భూమాయగాళ్లు

ABN , First Publish Date - 2022-04-25T05:53:32+05:30 IST

కడప, ప్రొద్దుటూరు, బద్వేలు పోరుమామిళ్లలో భూములు ఖాళీగా ఉంటే చాలు నఖిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించేస్తుండడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కడప, గోపవరంలో నకిలీ పత్రాలు సృష్టించే వారిపై కేసులు నమోదు కావడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ నకిలీ వ్యవహారం గురించి చర్చ నడుస్తోంది. పట్టణాలకు వలస వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది.

భూమాయగాళ్లు
అమృతనగర్‌లో పేదలకు ఇచ్చిన స్థలాలు

ఖాళీ స్థలం కనిపిస్తే.. గద్దల్లా వాలిపోతారు

నకిలీ పత్రాలతో అమ్మేస్తారు

మీకు విలువైన భూములు, స్థలాలుంటే.. ఓ లుక్కేయండి

లేదంటే మీ స్థలం మీది కాకపోవచ్చు 


దొంగలున్నారు జాగ్రత్త.. అంటూ ఆర్టీసీ బస్టాండ్‌లో, రైల్వేస్టేషన్లలో, పుణ్యక్షేత్రాల్లో హెచ్చరిక బోర్డులు చూసే ఉంటారు. అయితే ఇప్పుడు భూచోళ్లు వచ్చారు తస్మాత్‌ జాగత్త.. దొంగల మాదిరి వీళ్లు పర్సులు, విలువైన ఆభరణాలు కొట్టేసే రకం కాదు. వీళ్ల కంటికి ఖాళీ స్థలం కనిపించిందంటే గద్దల్లా వాలిపోతారు. మాయచేసి తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటారు. అందుకే మీకు జిల్లాలో విలువైన భూములు, స్థలాలు ఉంటే చెక్‌ చేసుకోండి. లేదంటే మీ స్థలం మీది కాకపోవచ్చు.  


కడప-(ఆంధ్రజ్యోతి): కడప, ప్రొద్దుటూరు, బద్వేలు పోరుమామిళ్లలో భూములు ఖాళీగా ఉంటే చాలు నఖిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించేస్తుండడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కడప, గోపవరంలో నకిలీ పత్రాలు సృష్టించే వారిపై కేసులు నమోదు కావడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ నకిలీ వ్యవహారం గురించి చర్చ నడుస్తోంది. పట్టణాలకు వలస వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో పాటు మనిషి జీవిన విధానం మారుతోంది. అభిరుచికి, ఇప్పుడున్న ట్రెండ్‌కు తగ్గట్లుగా గృహాలను నిర్మించుకుంటున్నారు. దీంతో నివాస స్థలాలకు డిమాండ్‌ ఏర్పడింది. కొంత మందికి ప్రభుత్వం ఇచ్చిన స్థలాలతో పాటు సొంత స్థలాలు ఉన్నప్పటికీ వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇళ్లు కట్టుకోలేక అలా వదిలేశారు. మరి కొందరు వృత్తి రిత్యా లేదా వ్యాపార రిత్యా ఇతర ప్రాంతల్లో ఉంటున్నారు. వారి స్థలాలను ఆక్రమించేస్తున్నారు. 

కడప నగరాన్ని ఐదు గ్యాంగులు చుట్టుముట్టాయి

కడప నగరంపై ఐదు గ్యాంగులు కాళికేయుల్లా దండయాత్ర చేసినట్లుగా పడ్డారు. గ్యాంగ్‌లీడర్స్‌ అంతా ప్రముఖులే. వీరు కొంత మంది సబ్‌ గ్యాంగ్‌లను ఏర్పాటు చేసుకున్నారు. సబ్‌గ్యాంగుల పని నగరంలో ఎక్కడ ఖాళీ స్థలం ఉంది. ఈ భూమి సర్వే నెంబర్‌, వారు ఎక్కడ ఉన్నారు. అనే సమాచారాన్ని సేకరించి గ్యాంగ్‌లీడర్లకు అందజేస్తారు. వారు వెంటనే ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు సేకరించి.. అందుకు సంబంధించి రికార్డులు తయారు చేసుకొని సైట్లోకి అడుగు పెడుతుంటారని తెలుస్తోంది. ఆ తరహాలోనే కడపకు చెందిన సుధాలక్ష్మి, సురే్‌షకుమార్‌లకు బిల్టప్‌ సమీపంలో 44 సెంట్లు స్థలం ఉంది. వీరు ఉద్యోగ రిత్యా హైదరాబాద్‌లో ఉన్నారు. ఈ నెల 19న కడపకు వచ్చి స్థలాన్ని పరిశీలించగా ఆ స్థలాన్ని నకిలీ పత్రాలతో రిజిస్టర్‌ చేయించుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి పలువురిని అరెస్టు చేయడంతో ఒక్కసారిగా కడప ఆక్రమణలు తెరపైకి వచ్చాయి. నాగరాజుపేట, హౌసింగ్‌బోర్డు కాలనీ, ఎల్‌ఐసీ ఆఫీసు, చిన్నచౌక్‌ పరిధిలో గ్యాంగులు ఉన్నట్లు చెబుతున్నారు. హౌసింగ్‌బోర్డులో ఉన్న గ్యాంగ్‌ అయితే ఖాళీ స్థలం కనిపిస్తే దానికి పత్రాలు సృష్టించి నేరుగా రంగంలోకి దిగుతారని చెబుతారు. సెవెన్‌రోడ్స్‌ పరిఽధిలో ఉండే ఓ గ్యాంగ్‌ బెదిరింపులతో వెళుతుండగా, చిన ్నచౌక్‌ పరిఽధిలో ఉన్న గ్యాంగ్‌  స్థలంలో ఉన్న కంప తీసి చదును చేస్తారని సమాచారం. ఇలా స్థలాలు ఆక్రమిస్తుండడంతో కొందరు పోలీ్‌సస్టేషన్‌కు వెళుతుండగా మరి కొందరు మధ్యవర్తితోనే సెటిల్‌ చేసుకుంటున్నారు. 

ప్రొద్దుటూరులో అదే జోరు

కడప తరువాత పెద్ద సిటీ, ప్రొద్దుటూరు వాణిజ్యపరంగా రాయలసీమకు అడ్డా. అయితే అక్కడ అమృతనగర్‌లోని పేదల స్థలాలపై బూచోళ్ల కన్నుపడింది. దివంగత వైఎ్‌సఆర్‌ హయాంలో ప్రొద్దుటూరు సమీపంలోని కొత్తపల్లె పంచాయతీలోని సర్వే రెడి ్డగారిపల్లె సమీపంలో మూడు లేఔట్లు వేసి సుమారు 7500 మందికి పట్టాలు ఇచ్చారు. తొలి విడతలో ప్రభుత్వమే స్థలంతో పాటు ఇళ్లు నిర్మించింది. రెండో విడత మాత్రం ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరిగింది. కొంత మంది పేదలు ఆర్థిక పరిస్థితి స్థితి దృష్టా ఇల్లు నిర్మించుకోలేదు. అయితే ఇప్పుడు ఈ స్థలాలకు విలువ వచ్చింది. సెంటు లక్ష పైనే పలుకుతుండడంతో స్థానికంగా ఉన్న ఓ ఏడు బ్యాచులు నకిలీ పట్టాలు సృష్టించి అసలైన పట్టాదారులను బెదిరిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. భూచోళ్ల దాటికి పేదోళ్లు భయపడి పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కలేకపోతున్నట్లు చెబుతున్నారు. చాలా వరకు స్థలాలను నకిలీ పత్రాలతో ఆక్రమించేసినట్లు సమాచారం. రెవెన్యూ ఆఫీసుకు వెళితే రికార్డులు లేవని చెబుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. 


బద్వేలు రూటే సపరేటు

బద్వేలు మున్సిపాలిటీ వేగంగా విస్తరిస్తోంది. ఇక్కడంతా డీకేటీ స్థలాలు ఉన్నాయి. ఇక్కడ ఒక ప్లాట్‌పై ఐదారు పత్రాలు పుట్టుకొస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి కారణంగా కొందరు పిల్లల పెళ్లికి కట్నంగా ఇవ్వచ్చన్న ఉద్దేశ్యంతో వారి స్థలాలో ఇళ్లు వేసుకోలేదు. ఇదే అక్కడున్న మాఫియాకు, భూ రాబంధులకు కలిసొచ్చింది. బద్వేలుకు రాజకీయ పెద్దలు, ప్రముఖులుగా ఉన్న కొందరు నకిలీ పట్టాలకు మూలకారణమని చెబుతున్నారు. మొత్తం ఇక్కడ 15 బ్యాచ్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖంగా బయనపల్లికి చెందిన ఓ బ్యాచ్‌, కడప-సిద్దవటంలో రోడ్డులో మూడు బ్యాచులు, గోపవరం కాలనీలో రెండు బ్యాచులు, ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఓ వాణిజ్య సముదాయంలో మరి కొన్ని బ్యాచులు విస్తరించి ఎవరి స్థలాలు ఖాళీగా ఉన్నాయని గుర్తించడం, వాటి మీద పత్రాలు సృష్టించి హల్‌చల్‌ చేస్తున్నారు. ఏడాది కాలంగా నకిలీ పట్టాదారుల దాష్టికం బద్వేలులో తీవ్రస్థాయికి వెళ్లింది. రెండు రోజుల క్రితం నకిలీ పట్టాదారులపై కేసు నమోదు చేశారు. 


పోరుమామిళ్లలోనూ... 

ఇటీవ ల కాలంలో పోరుమామిళ్ల ప్రధాన పట్టణాలకు ధీటుగా విస్తరిస్తోంది. అక్కడ జోరుగా రియల్‌ భూమ్‌ ఉంది. అయితే అక్కడ అధికారం మాటున స్థానికంగా ఉన్న ఇద్దరు చోటా నేతలు భూ ఆక్రమణలకు తెగబడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. విలువైన స్థలం ఉంటే దానికి నకిలీ పత్రాలు సృష్టించి అమ్మడంలో ఓ నేత కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కొంత మంది గ్యాంగ్‌ను తయారు చేసుకొని స్థలాలు ఆక్రమిస్తున్నట్లు చెబుతారు. ఈ స్థలం మాదని ఒరిజినల్‌ ఓనర్లు వస్తే బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా వారి ధాటికి చాలా స్థలాలు ఆక్రమణకు గురైనట్లు చెబుతున్నారు. జిల్లాలో బూచోళ్లు ఉన్నారు కాబట్టి మీరు కొన్న భూములను ఓ సారి చెక్‌ చేసుకోండి.... లేదంటే వాటిలో ఏదైనా కట్టడం ఉంటుంది. లేదా ఎవరికైనా అమ్మేసి ఉంటారు. 



Updated Date - 2022-04-25T05:53:32+05:30 IST