ఈ..తంటా

ABN , First Publish Date - 2022-08-14T05:08:19+05:30 IST

రైతు తను పండించిన ఉత్పత్తులను మద్దతు ధరకు అమ్ముకోవాలన్నా, బీమా పరిహారం పొందాలన్నా, రాయితీ ఎరువులు కావాలన్నా.. ఇలా ప్రతిదశలోనూ ఈ పంటే కీలకం.

ఈ..తంటా
అద్దంకి మండలం సింగరకొండపాలెంలో ఈ పంటలో నమోదు చేస్తున్న యంత్రాంగం

నత్తనడకన ఈ - పంట నమోదు

ఈ నెలాఖరు వరకే నమోదుకు అవకాశం

ఉమ్మడి గుంటూరు జిల్లాలో సర్వర్‌ సమస్య

సాంకేతికత, సిబ్బంది విషయంలో తాత్సారం

సీసీఆర్‌సీ మెలికతో 60,000 మంది కౌలు రైతులు దూరం



బాపట్ల, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): రైతు తను పండించిన ఉత్పత్తులను మద్దతు ధరకు అమ్ముకోవాలన్నా, బీమా పరిహారం పొందాలన్నా,  రాయితీ ఎరువులు కావాలన్నా.. ఇలా ప్రతిదశలోనూ ఈ పంటే కీలకం. ఇంతటి కీలకమైన ఈ పంట నమోదు ఉమ్మడి  గుంటూరు జిల్లాలో నత్తనడకన సాగుతోంది. ఖరీఫ్‌ సాగుకు సంబంధించి  అధికారికంగా ఈ నెలాఖరు వరకే ఈ పంట నమోదుకు గడువు అని ప్రభుత్వం ఒక వైపు చెబుతుంది. కానీ అందుకు కావాల్సిన సాంకేతిక మద్దతు, సిబ్బంది విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. సర్వర్‌ ఇబ్బందులు,  ప్రభుత్వ నిర్ణయాలు, యంత్రాంగం నిర్లక్ష్యంతో ఈ పంట నమోదు రైతులకు తంటాలు తెస్తోంది. ఈ క్రమంలో అర్హులైన ఎంతోమంది రైతులు రాయితీ ఫలాలకు దూరంగా ఉండిపోవాల్సి వస్తోంది. నెలాఖరుతో గడువు ముగియనున్నా ఇంతవరకు క్షేత్రస్థాయిలో నమోదు పూర్తి స్థాయిలో  పట్టాలెక్కలేదు. యంత్రాంగం కొన్ని చోట్ల మొదలు పెట్టినా  సర్వర్‌ సమస్య ప్రతిబంధకంగా మారింది. ఈ క్రాప్‌ బుకింగ్‌ యాప్‌ వచ్చిన తర్వాత వీఏఏలు యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అయ్యి వారి పరిధిలోని సర్వే నంబర్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రైతులు సాగు చేసిన పంట పొలాలను సందర్శించాలి. కానీ డౌన్‌లోడ్‌కు సంబంధించి ప్రాథమిక ప్రక్రియే ఇంకా పూర్తకాలేదని తెలుస్తోంది. ఈ ప్రక్రియ మొత్తం వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా నిర్వహించాలి. అయితే ఇప్పటి వరకు ఆయా శాఖలు ఉమ్మడిగా ఒక్క అవగాహన సమావేశం కూడా నిర్వహించలేదు. ఆయా శాఖల మధ్య సమన్వయ లోపాలతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది.


సాగు విస్తీర్ణంతో పోలిస్తే....

ఈ ఖరీఫ్‌లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో 4,90,000 హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణాన్ని యంత్రాంగం లెక్కకట్టింది. ప్రధానంగా వరి, పత్తి, మిర్చి, కంది, మినుము, పసుపు, పెసర ఎక్కువగా ఖరీఫ్‌లో సాగవనున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో సాగు విస్తీర్ణంతో పోలిస్తే ఈ క్రాప్‌ నమోదు తక్కువగా ఉన్న సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి. వాస్తవానికి సాగుకు నమోదుకు మధ్య అంతరం చాలా స్వల్పంగా ఉండాలి. అది కూడా వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాకపోవడం ఇతరత్రా సాంకేతిక కారణాలు మినహాయిస్తే నమోదుకు అడ్డంకులు ఏమీ ఉండవు. కానీ గతంలో కూడా దాదాపు విస్తీర్ణానికి, నమోదుకు తేడా దాదాపు 18శాతం ఉందనేది అంచనా. గతంలో అందరికీ ఈ పంట నమోదు చేసిన ప్రభుత్వం తాజాగా కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డు మెలిక పెట్టింది. ఈ మెలికతో ఉమ్మడి జిల్లా పరిధిలో దాదాపు 60,000 మంది కౌలు రైతులు ప్రభుత్వ ఫలాలకు దూరం కానున్నారు. వారి విషయంలో ప్రత్యేకంగా నమోదు చేపట్టి ప్రభుత్వ ఆమోదం తర్వాత జాబితాలో చేరుస్తామని యంత్రాంగం చెబుతున్నప్పటికీ అంతిమంగా చాలామంది ఈ పంటకు దూరం కానున్నారు. 


లోపాలు కుప్పలు తెప్పలు..

ఈ పంటలో లోపాలు ప్రతి గ్రామంలో కుప్పలుతెప్పలుగా కనపడుతున్నాయి. గతంలో స్థానికంగా ఉండే రాజకీయ నాయకుల అండదండలతో అనర్హులు ఎంతోమంది దర్జాగా ఈ పంటలో నమోదై అప్పనంగా ప్రభుత్వ సొమ్మును కైంకర్యం చేసిన ఘటనలు వెలుగుచూశాయి. అసలైన రైతులు, నష్టపోయిన వారికి మాత్రం ఈ-పంట ఫలాలను అందుకోలేక పోతున్నారు. క్షేత్రస్థాయిలో యంత్రాంగం నమోదు చేసినా తీరా పంట అమ్ముకునే సమయంలో అనేక లోపాలు బహిర్గతమవుతున్నాయి. దీనంతటికీ కారణం పారదర్శకత లోపించడమే అనే విమర్శలున్నాయి. ఈ క్రాప్‌లో నమోదైన  వారి వివరాలు ఆన్‌లైన్‌లో కనిపించవు. విధిగా జాబితాను సచివాలయాల్లో  ప్రదర్శించాల్సిన సిబ్బంది కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో అంతిమంగా రైతులు నష్టపోతున్నారు. ఇక ఈ పంట నమోదుకు ప్రభుత్వం పూటకో యాప్‌ను తెచ్చి యంత్రాంగాన్ని ఇబ్బందులు పెడుతుంది. ఇందుకు సర్వర్‌ సమస్యలు కూడా తోడయ్యాయి.  ప్రభుత్వం నిర్దేశించుకున్న ఈ నెలాఖరు గడువుకు లక్ష్యాన్ని చేరాలంటే సర్వర్‌ సమస్యలను పరిష్కరించడంతోపాటు సరిపడా సిబ్బందిని కేటాయించాలి. నూతనంగా ఏర్పడిన పల్నాడు, బాపట్ల జిల్లాల్లో సిబ్బంది కొరత, రికార్డుల ఆన్‌లైన్‌ వంటి సమస్యలు అనేకం ఉన్నాయి. వాటన్నింటిపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టాల్సి ఉంది. తుది గడువును మళ్లీ పొడిగించే అవకాశాలున్నాయని యంత్రాంగం చెబుతున్నప్పటికీ సాధ్యమైనంత త్వరగా అర్హులైన రైతులందరినీ ఈ క్రాప్‌లో నమోదు చేస్తేనే రైతులకు మేలు జరుగుతుంది.

Updated Date - 2022-08-14T05:08:19+05:30 IST