ఈసారి ముందుగానే!

ABN , First Publish Date - 2022-04-28T04:44:14+05:30 IST

రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వ్యవసాయానికి అండగా నిలిచేందుకు వచ్చే వానాకాలం పంట రుణాల పరిమితిని పెంచాలని నిర్ణయించింది.

ఈసారి ముందుగానే!

  • వ్యవసాయానికి రుణ పరిమితి పెంపు
  • వివిధ పంటలకు రుణ పరిమితి  ఖరారు 
  • పత్తి, మొక్కజొన్నకు రూ.3వేలు
  • వరికి రూ. 2వేల చొప్పున పెంపు
  • బ్యాంకులతీరు మారితేనే రైతుకు ప్రయోజనం

రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వ్యవసాయానికి అండగా నిలిచేందుకు వచ్చే వానాకాలం పంట రుణాల పరిమితిని పెంచాలని నిర్ణయించింది. అంతేకాకుండా  గతంలో మే నెలలో రుణపరిమితి ప్రకటించేవారు. ఈసారి మాత్రం ముందుగానే దీన్ని ప్రకటించడంతో రైతులకు కొంత ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. పెరుగుతున్న పెట్టుబడి వ్యయాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): వచ్చే వానాకాలం సీజన్‌ ఆరంభానికి ముందుగానే ప్రభుత్వం రైతులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది వానాకాలంలో ఇచ్చే పంటలకు రుణపరిమితి (స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌) పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా గతంలో కంటే భిన్నంగా ఏప్రిల్‌ మాసంలోనే ఆయా పంటలకు సంబంధించిన రుణపరిమితిని ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో వ్యవసాయ పంట రుణాలకు సంబంధించిన రుణపరిమితి పెంచుతూ అధికారులు నిర్ణయాలు తీసుకున్నారు. ఏఏ పంటకు ఎంతెంత పంటరుణం ఇవ్వాలనేదానిపై బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే వ్యవసాయ సీజన్‌కు సంబంధించి ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రధాన పంటలకు రుణపరిమితి పెంచారు. పత్తి, వరి, జొన్న, మొక్కజొన్న, సోయాబీన్‌, మిర్చి, పొద్దుతిరుగుడు తదితర పంటలకు రుణపరిమితి పెంచారు. ఈ  మేరకు తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ (టెస్కాబ్‌) 120రకాల పంటలకు సంబంధించి రుణపరిమితి ఖరారు చేసింది. వివిధ రకాల పంటల సాగు ఖర్చు, ఉత్పాదకత, నీటి వసతి, ఆదాయం ఆధారంగా రుణ నిర్ధారణ చేసింది. రుణపరిమితి నివేదికను రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ)కి పంపించింది. తాము ఖరారు చేసినట్లుగా రైతులకు పంట రుణాలు ఇవ్వాలని సూచించింది. ఇదిలాఉంటే జిల్లావ్యాప్తంగా వానాకాలం సీజన్‌లో దాదాపు 2లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో అధికంగా పత్తి, మొక్కజొన్న, వరి, కంది, జొన్న పంటలు సాగు చేస్తున్నారు. వాస్తవానికి వ్యవసాయ పంట రుణపరిమితి ప్రతిఏటా పెంచుతుంటారు. అయితే స్థానిక వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా వీటిని జిల్లాలవారీగా ప్రకటిస్తారు. దీంతో జిల్లాకు మరో జిల్లాకు వ్యవసాయ పంటరుణాల పరిమితి లెక్కల్లో  కొంత తేడా ఉంటుంది. అయితే గతంలో మే నెలలో రుణపరిమితి ప్రకటించేవారు. ఈసారి మాత్రం ముందుగానే దీన్ని ప్రకటించడంతో రైతులకు కొంత ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. అయితే దీన్ని అమలు చేయాల్సిన బ్యాంకులు ఏ మేర రైతులకు సహకరిస్తాయో అనేది వేచి చూడాలి. వాస్తవానికి వ్యవసాయ రుణపరిమితిని ప్రభుత్వం పెంచినప్పటికీ  ఆ మేర రుణాలు బ్యాంకులు రైతులకు ఇవ్వడం లేదు. రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులు రైతాంగాన్ని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇలాంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంటసాయం కింద ప్రతిఏటా రెండు విడతలుగా రైతుకు ఆర్ధికసాయం ప్రకటించింది. అయితే ఈ మొత్తం విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు ఉపయోగపడుతోంది. మిగతా వ్యవసాయ ఖర్చులకు రైతుకు మరింత రుణం అవసరముంటుంది. నిర్దేశించిన వ్యవసాయ రుణపరిమితి ప్రకారం బ్యాంకులు రైతులకు రుణాలు ఇస్తే రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే బడా బాబులకు ఉదారంగా రుణాలు ఇచ్చే బ్యాంకులు.. రైతులను మాత్రం రుణాలు ఇచ్చే సమయంలో అనేక ఇబ్బందులు పెడుతుంటాయి. ఈఏడాది ఆయా పంటలకు రుణపరిమితి పెంచిన ప్రభుత్వం రైతులకు బ్యాంకుల ద్వారా సకాలంలో  రుణాలు ఇప్పించగలిగితే వారికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. వాస్తవానికి ఎన్నికల ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి అనేక రాయితీలు ప్రకటించాయి. ఇందులోభాగంగా పంట రుణాలే కాకుండా రైతుకు నేరుగా ఆర్ధిక సహాయం కూడా అందిస్తున్నాయి. రాష్ట్ర ఫ్రభుత్వం రైతుబంధు పథకం కింద ఏటా ఎకరాకు రూ.10వేల చొప్పున అందిస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌లో రూ. 5వేలు, రబీ సీజన్‌లో రూ. 5వేల చొప్పున నేరుగా రైతుఖాతాలో జమ చేస్తోంది. అలాగే  కేంద్రం కూడా ఎకరా నుంచి 5 ఎకరాలలోపు ఉన్నవారికి రూ.6వేలు అందిస్తోంది. 

బ్యాంకర్లు సహకరిస్తేనే..

విత్తన, ఎరువుల ధరలు పెరగడంతో అన్నదాతలకు పెట్టుబడి ప్రతి ఏటా పెరుగుతోంది. అలాగే వ్యవసాయ కూలీల ధరలు పెరుగుతున్నాయి. దీంతో ప్రతిఏటా రైతుకు అదనపు భారం పడుతోంది. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో చేతిలో డబ్బులేక చిన్న, సన్నకారు రైతులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు రాకపోవడంతో గత్యంతరం లేక  రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వాస్తవానికి నిబంధనల మేర ఖరీ్‌ఫకు ఆరంభానికి ముందుగానే బ్యాంకర్లు పంటరుణాలు అందిస్తే రైతులు సాఫీగా వ్యవసాయం చేసుకోగలుగుతారు. కానీ సకాలంలో రైతులకు రుణాలు ఇవ్వాలని నాబార్డు ఇచ్చిన ఆదేశాలు కూడా ఎక్కడా అమలు కావడం లేదు. డీసీసీబీ (జిల్లా కేంద్రసహకార బ్యాంకు) కూడా వీటిని అమలు చేయడం లేదు. బ్యాంకర్లు లక్ష్యాల మేర రైతులకు రుణాలు ఇవ్వలేదు. ప్రతిఏటా చిన్న, సన్నకారు రైతులు పంటరుణాల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే బ్యాంకులు కూడా నిబంధనల మేర రైతులకు సకాలంలో పంట రుణాలు ఇస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. 

పంటలకు రుణపరిమితి ఇలా.. (రూపాయల్లో)

పంట పేరు     2021-22             2022-23 

పత్తి     35,000-38,000     38,000-40,000

వరి     34,000-38,000     36,000-40,000

వరి విత్తనోత్పత్తి    42,000-45,000     42,000-45,000

జొన్న     15,000-20,000     16,000-18,000

జొన్న విత్తనోత్పత్తి  20,000-22,000     22,000-25,000

మొక్కజొన్న     25,000-28,000     28,000-32,000

కంది     17,000-20,000     18,000-21,000

మినుము     15,000-18,000     18,000-21,000

పెసలు     15,000-17,000     18,000-21,000

పొద్దుతిరుగుడు    19,000-22,000     22,000-24,000

సోయాబీన్‌     22,000-24,000     24,000-26,000

వేరుసెనగ     24,000-26,000     26,000-28,000

కుసుమ     13,000-15,000     15,000-18,000

ఆముదం     15,000-18,000     18,000-20,000

మిర్చి     60,000-70,000     65,000-75,000

టమోట     44,000-50,000     44,000-50,000

క్యారెట్‌     26,000-28,000     28,000-30,000

ద్రాక్ష     90,000-1,00,000     95,000-1,00,000

సీడ్‌ లెస్‌     1,25,000-1,30,000     1,25,000-1,30,000

Updated Date - 2022-04-28T04:44:14+05:30 IST