‘కార్పొరేట్‌’ ఇసుక రెడీ!

ABN , First Publish Date - 2021-04-14T06:02:44+05:30 IST

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి) ఇసుక వ్యాపారం మొత్తం కార్పొరేట్‌ చేతిలోకి వెళ్లిపోయింది. ఉగాదిరోజైన మంగళవారం నుంచే ఓపెన్‌ రీచ్‌లను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. ఈనెల 16వ తేదీ నుంచి కార్పొరేట్‌ ఏజన్సీ ఆధ్వర్యంలో ఇసుక వ్యాపారం పూర్తి స్థాయిలో జరుగుతుందని అధికారులు

‘కార్పొరేట్‌’ ఇసుక రెడీ!

ఈనెల 16 నుంచి అమలు జరిగే అవకాశం

యూనిట్‌ ఇసుక  ధర రూ.475

జిల్లాలో ఓపెన్‌ రీచ్‌లన్నీ స్వాధీనానికి ఉత్తర్వులు

250 మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల్లో కొందరికే చాన్స్‌

రాజమహేంద్రవరం ఏపీఎండీసీ ఆఫీసు కార్పొరేటు ఏజన్సీకి

38 ఓపెన్‌ రీచ్‌లు.. మరిన్ని కొత్త రీచ్‌ల వేటలో మైన్స్‌ అధికారులు


(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

ఇసుక వ్యాపారం మొత్తం కార్పొరేట్‌ చేతిలోకి వెళ్లిపోయింది. ఉగాదిరోజైన మంగళవారం నుంచే ఓపెన్‌ రీచ్‌లను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. ఈనెల 16వ తేదీ నుంచి కార్పొరేట్‌ ఏజన్సీ ఆధ్వర్యంలో ఇసుక వ్యాపారం పూర్తి స్థాయిలో జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని విధివిధానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది ఈనెల 13న ఒక ఉత్తర్వు జారీ చేశారు. ఈనేపఽథ్యంలో జిల్లాలో ఇప్పటికే నిలిచిపోయిన ఓపెన్‌ ర్యాంపులన్నింటినీ స్వాధీనం చేసుకోకున్నారు. మొత్తం 38 ర్యాంపులు ఉన్నాయి. మొదట వీటి నుంచి ఇసుక తీత మొదలు పెడతారు. మరిన్ని ర్యాంపుల కోసం మైన్స్‌ అధికారులు అన్వేషిస్తున్నారు. ఇలా మొత్తం సుమారు 70 ర్యాంపుల వరకూ ఉండే అవకాశం ఉంది. పైగా ఈ కార్పొరేట్‌ ఏజన్సీ కేవలం మిషన్లతోనే ఇసుక వ్యాపారం చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఎన్విరాన్‌మెంట్‌ సర్టిఫికెట్‌ ఇస్తే సెమి మెకనైజ్డ్‌ ర్యాంపులుగా మారతాయి. లేకపోతే మనుషులతోనే చేయించాల్సి ఉంటుంది.కానీ సెమి మెకనైజ్డ్‌ ర్యాంపులకే ఈ ఏజన్సీ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఇక యూనిట్‌ ఇసుక రూ.475 మించకుండా విక్రయించాలి. కొత్త ఏజన్సీ ఇసుక విక్రయంలో కొన్ని మార్పులు చేయించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రారంభించిన ఆన్‌లైన్‌ విధానానికి స్వస్తి పలికారు. ఇక ఎవరూ ఆన్‌లైన్‌ బుక్‌ చేసుకునే వీలులేదు. మీ ఆధార కార్డులు, ఇంటి ప్లాన్లు ఇవ్వనవసరం లేదు. నేరుగా మీకు దగ్గరలోని ర్యాంపునకు వెళ్లి అక్క డే డబ్బు చెల్లించి ఇసుక తీసుకెళ్లొచ్చు. మీరు సొంతంగా వాహనం తీసుకొని రావచ్చు లేదా అక్కడ అద్దె వాహనం వినియోగించుకోవచ్చు.


సొసైటీలతో ఒప్పందం పెట్టుకునే అవకాశం

పడవ ర్యాంపులు నిర్వహించే సొసైటీలతో కార్పొరేట్‌ ఏజన్సీ ఒప్పందం కుదుర్చుకోనున్నది. పడవల మీద ఇసుక తీసే జనం వెంటనే దొరకడం కష్టం. జిల్లాలో రాజమహేంద్రవరం అఖండ గోదావరితోపాటు ఇతర ప్రాంతాల్లోనూ ఇసుక తీసే ర్యాం పులున్నాయి. వీటిని పడవ మీద వెళ్లి తేవలసి ఉంది. వీటిని మత్స్యకార, ఇతర లేబర్‌ సొసైటీలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ఓపెన్‌ రీచ్‌లను స్వాధీనం చేసుకుని, పడవ రీచ్‌ల విషయంలో సొసైటీలతో ఒప్పందం పెట్టుకునే ప్రయత్నంలో ఉంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట కొత్త ఇసుక పాలసీ తెస్తూ ఏపీఎండీసీకి బాధ్యతలు అప్పగించింది. కానీ ఇప్పుడు కార్పొరేట్‌ సంస్థకు ఇసుక అప్పగించడంతో ఇక్కడ ఏపీఎండీసీకి పనిలేకుండా పోయింది. వారందరీని సొంత శాఖలకు పంపిచేస్తున్నారు.


రాజమహేంద్రవరంలో ఉన్న ఏపీఎండీసీ ఆఫీసును ఇక కొత్త కాంట్రాక్టు ఏజన్సీ ఉపయోగించుకోనుంది. అలాగే ఏపీఎండీసీ ఆధ్వర్యంలో ఇసుక విక్రయాలు మొదలైన తర్వాత ర్యాంపులు, స్టాక్‌యార్డ్‌లు నిర్వహణకు, ఇసుక విక్రయాలకు సుమారు 250 మందిని అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా తీసుకొంది. వీరికి రూ.13 వేల నుంచి 25 వేల వరకూ జీతాలు ఇస్తుంది. ఇవాళ ఇసుక కార్పొరేట్‌ సంస్థ పరిధిలోకి వెళ్లడంతో వీరి పరిస్థితి ఏంటనేది సమస్యగా మారింది. కానీ కార్పొరేట్‌ సంస్థకు కూడా ఇసుక వ్యాపారంలో అనుభవజ్ఞులు అవసరం. ఒక్కో ర్యాంపు నిర్వహణకు కనీసం ఏడుగురు అవసరం. అందువల్ల ప్రస్తుతం ఉన్న అవుట్‌ సోరింగ్‌ ఉద్యోగుల్లో కొందరిని గుర్తించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. అంతేకాక గత మూడు నెలల నుంచి కొత్త సంస్థ పేరుతో కొందరు వ్యక్తులను ఇక్కడి ఉద్యోగులపై నిఘా పెట్టి వారి పనితీరును గమనించినట్టు సమాచారం. దీంతో కొందరికే ఉద్యోగాలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇక రోజుకు జిల్లాలో 40 వేల టన్నుల ఇసుక తీసే అవకాశం ఉంది. జగనన్న కాలనీకు కూడా ఇసుకను ఇక్కడ నుంచే తోలాలనే నిర్ణయం ఉంది. ప్రభుత్వ అవసరాలకు కూడా ఇక్కడ నుంచే తోలతారు. గతంలోని లెక్కలను పరిగణనలోకి తీసుకుని ఈ లెక్క కట్టారు. జిల్లాకే కాక ఇతర జిల్లాలకు కూడా ఇసుక సరఫరా చేయవచ్చు. మరోవైపు పట్టా భూముల విష యంలో పునరాలోచన చేసే అవకాశంఉంది.  కొత్త పాలసీ ప్రకారం పట్టాభూముల్లో ఇసుకతీత రద్దు చేశారు. కానీ కొత్త వ్యాపార సంస్థ అత్యధికంగా ఇసుక వ్యాపారం చేయాలంటే అత్యధిక ఇసుక అవసరం. రెండు మూడ్రోజుల్లో కొత్త సంస్థ ఇసుక వ్యాపారం మొదలు పెడుతున్న సమయంలో ఇప్పటివరకూ ఇసుక బుక్‌ చేసుకున్న వారి సంగతేంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఈలోపు సరఫ రా సరఫరా చేస్తారా లేదా డబ్బులు వాపస్‌ ఇస్తారో చూడాలి.

Updated Date - 2021-04-14T06:02:44+05:30 IST