Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ కష్టం మళ్లీ రానివ్వం

పెన్నా పొర్లుకట్టకు రూ.100 కోట్లు

సోమశిల ఆఫ్రాన పనులూ ప్రారంభిస్తాం

పండగ తర్వాత నేనేవచ్చి శంకుస్థాపన చేస్తా

సంగం, నెల్లూరు బ్యారేజీలనూ ప్రారంభిస్తా

నెల్లూరు పర్యటనలో సీఎం జగన

వరద బాధితులకు పరామర్శ


నెల్లూరు, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి) :

‘పెన్నా నదికి ఇరువైపులా పొర్లుకట్టలు లేకపోవడంతో వరుసగా రెండో ఏడాది కూడా వరదలు సంభవించాయి. మళ్లీ వరదలు రాకుండా పొర్లుకట్టలు నిర్మిస్తాం. ఇందుకోసం రూ.100 కోట్లు మంజూరు చేశాం. ఈ పనులకు పండుగ పోయాక నేనే వచ్చి శంకుస్థాపన చేస్తా’నని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రకటించారు. నెల్లూరు నగరంలోని వరద ముంపు ప్రాంతమైన భగతసింగ్‌ కాలనీలో శుక్రవారం సీఎం పర్యటించారు. నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం మధ్యాహ్నం 130 గంటలకు ఇక్కడకు రావాల్సి ఉండగా రెండు గంటల ఆలస్యంగా 3:45 గంటలకు చేరుకున్నారు. మొదట పెన్నా నదిని పరిశీలించి, వరదలనాటి ఫొటోలను తిలకించారు. అప్పటి పరిస్థితులను అధికారులు వివరించారు. అనంతరం ముంపు బాధితులతో సీఎం మాట్లాడారు. పలువురు తమ కష్టాలను చెప్పుకుని, మరోసారి వరద పునరావృతం కాకుండా పొర్లుకట్టలు నిర్మించాలని కోరారు.  ఓ వృద్ధురాలు తనకు పింఛన రావడం లేదని, ఇప్పించాలని సీఎంను వేడుకుంది. ఇంకొంతమంది తమ వ్యక్తిగత సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. శివయ్య అనే వ్యక్తి మాట్లాడుతూ తన కుమార్తెను ఓ డాన్స మాస్టర్‌ హత్యచేసి, ఆత్మహత్యగా చిత్రీకరించాడని తనకు ఇంతవరకు న్యాయం చేయలేదని వాపోయాడు. దీంతో స్పందించిన సీఎం వెంటనే చర్యలు తీసుకోవాలని పక్కనే ఉన్న ఎస్పీని ఆదేశించారు. అలాగే ఎస్‌కే.నువుల్లా అనే అంధుడు మాట్లాడుతూ బ్యాక్‌లాగ్‌ పోస్టుల్లో పురుషులకూ ప్రాధాన్యం ఇవ్వాలని అభ్యర్థించాడు. భగతసింగ్‌ కాలనీలో అంగనవాడీ కేంద్ర ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. 


‘సోమశిల’ ఆఫ్రానకు రూ.120 కోట్లు


సోమశిల జలాశయం వద్ద ఆఫ్రాన కూడా దెబ్బతిందని, దీని నిర్మాణానికి రూ.120 కోట్లు మంజూరు చేసినట్లు సీఎం జగన తెలిపారు. పండుగ పోయాక జిల్లాకు వచ్చి పెన్నా పొర్లుకట్టలతోపాటు సోమశిల ఆఫ్రాన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తానని వెల్లడించారు. అదేరోజున సంగం, నెల్లూరు బ్యారేజీలను కూడా ప్రారంభిస్తానని సీఎం ప్రకటించారు. వరదల సమయంలో  కలెక్టర్‌ చక్రధర్‌బాబు, కమిషనర్‌ దినే్‌షకుమార్‌తోపాటు జిల్లా యంత్రాంగం బాగా పనిచేసిందని కితాబిచ్చారు. దాదాపు 99 శాతం మందికిపైగా వరద బాధితులకు తక్షణ సాయం, రేషన సరుకులు అందజేశామని చెప్పారు. ఇంకా సాయం అందనివాళ్లు ఈ నెల 5వ తేదీలోపు స్థానిక సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, ఎవరికైనా వివిధ కారణాలతో అందకపోతే అటువంటి వారు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏడాదిలో రెండు సార్లు డిసెంబరు, జూన నెలల్లో కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులను సంక్షేమ పథకాల జాబితాలోకి చేరుస్తున్నామని చెప్పారు. జిల్లాలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. సీఎం వెంట జిల్లా ఇనచార్జ్‌ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, జిల్లా మంత్రులు పోలుబోయిన అనీల్‌కుమార్‌ యాదవ్‌, మేకపాటి గౌతంరెడ్డి, సీఎం ఓఎస్డీ ధనుంజయరెడ్డి, కలెక్టర్‌ చక్రధర్‌ బాబు, ఎస్పీ విజయరావు, జడ్పీ చైర్‌పర్సన ఆనం అరుణమ్మ, నగర మేయర్‌ పొట్లూరి స్రవంతి, ఎమ్మెల్సీ బల్లి కల్యాణచక్రవర్తి, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, జేసీలు ఎంఎన హరేందిరప్రసాద్‌, గణే్‌షకుమార్‌, విధేహ్‌ ఖరే, డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు ఉన్నారు. 


అందరికీ కాదు.. కొందరికే!


శిక్షణ పొందిన వారితోనే సీఎం మాటామంతీ

బాధితులపై పోలీసుల ఆంక్షలు

గడప దాటనీయకుండా అడ్డంకులు


వరదలో సర్వం కోల్పోయి తమ బాధలను ముఖ్యమంత్రికి చెప్పుకునే అవకాశమూ బాధితులకు దక్కలేదు. కేవలం ముందుగా శిక్షణ ఇచ్చిన కొందరినే బారికేడ్ల వద్దకు అనుమతించారని భగతసింగ్‌కాలనీలో వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంతో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో ఎంపిక చేసుకున్న కొంత మందికి అధికారులు ముందే శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. వీరందరినీ ఒక ఇంట్లో ఉంచి సీఎం రావడానికి ముందు వారిని బారికేడ్ల ముందుకు తీసుకొచ్చారు. ఇక అక్కడే నివాసం ఉన్న కుటుంబాలను సీఎం వచ్చే సమయానికి ఇళ్లలో నుంచి బయటకు రానివ్వకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇంటి నుంచి బయటకు వస్తే సీఎం కాన్వాయ్‌కు అడ్డంకులు ఏర్పడతాయనే సాకుతో వీరిని ఇంటి గడప దాటనివ్వలేదు. వీరు బయటకు రాకుండా ప్రతి ఇంటి ముందు ఒక మహిళా కానిస్టేబుల్‌ను పహారా ఉంచారు. దీంతో వరద తాకిడికి నిజంగా నష్టపోయిన ప్రజల్లో అత్యధికులు సీఎంను కలిసి తమ బాధ చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. కేవలం ఎంపిక చేసుకున్న కొంత మందికి మాత్రం ఎలా మాట్లాడాలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి సీఎం సమక్షానికి తీసుకెళ్లినట్లు స్థానికులు ఆరోపించడం గమనార్హం. 


అడుగడుగునా పోలీసులు


సీఎం పర్యటన సందర్భంగా భగతసింగ్‌ కాలనీ మొత్తం పోలీసుల చేతుల్లోకి వెళ్లింది. కాలనీ మొత్తం అడుగడుగునా పోలీసులు మోహరించారు. పక్కనున్న మునక ప్రాంతాలైన జనార్ధనరెడ్డి కాలనీ, వెంకటేశ్వరపురం బాధితులను అనుమతించలేదు. భగతసింగ్‌ కాలనీలో కూడా కొంతమందికే సీఎంతో మాట్లాడే అవకాశం కల్పించారు. వీరికి కూడా రెండు రోజుల నుంచి శిక్షణ ఇచ్చినట్లు చెప్పుకుంటుండటం గమనార్హం. సీఎం ఒకే వీధిలో పర్యటించగా ఆ వీధిలోని స్థానికులను ఇళ్లు దాటి బయటకు రానీయలేదు. ప్రతి ఇంటి ముందు ఓ మహిళా కానిస్టేబుల్‌ను బందోబస్తుగా పెట్టారు. వీరెవరికీ తమ కష్టాలు చెప్పుకునే అవకాశం కల్పించకపోవడంతో వారంతా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా తమ బాధలు చెప్పుకునే స్వేచ్ఛ లేదా అంటూ కొందరు మాట్లాడుకోవడం కనిపించింది. నెల్లూరు రూరల్‌ మండలం దేవరపాళెంలోనూ పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. 


మురుగుకు మరుగు


ముఖ్యమంత్రి కంటికి పేరుకుపోయిన మురుగు కనిపించకూడదనే ఉద్దేశంతో అధికారులు చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు. ఆ క్రమంలో నెల్లూరు-జొన్నవాడ రోడ్డులో ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి కూతవేటు దూరంలో విపరీతమైన మురుగు మడుగులుగా ఏర్పడింది. ఆ ప్రాంతంలో విపరీతమైన దుర్వాసన వెదజల్లుతోంది. అప్పటికప్పుడు ఆ మురుగును తొలగించడం సాధ్యం కాకపోవడంతో ఆ దారిన రాకపోకలు సాగించే సీఎంకు ఆ దృశ్యాలు కనిపించకుండా సుమారు 100 మీటర్ల పొడవున తెల్లటి పరదాలు కట్టి కవర్‌ చేసుకున్నారు. పెనుబల్లిలో పోలీసులు ఏకంగా ఒక ఇంట్లోని వ్యక్తులు బయటకు రావడానికి వీల్లేకుండా గేటును ఇనుక చువ్వతో కట్టేశారు. సీఎం ఆ ఇంటి ముందు నుంచి హైస్కూలులోకి వెళ్లాల్సి ఉంది. సీఎం ఆ ఇంటి ముందుగా వెళుతారు కాబట్టి ఎవరూ ఆ ఇంటి యజమానులు, అప్పటికే సీఎంను చూడటానికి ఆ ఇంటి మిద్దె ఎక్కిన స్థానికులను వెలుపలికి రానివ్వకుండా ఈ పనిచేశారు. అయితే ఆ కుటుంబ యజమాని నా ఇంటికే తాళం వేస్తారా అని తిరగబడటంతో పోలీసులు గేటుకు కట్టిన ఇనుప కమ్మిని విప్పేయక తప్పలేదు.


అధికారుల సమీక్ష రద్దు


పర్యటన ఆలస్యం అయిన కారణంగా జిల్లా పరిషత సమావేశం మందిరంలో నిర్వహించాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధుల సమావేశాలు రద్దు అయ్యాయి. ముఖ్యమంత్రి పర్యటనలో మంత్రులు మేకపాటి గౌతంరెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌, జిల్లాకు చెందిన మిగిలిన శాసనసభ్యులు, పార్లమెంట్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

వరద నష్టాలను ఫొటోల ద్వారా సీఎంకు వివరిస్తున్న కలెక్టర్‌


మా వినతులు ఆలకించండి : బారీకేడ్ల వద్ద అర్జీలు చేతపట్టుకుని నిరీక్షిస్తున్న ప్రజలు


సీఎం వస్తున్నారనీ.. జొన్నవాడ వద్ద పోలీసుల ఆంక్షలు


Advertisement
Advertisement