పొలిటికల్‌ ‘హీట్‌’

ABN , First Publish Date - 2022-05-24T06:55:23+05:30 IST

జిల్లాలో పొలిటికల్‌ హీట్‌ మొదలైంది. అసలే ఎండాకాలం. సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. జిల్లాలో పలుచోట్ల 40 డిగ్రీలకు పైబడే ఉష్ణోగ్రత నమోదవుతోంది. ప్రజలు చల్లదనం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ రాజకీయపార్టీలు సుమారు ఏడాదిన్నరకు ముందే ఎన్నికల ఫైర్‌ని రాజేస్తున్నాయి. ఆగ

పొలిటికల్‌ ‘హీట్‌’
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి మేరుగ నాగార్జున

ఏడాదిన్నరకు ముందే ఎన్నికల ఫైర్‌

టీడీపీలో మహానాడు వేడి

త్వరలో రాజమహేంద్రవరం నుంచి జైత్రయాత్ర

27న రాజమహేంద్రవరంలో వైసీపీ బస్సు యాత్ర

జూన్‌ 7న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సభ

జూన్‌లో పవన్‌కల్యాణ్‌ రైతు సభ

సీపీఐ, సీపీఎంలు నిత్యం వేడివేడిగానే...


జిల్లాలో పొలిటికల్‌ హీట్‌ మొదలైంది. అసలే ఎండాకాలం. సూర్యుడు   భగభగ మండిపోతున్నాడు. జిల్లాలో పలుచోట్ల 40 డిగ్రీలకు పైబడే ఉష్ణోగ్రత నమోదవుతోంది. ప్రజలు చల్లదనం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ రాజకీయపార్టీలు సుమారు ఏడాదిన్నరకు ముందే ఎన్నికల ఫైర్‌ని రాజేస్తున్నాయి. ఆగస్టులో రాజమహేంద్రవరం మున్సిపల్‌ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. వీటిని సెమీ ఫైనల్‌ ఎలక్షన్‌గా భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక ఎన్నికల జరిగే వరకూ ఆయా పార్టీలలో ఇదే వేడితో, ఇవే భగభగలతో ఉండేలా  కార్యకర్తలకు  కాక   పెట్టడానికి రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు ఉరుకుతున్నాయి. 


(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

తెలుగుదేశం పార్టీ ఒంగోలులో ఈనెల 27 నుంచి రెండు రోజులపాటు మహానాడును నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అక్కడ తీసుకునే నిర్ణ యాలు, చేసిన తీర్మానాలకు అనుగుణంగా త్వరలో రాజమహేంద్రవరం నుంచి టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల జైత్రయాత్రను ప్రారంభనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికంటే ముందు మహానాడు విజయవంతం చేయడం కోసం జిల్లాను నుంచి ఎక్కువమంది  వెళ్లడానికి  ప్రయత్నాలు మొదలయ్యాయి. రాజమహేంద్రవరం సిటీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో సోమవారం ముఖ్యుల సమావేశం జరిగింది.  మహానాడు విజయవంతం చేయడం కోసమే ఎక్కువగా చర్చించారు. పార్టీ సీనియర్‌నేత గన్ని కృష్ణ ఇప్పటికే మహానాడు గురించి చెబుతున్నారు. అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే ఎన్‌.రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గ్రామశాఖల అధ్యక్షుల సమావేశం జరిగింది. రూరల్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే, పొలిట్‌ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్‌ఆర్‌ఐలతో జరిగే మీటింగ్‌ కోసం అమెరికా వెళ్లారు. దాంతో యువనేత డాక్టర్‌ గోరంట్ల రవిరామ్‌కిరణ్‌ ఆధ్వ ర్యంలో ఇప్పటికే ఒక సమావేశం నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ తన పని తాను చేస్తుండగా, కొవ్వూరులో ద్విసభ్య కమిటీ ఆధ్వర్యంలో మహానాడుకు వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక గోపాలపురం, నిడదవోలు, రాజానగరం నియోజకవర్గాల నుంచి అధికంగా తరలివెళ్లే ఆలోచనలో ఉన్నారు. మహానాడు తర్వాత ఇక్కడ ఎన్నికల జైత్రయాత్ర హడావుడి ఉంటుంది. ఇక వైసీపీ ఇప్పటికే ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ అంటూ వెళుతోంది. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో దీన్ని తప్పించుకోవడానికి కొంద రు నేరుగా లబ్ధిదార్ల వద్ద ‘మీకు పెన్షన్‌ వచ్చింది, ఆ పథకం వచ్చిందా, ఈ పథకం వచ్చిందా అంటూ వాళ్లకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ముందుకు వెళ్లిపోతున్నారు. వంటనూనెలు, పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, ఇతర నిత్యావసర సరుకులు, బస్సు చార్జీలు, రోడ్లు అధ్వానంగా ఉండడం వంటి సమస్యలు అడుగుతుండడంతో లోలోపల బెరుకుగానే ఉన్నారు. ఇప్పుడు మరో మార్గం ద్వారా జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం మొదలు పెట్టారు. దానికోసం ఈనెల 27వ తేదీన రాజమహేంద్రవరంలో సామాజిక న్యాయభేరి పేరిట బస్సుయాత్ర, బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికి ఎక్కువగా జన సమీకరణ చేయడం కోసం సోమవారం రాజమహేంద్రవరంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా నాయకత్వంలో సభ జరిగింది. దీనికి రాష్ట్రమంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్యే జీ. శ్రీనివాస్‌నాయుడు, ఎమ్మెల్సీలు జంగాకృష్ణమూర్తి, రఘురాం తదితరులతో సమీక్ష చేశారు. అంతేకాక బిక్కవోలు మండలం బలభద్రపురంలో టీటీడీ చైర్మన్‌  వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కార్యకర్తల మీటింగ్‌ నిర్వహిం చారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. బస్సుయాత్ర కోసం జన సమీకరణే ప్రధాన లక్ష్యంగా ఈ సమావేశం నడిచింది. ఇక వచ్చేనెల 7న రాజమహేంద్రవం లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరుకానున్నారు. ఆరు జిల్లాల నుంచి బూత్‌ కమిటీల నేతలందరినీ ఇక్కడకు రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. వేలాది మందితో ఈ సభ నిర్వహించాలని ప్రయత్నం చేస్తున్నారు. జనసేన నేత పవన్‌కల్యాణ్‌ కూడా బహుశా వచ్చే నెలలో రైతు సభ పెట్టవచ్చని చెబుతున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే. పాత తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 30 మంది వరకూ ఆత్మహత్య చేసుకున్నట్టు పార్టీ గుర్తించింది. ఈ సభ కూడా రాజమహేంద్రవరంలోగాని, కోనసీమలోగాని నిర్వహించే అవకాశం ఉంది. ఇక సీపీఐ, సీపీఎం కూడా అధిక ధరలపై పోరు సాగిస్తున్నాయి.


వైసీపీపై ఎమ్మెల్సీ అనంతబాబు ప్రభావం

ఒకపక్క గడపగడపకూ అంటూ, మరోపక్క ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీలకు ఎంతో చేశామని చెప్పడానికి బస్సు యాత్ర నిర్వహించనున్న అధికార వైసీపీకి ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ కేసు తీవ్ర ఇబ్బందిగా మారింది. దళిత వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉండగా, టీడీపీ వారికి మద్దతుగా నిలిచింది. వైసీపీలో అరాచకం, హత్యారాజకీయాలు పెరిగిపోయాయని అందరూ ఆందోళన చెందుతున్నారు. కొద్దిరోజుల కిందట గోపాలపురం నియోజకవర్గం పరిధిలో వైసీపీ ఎంపీటీసీ సభ్యుడే  ఆ గ్రామ వైసీపీ అధ్యక్షుడిని హత్యచేసిన ఉదంతం మరుకముందే ఏకంగా ఒక ఎమ్మెల్సీ తన కారు డ్రైవర్‌ను దారుణంగా హత్య చేయడం, వైసీపీకి తీవ్ర నష్టమే తెస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.


సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర.. పోస్టర్‌ విడుదల

రాజమహేంద్రవరం అర్బన్‌, మే 23: రాష్ట్రంలో ప్రజల సంక్షేమ కోసం సీఎం జగన్‌ అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంతా సీఎంకు అండగా నిలవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. సోమవారం రాజమహేంద్రవరంలోని తాడితోట, సంహిత కన్వెన్షన్‌ హాల్‌లో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర విజయవంతం చేయడంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులతో సమావేశం నిర్వహించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అఽధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నాగార్జున మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సీఎం అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రస్తుత కేబినెట్‌లో 77 శాతం మందికి స్థానం కల్పించారని, ఈనెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా సామాజిక న్యాయభేరి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. బస్సు యాత్రతోపాటు నాలు గు చోట్ల భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడం జరిగిందని, 27వ తేదీన రాజమహేంద్రవరంలో బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, వక్ఫ్‌బోర్డు చైర్మెన్‌ ఖాదర్‌బాషా, నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు కూడా మాట్లాడారు. ఎమ్మెల్సీ రఘురామ్‌, రుడా చైర్‌పర్సన్‌ షర్మిలారెడ్డి, ఆకుల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. 


మహానాడును విజయవంతం చేయాలి : ఆదిరెడ్డి

రాజమహేంద్రవరం, మే 23(ఆంధ్రజ్యోతి) : ఈనెల 27, 28వ తేదీల్లో  ఒంగోలులో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడును విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పిలుపునిచ్చారు. స్థానిక మెయిన్‌రోడ్డులోని జగదీశ్వరి హోటల్‌లో సోమవారం జరిగిన సిటీ నియోజకవర్గ పార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొవిడ్‌ వల్ల రెండేళ్లు మహానాడు జరుపుకోలేదని, ఈఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నందున అవకాశం ఉన్న ప్రతీ ఒక్కరూ హాజరుకావాలన్నారు. ప్రాథమిక అవసరాలు, సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు వాసిరెడ్డి రాంబాబు, వర్రే శ్రీనివాసరావు, పార్వతిసుందరి, తురకల నిర్మల, ఈతలపాటి కృష్ణ, షేక్‌ సుభాన్‌, తీడా నరసింహారావు, కొయ్యల రమణ, బంగారు నాగేశ్వరావు, కప్పల వెలుగు, చండీప్రియ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T06:55:23+05:30 IST