Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిర్మాణ దశలోనే ‘డై’క్‌!

- వరదకు కొట్టుకుపోయిన వైనం

- పనుల్లో కానరాని నాణ్యతా ప్రమాణాలు

- కొరవడిన అధికారుల పర్యవేక్షణ

- రూ.2కోట్లు వృథా

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

వృథా జలాలను ఒడిసిపట్టి తాగునీటికి వినియోగించాలనే ఉన్నతాశయంతో శ్రీకాకుళం కొత్తబ్రిడ్జి వద్ద నాగావళి నదిలో చేపడుతున్న డైక్‌ పనుల్లో నాణ్యత కొరవడింది. పర్యవేక్షక ఇంజనీర్ల ఉదాసీనత, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వెరసి నిర్మాణ దశలోనే డైక్‌ కొట్టుకుపోయింది. దీంతో కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయ్యింది. సాధారణంగా తుఫాన్‌లు, అల్పపీడనాలు వంటి సందర్భాల్లో అధిక వర్షాలు కురిసి వాగులు, వంకలు పొంగిపోర్లుతాయి. ఆ నీరంతా నదులు, సముద్రంలో కలిసి వృథా అవుతుంటుంది. ఫలితంగా వేసవిలో నదుల్లో నీరులేక తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో మడ్డువలస నుంచి నాగావళి నదిలో కలిసే జలాలకు అడ్డుకట్ట వేసి.. నిల్వ చేసుకొనేందుకు శ్రీకాకుళం వద్ద సబ్‌ సర్ఫేస్‌ డైక్‌ను నిర్మించాలని అధికారులు భావించారు. ముఖ్యంగా నగరవాసుల తాగునీటి అవసరాలను తీర్చే లక్ష్యంతో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో డేఅండ్‌నైట్‌ సమీపంలోని నాగావళి కొత్త బ్రిడ్జి పంపు హౌస్‌ వద్ద డైక్‌ నిర్మాణానికి 2018లో శ్రీకారం చుట్టారు. స్మార్ట్‌ సిటీ అభివృద్ధి నిధులు రూ.4.90 కోట్లు కేటాయించి  టెండర్లు పూర్తి చేశారు. ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ అప్రూవ్డ్‌ కలిగిన పీవీ గంగాధర్‌ అనే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు.  2019 జూన్‌ నాటికి పూర్తి చేయాలని అగ్రిమెంట్‌ కుదిరింది. ఈ కాంట్రాక్టర్‌.. మరో సబ్‌ కాంట్రాక్టర్‌కు డైక్‌ నిర్మాణ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. తొలుత ఈ పనులు వేగంగా సాగాయి. తరువాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, దీనికితోడు కరోనా విజృంభణ నేపథ్యంలో నత్తనడకన సాగాయి. సుమారు 260 మీటర్ల పొడవున డైక్‌ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, ఇప్పటికే సగం  పనులు పూర్తయ్యాయి. 


కొరవడిన పర్యవేక్షణ..

వాస్తవానికి నదులపై చేపట్టే డైక్‌ నిర్మాణాలను జలవనరుల శాఖ అధికారులు పర్యవేక్షించాలి. కానీ, ఇక్కడి పనులను మునిసిపల్‌ వర్క్స్‌ ఇంజనీర్లకు అప్పగించారు. వీరైనా పర్యవేక్షించారా అంటే లేదు. కాంట్రాక్టర్‌ ఇష్టానికే పనులను వదిలేశారు. దీంతో పనుల్లో నాణ్యత కొరవడి ఇటీవల గులాబ్‌ తుఫాన్‌ సమయంలో వచ్చిన వరదలకు సుమారు 150 మీటర్ల పొడవున డైక్‌ డైవర్సన్‌ ఎప్రాన్‌ వాల్‌ కొట్టుకుపోయింది. అధికారులు ఇప్పటికే సంబంధిత కాంట్రాక్టర్‌కు రూ.2కోట్ల బిల్లులు కూడా చెల్లించారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, ఇంజనీర్ల సూచనల మేరకు వరద డైవర్షన్‌ ఏర్పాటు చేయకపోవడం వంటి కారణాలతో డైక్‌ కొట్టుకుపోయినట్లు ఇంజనీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. 


రక్షణ గోడ నిర్మించకుండా పనులు..

నదిలో డైక్‌ నిర్మించేటప్పుడు వరద వల్ల తీరం కోతకు గురికాకుండా ముందుగా రక్షణ గోడ నిర్మించాల్సి ఉంది. ఆ తరువాతే డైక్‌ పనులు ప్రారంభించాలి. కానీ, మునిసిపల్‌ వర్స్క్‌ ఇంజనీర్లు ముందు చూపు లేకుండా శ్రీకాకుళం నాగా వళి వద్ద డైక్‌ పనులు మొదలుపెట్టేశారు. వాస్తవానికి శాంతినగర్‌ కాలనీ నుంచి డే అండ్‌ నైట్‌ వరకు 800 మీటర్ల వరకు డైవర్షన్‌ ప్రొటక్షన్‌ వాల్‌ నిర్మించాల్సి ఉంది. అలాగే.. వింగ్స్‌, రిటర్న్స్‌, ఎబట్‌మెంట్‌లను నిర్మించాలి. ఈ పనులు ఇంకా ప్రతిపాదనల స్థాయిలోనే ఉండిపోయాయి. అయితే, ఇవేమీ పట్టించుకోకుండా డైక్‌ను నిర్మిస్తుండడంతో వరదలకు అది కొట్టుకుపోయినట్లు ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతున్నారు.


నోటీసులతో సరి...

ఈ డైక్‌ పనులు చేసిన కాంట్రాక్టర్‌కు మునిసిపల్‌ అధికారులు మొక్కుబడిగా నోటీసులు జారీ చేసి మిన్నకుండిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా గులాబ్‌ తుఫాన్‌ వరదలకు కొట్టుకుపోయిందని కాంట్రాక్టర్‌కు అనుకూలంగా ఈఎన్‌సీకి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే రూ.2 కోట్లు వరకు కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించారు. ఆ కాంట్రాక్టర్‌తోనే కొట్టుకుపోయిన డైక్‌ పనులు పూర్తి చేయించాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ, అధికారులు ఆ విధంగా చేయకుండా కాంట్రాక్టర్‌కు దన్నుగా నిలవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


కన్నెత్తి చూడని అధికారులు..

నాగావళి కొత్త బ్రిడ్జి వద్ద భవిష్యత్‌లో నిర్మించనున్న రక్షణ గోడకు సంబంధించి అధికారులు ప్రతిరోజూ వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. కానీ, ఆ పక్కనే కొట్టుకుపోయిన డైక్‌ వైపు మాత్రం కన్నెత్తిచూడడం లేదు. శనివారం కలెక్టర్‌ శ్రీకేశ్‌ బాలాజీ లఠ్కర్‌,  ఆదివారం తుఫాన్‌ ప్రత్యేకాధికారి అరుణ్‌కుమార్‌లు రక్షణ గోడ నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించారు.  తుఫాన్‌లు, వరదల వల్ల నగరంలోకి నీరు ప్రవేశించకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అయితే, అక్కడే రూ.4.90 కోట్లతో నిర్మిస్తున్న డైక్‌ కొట్టుకుపోయినా వారు పరిశీలించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 


పనులు పూర్తి చేయిస్తాం

 తుఫాన్‌ కారణంగా డైక్‌ దెబ్బతిన్న మాట వాస్తవమే. నిర్మాణం దశలోనే కొట్టుకుపోయింది. సంబంధిత కాంట్రాక్టర్‌ను పిలిపించి ఈఎన్‌సీ అధికారుల సూచనల మేరకు పనులు పూర్తి చేయిస్తాం. 

- చల్లా ఓబులేష్‌,  నగరపాలక కమిషనర్‌, శ్రీకాకుళం

Advertisement
Advertisement