Abn logo
Apr 13 2021 @ 00:24AM

ఈ-క్రాప్‌ ఉంటేనే బీమా

ఈనెల 15తో ముగియనున్న ప్రక్రియ

ఎంటీయూ 1010 రకం సాగు చేయొద్దు

వ్యవసాయశాఖ జేడీ ఆనందకుమారి


నెల్లూరు(వ్యవసాయం), ఏప్రిల్‌ 12 : విపత్కర పరిస్థితుల్లో అన్నదాతలను ఆదుకునే పంటల బీమా పథకంలో చేరాలంటే రైతులకు ఈ-క్రాప్‌ పోర్టల్‌లో నమోదు తప్పనిసరని వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ వై ఆనందకుమారి తెలిపారు. నెల్లూరులోని ఆమె కార్యాలయంలో సోమవారం మాట్లాడుతూ 2020 ఖరీఫ్‌లో వరి, జొన్న, మొక్కజొన్న, చెరకు, వేరుశనగ, పసుపు పంటలను నోటిఫై చేసినట్లు చెప్పారు. ఆ పంటలు సాగుచేసిన రైతులకు బీమా వర్తించాలంటే ఆధార్‌ అనుసంధానం చేసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ ఈనెల 15వతేదీతో ముగుస్తుందన్నారు. దిగుబడి తగ్గిన రైతులకు మే నెల్లో నగదు జమచేస్తారన్నారు. జిల్లాలోని ఏ రైతు భరోసా కేంద్రం నుంచైనా ఆధార్‌ అనుసంధానం చేసుకోవచ్చన్నారు. అదేవిధంగా సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద రూ.5.02 కోట్లను ఈనెల 20న సంబంధిత రైతుల ఖాతాల్లో జమ చేస్తారని తెలిపారు.  డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం ద్వారా ఇప్పటివరకు ఎవరైనా అర్హులు లబ్ధి పొందకపోతే  గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి ఈనెల 31లోగా నమోదు చేసుకోవాలని సూచించారు. దీనికి సంబంధించిన నగదు మే13వ తేదీన రైతులకు జమ చేయడం జరుగుతుందన్నారు. కాగా, జిల్లాలో ఎడగారు పంటకు దాదాపు 5,89,000ల ఎకరాలకు సాగునీరు అందించబోతున్నా రని, రైతులు ఎన్‌ఎల్‌ఆర్‌ 34449, జేజీఎల్‌, ఎన్‌ఎల్‌ఆర్‌ 40024(శ్వేత), ఎన్‌ఎల్‌ఆర్‌ 30491(ధరణి) వంటి రకాలను సాగుచేసుకోవాలని సూచించారు. ఎంటీయూ 1010 రకం ఈ సీజనుకు అనుకూలమైనప్పటికీ ప్రభుత్వం ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదన్నారు. రైతులు ఆ రకాన్ని సాగుచేయవద్దని విజ్ఞప్తి చేశారు. దీనిపై విస్తృత ప్రచారం చేయాలని వ్యవసాయ అధికారులు, సిబ్బందిని ఆదేశించామని జేడీ వివరించారు. 

Advertisement
Advertisement
Advertisement