దూసుకొచ్చిన మృత్యువు!

ABN , First Publish Date - 2022-07-03T05:18:24+05:30 IST

కూలిపనులు ముగించుకుని ఇళ్లకు బయలుదేరిన మహిళా కూలీలపై కారు దూసుకొచ్చింది.

దూసుకొచ్చిన మృత్యువు!
నుజ్జునుజ్జయిన ఆటో, ప్రమాదానికి కారణమైన ఆటో

హైవేపై ఆటోను ఢీకొన్న కారు

ఓ మహిళ మృతి, నలుగురి పరిస్థితి విషమం


బిట్రగుంట, జులై 2 : కూలిపనులు ముగించుకుని ఇళ్లకు బయలుదేరిన మహిళా కూలీలపై కారు దూసుకొచ్చింది. వారి ప్రయాణిస్తున్న ఆటోను బలంగా ఢీకొనడంతో ఆటోలో ఉన్న 15 మంది గాయపడ్డారు. వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. నెల్లూరులో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. బోగోలు మండలం కోవ్వూరుపల్లి జాతీయరహదారిపై శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. బోగోలు ఎస్‌ఐ చినబలరామయ్య కథనం మేరకు.. కావలి రూరల్‌ మండలం కోనేటివారిపాలెంకు చెందిన 15 మహిళా కూలీలు దగదర్తి మండలం ఉప్పరపాలెంలో శనివారం ఉదయం మిరపకాయల కోతకు వెళ్లారు. పనులు ముగించుకుని మధ్యాహ్నం అదే ఆటోలో ఇళ్లకు బయలుదేరారు. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై విజయవాడ వైపు వెళుతున్న కారు వెనుక నుంచి ఆటోను ఢీకొంది. దీంతో హైవేకు పడమర వైపు హద్దుకు ఏర్పాటు చేసిన ఇనుప తీగ వరకు ఆటో, కారు దూసుకుపోయాయి. ఆటో ఫల్టీలు కొట్టడంతో మహిళా కూలీలంతా చెల్లాచెదురుగా పడి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో కావలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం నలుగురిని కావలిలోని ప్రైవేటు ఆసుపత్రులకు, తీవ్రంగా గాయపడిన వారిని నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తాతా రమణమ్మ (55) మృతి చెందింది. కావలి రూరల్‌ సీఐ ఖాజావల్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కారు డ్రైవర్‌ యువరాజును అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు.



Updated Date - 2022-07-03T05:18:24+05:30 IST