజాగా అవి తీవ్రస్థాయి చేరుకున్నాయి. 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్‌ టిక్కెట్‌ ఆశించినా, అక్కరమాని విజయనిర్మలకు కేటాయించడంతో పార్టీలో విభేదాలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల్లో అక్కరమాని ఓడిపోయినప్పటికీ, సమన్వయకర్త బాధ్యతలను అధిష్ఠానం ఆమెకే అప్పగించింది. ఈ నేపథ్యంలో వంశీకృష్ణ వర్గం అంతర్గతంగా ఆధిపత్య పోరు కొనసాగిస్తోంది. 


జీవీఎంసీ ఎన్నికతో మారిన సీను 

జీవీఎంసీ ఎన్నికల్లో 21వ వార్డు కార్పొరేటర్‌గా విజయం సాధించిన వంశీకృష్ణ మేయర్‌ అవుతారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా అదే నియోజకవర్గానికి చెందిన 11వ వార్డు కార్పొరేటర్‌ గొలగాని హరివెంకటకుమారికి పార్టీ పట్టం కట్టింది. దీంతో  మేయర్‌కు అనుకూలంగా మరో వర్గం తయారయింది. నియోజకవర్గంలో పట్టుకోసం ఎవరికివారు ఎత్తులు వేస్తుండడంతో కార్పొరేటర్లతోపాటు నేతలు, కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. తమకు అనుకూలంగా ఉన్న కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులను ప్రోత్సహించడం, వ్యతిరేకంగా ఉన్నవారికి బదులుగా వేరొకరిని చేరదీస్తుండడంతో విభేదాలను మరింతగా పెరిగిపోయాయి. 


అసంతృప్త నేతల భేటీ 

ఈ నేపథ్యంలో మేయర్‌ హరివెంకటకుమారి భర్త, 11వ వార్డు వైసీపీ అధ్యక్షుడు గొలగాని శ్రీనివాసరావు, 16వ వార్డు కార్పొరేటర్‌, స్టాండింగ్‌ కమిటీ సభ్యురాలు మొల్లి లక్షి ్మ భర్త,  వైసీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మొల్లి అప్పారావు, 28వ వార్డు కార్పొరేటర్‌ పల్లా అప్పలకొండ భర్త దుర్గారావు, 20వ వార్డు కార్పొరేటర్‌ నెక్కెల్ల లక్ష్మి భర్త సురేష్‌తోపాటు మరికొందరు ఈనెల రెండున ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌ను శివాజీపాలెంలోని అతని కార్యాలయంలో కలిశారు. అక్కరమాని వ్యవహారశైలి, ఆమె తీరుపై వారి మధ్య సుదీర్ఘ చర్చ జరిగినట్టు సమాచారం. అనంతరం నేతలంతా మధ్యాహ్న భోజనం ముగించి, ఇదే అంశంపై చర్చ కొనసాగించినట్టు తెలిసింది. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి దిగజారిపోతోందని, పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారిని కాకుండా, కొత్తవారిని ప్రోత్సహించడంవల్ల తమకు గుర్తింపు లభించడం లేదని వారంతా వంశీకృష్ణ ఎదుట వాపోయినట్టు సమాచారం. ఎన్నికల వరకూ ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని, తక్షణం సమన్వయకర్తను మార్చి, తాత్కాలికంగా సీనియర్‌ నేతకు బాధ్యత అప్పగించేలా పార్టీ అధిష్ఠానాని నివేదించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అయితే మరికొందరు కార్పొరేటర్లు సమావేశానికి హాజరు కాకపోవడంతో వారితో మట్లాడాలని వంశీకృష్ణ సూచించారంటున్నారు. 


మొల్లి ఇంట్లో సమావేశం 

ఈ నేపథ్యంలో ఆదివారం మొల్లి అప్పారావు ఇంట్లో అక్కరమాని రోహిణి, మరో ఇద్దరు కార్పొరేటర్లతో నేతలు సమావేశమై ఈ వ్యవహారంపై చర్చించినట్టు తెలిసింది. దీనిపై మొల్లి అప్పారావు వద్ద ప్రస్తావించగా నియోజకవర్గంలో తాను సీనియర్‌ని కావడంతో కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు పార్టీలో ఎదురవుతున్న సమస్యలు, ఇబ్బందులను చెబుతారని, ఇందులో భాగంగానే రెండురోజులు భేటీ అయ్యామన్నారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌ వద్ద ప్రస్తావించగా శనివారం కొంతమంది తనను కలిసినమాట వాస్తవమేనని, పార్టీ అంతర్గత విషయాలు బయటకు చెప్పలేనని దాటవేశారు. ఏది ఏమైనా తూర్పు నియోజకవర్గంలో అక్కరమానికి పార్టీలోనే వైరివర్గం నుంచి తిరుగుబాటు తప్పకపోవచ్చుననే సంకేతాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Updated Date - 2022-07-04T06:13:25+05:30 IST