దాచుకుంటే.. దోచుకున్నారు!

ABN , First Publish Date - 2022-05-23T06:50:04+05:30 IST

అనపర్తి డ్వాక్రాలో అంతటా దారుణం.. మహిళలు రుణాలు తీసుకోలేదని చెబుతున్నారు. రుణాలు మాత్రం వారి పేరునే చూపుతున్నాయి..

దాచుకుంటే.. దోచుకున్నారు!
ఏపీఎం రామరాజుతో మాట్లాడుతున్న డ్వాక్రా మహిళలు (ఫైల్‌)

అనపర్తి డ్వాక్రాలో దారుణం

ఒక్కో పొదుపు ఖాతా నుంచి రూ.3,650 మళ్లింపు

మొత్తంగా 1509 డ్వాక్రా పొదుపు సంఘాలు

సభ్యులకే తెలియకుండా రుణాలు

గ్రూపు రద్దు చేయమంటే రూ. 10 లక్షలు కాజేశారు..

పక్కదారి పట్టిన ఉన్నతి రుణాలు

లబోదిబోమంటున్న మహిళలు


అనపర్తి, మే 22 : అనపర్తి డ్వాక్రాలో అంతటా దారుణం.. మహిళలు రుణాలు తీసుకోలేదని చెబుతున్నారు. రుణాలు మాత్రం వారి పేరునే చూపుతున్నాయి.. ఇంతే కాదు.. డ్వాక్రా మహిళలకేం తెలుసు అనుకున్నారో ఏమో ఏకంగా డ్వాక్రా సంఘాల పొదుపు ఖాతాల నుంచే సొమ్ము వేరే అకౌంట్లకు బదిలీ చేసేశారు. సుమారు రూ. 55 లక్షలు సొమ్ము మళ్లించినట్టు సమాచారం. అయినా అధికారులు కిమ్మనకుండా మిన్నకుండిపోయారు. ఇది చాలదన్నట్టు తెలియకుండానే చాలా డ్వాక్రా గ్రూపుల పేరు చెప్పి రుణాలు తీసేసుకున్నారు. ఇంత జరుగుతున్నా.. శనివారం తూతూ మంత్రంగా విచారణ చేసి మమ అనిపించారు. 


పొదుపు సొమ్ము ఎందుకు మళ్లించారు..


అనపర్తి మండలంలో 1509 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. సుమారు 15 వేల మంది మహిళలు డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థిక స్వావలంభనవైపు అడుగులు వేస్తున్నారు. అయితే వెలుగు సిబ్బంది డ్వాక్రా మహిళల నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడడం ఆనవాయితీగా మారింది.  ఇలాగే పొదుపు సంఘాల సభ్యత్వ  రుసుం పేరుతో వారికే తెలియకుండా ఒక్కో సంఘం ఖాతా నుంచి ఏకంగా రూ.3650 చొప్పున అనధికారిక ఖాతాలకు మళ్లించారు. ఈ లెక్కన అన్ని ఖాతాల నుంచి సొమ్ము మళ్లించి ఉంటే సుమారు రూ. 55 లక్షల వరకూ ఉంటుంది. అనపర్తిలోని ఒక్క యూనియన్‌ బ్యాంక్‌లోనే సమారు 800 వరకూ ఖాతాలు ఉన్నట్టు సమాచారం. మిగిలిన 700 ఖాతాలు వివిధ బ్యాంకుల్లో ఉన్నాయి.ఒక్క యూనియన్‌ బ్యాంక్‌లోనే రూ.3650 చొప్పున రూ.600 ఖాతాల నుంచి నగదు మళ్లించినట్టు అధికారులే చెబుతున్నారు. అయితే ఇలా మళ్లించిన సొమ్ములు మహిళా సమాఖ్య ఖాతాలకు చేరాల్సి ఉండగా ఇటీవలే నూతనంగా ఏర్పాటు చేసిన మండల మహిళా సమాఖ్య మ్యూచువల్‌ అకౌంట్‌కు తరలించడం ఆ అకౌంట్‌ ద్వారా పెద్ద మొత్తాల్లో సొమ్ములు బయట బ్యాంకుల ఖాతాలకు చెక్కుల రూపంలో వెళ్లడంపై అనేక అనుమానాలకు దారి తీసింది.వీరిలో కొంత మంది ఖాతాల్లో రూ.3650 చొప్పున రెండు పర్యాయాలు, మూడు పర్యాయాలు మళ్లించినట్టు పాసు పుస్తకాలు చెబుతున్నాయి.ఈ ప్రకారం గల్లంతైన సొమ్ములు సుమా రుగా  55 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. అయితే సిబ్బంది ఎటువంటి బెరుకూ లేకుండా ఖాతాల నుంచి సొమ్ము మళ్లించడం.. నేటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 


దారుణాలు వెలుగు చూశాయిలా..


కొందరు మహిళలు తమ ఖాతాల నుంచి తీసుకున్న సొమ్ములు ఎక్కడికి వెళ్లాయో చెప్పాలంటూ అనపర్తి ఏపీఎం రామరాజును నిలదీశారు. దీంతో విషయం వెలుగు చూసింది. దీంతో పలు సంఘాలు బయటకు వచ్చాయి. విషయం పెద్దది కావడంతో ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్య నారాయణరెడ్డి డ్వాక్రా పొదుపు ఖాతాల్లో మాయమవుతున్న సొమ్ములపై విచారణ నిర్వహించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌ మాధవీలతను కోరా రు.ఈ నేపథ్యంలో ఆమె రాజమహేంద్రవరం డీఎల్‌డీవో రత్నకుమారిని విచార ణాధికారిణిగా నియమించారు. ఆమె విచారణకు హాజరైన మహి ళల నుంచి రాత  పూర్వకంగా ఫిర్యాదులు తీసుకున్నారు. విచారణకు హాజరైన మహిళల్లో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క రకమైన బయటపడింది.


గ్రూపు రద్దు చేయమంటే.. రూ.10 లక్షల రుణం

అనపర్తికి చెందిన వెంకటలక్ష్మి మహిళా శక్తి సంఘం తమ గ్రూపును రద్దు చేసుకోవాలని బాకీ పూర్తిగా చెల్లించారు. కానీ గ్రూపు రద్దు కాకుండానే రూ.10 లక్షల రుణం మంజూరైనట్టు తెలిసింది. బ్యాంకుకు వెళ్లి అడిగితే మీ గ్రూపు పేరున రూ.10 లక్షల అప్పు ఉందని చెబుతున్నారు. మా ప్రవేయం  లేకుండా అప్పు ఎవరికిచ్చారో తెలిపాలి.. 


ఆ మిగిలిన నలుగురు ఎవరు..

అనపర్తికి చెందిన జ్యోతి మహిళా శక్తి సంఘం ప్రతినిధులు తమ గ్రూపులో ఒకరు మాత్రమే ఉన్నతిలోను తీసుకున్నారని.. ఇప్పుడు మరో నలుగురు కూడా లోను తీసుకున్నట్టుగా తెలుస్తుందని లబోదిబోమన్నారు.దీనిపై విచారణ నిర్వహించి తమ సభ్యుల పేరు మీదు ఉన్న అప్పు ఎవరి ఖాతాకు వెళ్లిందో తేల్చాలన్నారు.


రూ. 90 వేల రుణం ఎవరికిచ్చారు..

అనపర్తికి చెందిన ప్రిన్సి మహిళా శక్తి సంఘం గ్రూపు  ప్రమేయం లేకుండానే ఉన్నతి రుణం పేరుతో రూ. 90 వేలు కాజేశారు.తమ గ్రూపులో నలుగురు మహిళల పేరున రుణం మంజూరైందని చెబుతున్నారు..చెప్పే పేర్లలో ఈత కోట గౌతమి ఈ దేశంలోనే లేదని.. ఆమె పేరుతో రుణం ఎవరికిచ్చారో తేల్చాలని కోరారు. 


మేం తీసుకోలేదు.. రూ. లక్ష ఎవరికిచ్చారు..

మహేంద్రవాడ మల్లికా మహిళా శక్తి సంఘం మా గ్రూపు నకు ఉన్నతి రుణం కింద రూ.లక్ష మంజూరయ్యాయి. ఈ సొమ్ములు పడిన వెంటనే మా వీఏవో శిరీష మా వద్దకు వచ్చి మీ గ్రూపునకు ఉన్నతి రుణం అర్హత లేదని పొర బాటున వేరే ఖాతాకు వెళ్లా ల్సిన రుణం సొమ్ములు మీ ఖాతాలో పడ్డాయని చెప్పింది. తామంతా ఏపీఎం రామరాజును కలిసి పరిస్థితిని వివరించగా ఆయన కూడా అదే సమాధానం చెప్పారు. చివరకు మా ప్రమేయం లేకుం డానే రూ.లక్ష వేరే ఖాతాకు బదిలీ అయ్యాయి. అయితే ఇటీవల మా గ్రూపు నుంచి మళ్లించిన రూ.3650పై బ్యాంక్‌కు వెళ్లి విచారించగా మా గ్రూపులోని ఎన్‌.కుమారి, కె.నిర్మల పేరు మీద ఉన్నతి లోను ఉన్నట్టుగా తేలడంతో అవాక్కయ్యాం. మా పేరుతో రుణం ఎవరికిచ్చారో తేల్చాలి.


నిధుల స్వాహాపై సమగ్ర విచారణ జరపాలి..

డ్వాక్రా మహిళలకు జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి.. స్వాహా చేసిన సొమ్ములను తిరిగి చెల్లించాలి. విజిలెన్స్‌ విచారణ జరిపితేనే అక్రమాలు వెలుగు చూస్తాయి. తూతూ మంత్రంగా విచారణ జరపవద్దు..  సమగ్రంగా విచారణ నిర్వహించకపోతే డ్వాక్రా మహిళల తరపున న్యాయస్థానాన్ని ఆశ్రయించి బాధితులకు అండగా ఉంటాం. 

- రామకృష్ణారెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు


Updated Date - 2022-05-23T06:50:04+05:30 IST