ఈఏపీ కౌన్సెలింగ్‌ ఎప్పుడో!

ABN , First Publish Date - 2021-10-19T05:10:22+05:30 IST

ఫలితాలు విడుదలై 40 రోజులు గడుస్తున్నా ఇంకా ఏపీ ఈఏపీ సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం కాలేదు. దీంతో ఇటు ఇంజనీరింగ్‌లో చేరాలో.. అటు డిగ్రీలో చేరాలో తెలియక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రభుత్వం ఆగస్టు నెలలో ఈఏపీ సెట్‌ను నిర్వహించింది. జిల్లాలో 7,541 మంది విద్యార్థులు హాజరయ్యారు. గత నెల రెండో వారంలో ఫలితాలు విడుదల చేశారు. ఆ తరువాత చేపట్టాల్సిన కౌన్సెలింగ్‌ ప్రక్రియ జాప్యమవుతుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

ఈఏపీ కౌన్సెలింగ్‌ ఎప్పుడో!

- ఫలితాలు విడుదలై 40 రోజులు 

- విద్యార్థుల ఎదురుచూపు

(ఎచ్చెర్ల)

ఫలితాలు విడుదలై 40 రోజులు గడుస్తున్నా ఇంకా ఏపీ ఈఏపీ సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం కాలేదు. దీంతో ఇటు ఇంజనీరింగ్‌లో చేరాలో.. అటు డిగ్రీలో చేరాలో తెలియక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రభుత్వం ఆగస్టు నెలలో ఈఏపీ సెట్‌ను నిర్వహించింది.  జిల్లాలో 7,541 మంది విద్యార్థులు హాజరయ్యారు. గత నెల రెండో వారంలో ఫలితాలు విడుదల చేశారు. ఆ తరువాత చేపట్టాల్సిన కౌన్సెలింగ్‌ ప్రక్రియ జాప్యమవుతుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కొవిడ్‌ కారణంగా పబ్లిక్‌ పరీక్షలు రాయకుండానే ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన ఈ బ్యాచ్‌ విద్యార్థులు కౌన్సెలింగ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది సెట్‌ రాసిన విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇందులో ఎంతమంది ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేరుతారో తెలియాల్సి ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు జరుగుతుండడంతో మధ్యతరగతి, ఆపై తరగతికి చెందిన విద్యార్థులు అక్కడి కళాశాలల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. 


 జిల్లాలో 2వేల సీట్లు

జిల్లాలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీతో పాటు, మరో నాలుగు ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో సుమారు 2 వేలకు పైగా సీట్లు ఉన్నాయి. కౌన్సెలింగ్‌లో జాప్యమవుతుండడంతో చాలామంది విద్యార్థులు డిగ్రీలో చేరిపోతున్నారు. ఇది ఇంజనీరింగ్‌ అడ్మిషన్లపై తీవ్ర ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు. 


అమలుకాని నిబంధనలు 

ఏఐసీటీఈ నిబంధనలు సక్రమంగా అమలు కావడం లేదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. కళాశాలల అఫిలియేషన్‌, ఫీజుల నిర్ధారణ, కౌన్సెలింగ్‌, తరగతులు ప్రారంభం, తదితర కార్యక్రమాల నిర్వహణలో జాప్యమవుతోందని చెబుతున్నారు. దీనివల్ల విద్యా సంవత్సరంపై ప్రభావం పడనుందని.. విద్యార్థులు నష్టపోతారని అభిప్రాయ పడుతున్నారు. కొవిడ్‌ కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైందని... ఇప్పటికైనా ఈఏపీ సెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని సూచిస్తున్నారు. 

Updated Date - 2021-10-19T05:10:22+05:30 IST