దసరాకు ‘స్వామి’ దర్శనం లేనట్టే!

ABN , First Publish Date - 2022-09-07T05:48:15+05:30 IST

గత ఏడాది జరిగిన ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు మల్లేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

దసరాకు ‘స్వామి’ దర్శనం లేనట్టే!

మల్లేశ్వరస్వామి ఆలయంలో కొనసాగుతన్న అభివృద్ధి పనులు

 డిసెంబరు నాటికి పూర్తయ్యే అవకాశం

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న భక్తులు మల్లేశ్వరస్వామిని దర్శించుకుంటారు. ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో భక్తులకు అమ్మవారి దర్శనం మాత్రమే కలుగుతుంది. మల్లేశ్వరస్వామి దర్శనం ఉండదు. ప్రస్తుతం మల్లేశ్వరస్వామి  ఆలయం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దసరా నాటికి ఈ పనులు పూర్తయ్యే అవకాశాలు ఏమీ లేవు. ఈ ఆలయాన్ని పూర్తిగా మూసివేశారు. 

(ఆంధ్రజ్యోతి - విజయవాడ) : గత ఏడాది జరిగిన ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు మల్లేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అప్పటికే నిర్మాణ పనులు జరుగుతున్నప్పటికీ స్వామి దర్శనం కల్పించారు. ఇప్పుడు ఆలయం చుట్టూ నిర్మాణపు పనులు జరుగుతున్నాయి. డిసెంబరు నెలాఖరు నాటికి ఈ పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దసరాలో రోజుకు 60 నుంచి 70వేల మంది ఆలయానికి వస్తారు. తొలుత అమ్మవారిని దర్శించుకున్న భక్తులు నేరుగా స్వామి ఆలయానికి వెళ్తారు. ఈ రెండు దర్శనాలు పూర్తయిన తర్వాత మెట్ల మార్గం నుంచి భక్తులు కిందికి వస్తారు. ప్రస్తుతం మల్లేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో స్వామి ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు శివాలయం వరకు వెళ్లి ఉత్సవాలను దర్శించుకుంటున్నారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.70కోట్లను విడుదల చేసింది. ఈ నిధులతోనే ఇంద్రకీలాద్రిపై రాక్‌ అటైన్‌మెంట్‌ పనులు, మల్లేశ్వరస్వామి ఆలయ నిర్మాణపు పనులు జరుగుతున్నాయి. భక్తులకు స్వామి వారి దర్శనం లేకపోవడంతో మల్లేశ్వరస్వామి వారి ఆలయానికి వెళ్లే మార్గంలో ఉచిత ప్రసాద పంపిణీ కేంద్రానికి ఎదురుగా బాలాలయాన్ని కొన్నాళ్ల క్రితం నిర్మించారు. ఇందులో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. మల్లేశ్వరస్వామి ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు అమ్మవారిని దర్శించుకున్న భక్తులు బాలాలయంలోని శివలింగాన్ని దర్శించుకోవాలని అధికారులు తెలిపారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తప్పనిసరిగా స్వామి వారిని దర్శించుకుంటారని, వారి మనోభావాలను దెబ్బతీయకూడదనే బాలాలయాన్ని నిర్మించామని అధికారులు చెప్పారు. దసరాలో ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులు అమ్మవారి దర్శనం అయిన తర్వాత బాలాలయంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకుని మెట్ల మార్గంలో కిందికి రావాల్సి ఉంటుంది. 

పాలక మండలి ఇక ఎప్పటికో..

ఆంధ్రజ్యోతి - విజయవాడ : దుర్గామల్లేశ్వరస్వామి ఆలయానికి పాలక మండలిని ఇప్పట్లో నియమించే అవకాశాలు కనిపించడం లేదు. కొద్దిరోజుల క్రితం వరకు దేవస్థానానికి పాలక మండలిని నియమిస్తారని ప్రచారం జరిగింది. దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో పాలక మండలికి ప్రస్తుతం అవకాశం లేదని తేలిపోయింది. దసరా ఉత్సవాలకు ఉత్సవ కమిటీని నియమిస్తామని ఆయన మంగళవారం ప్రకటించారు. గడచిన ఏడాది దసరా ఉత్సవాలకు ముందు పాలక మండలిని నియమించింది. చైర్మన్‌గా పైలా సోమినాయుడుకు అవకాశం ఇచ్చారు. ఈ పాలక మండలి కాలపరిమితి ముగిసిపోయింది. ఇక అప్పటి నుంచి పాలక మండలిని ప్రభుత్వం నియమించలేదు. ఈనెల 26వ తేదీ నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానుండటంతో పాలక మండలిని నియమిస్తారని భావించారు. కమిటీకి చైర్మన్‌గా యలమంచిలి రవిని నియమిస్తారని లీక్‌లు వచ్చాయి. ఉత్సవాల వరకు ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. కమిటీలో తక్కువ మందికే స్థానం కల్పించే అవకాశం ఉందని సమాచారం. పాలక మండలి స్థానంలో ఉత్సవ కమిటీని ఏర్పాటు చేస్తే దానికి ఒక చైర్మన్‌ను నియమిస్తారు. ఈ పదవిని యలమంచిలి రవికి ఇస్తారా లేక మరో నేతకు స్థానం కల్పిస్తారా అన్నది వేచి చూడాలి. ప్రభుత్వం ఏ కమిటీని ఏర్పాటు చేసినా అందులో స్థానాలు దక్కించుకోవడానికి వైసీపీలోని కొంతమంది తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులతో సిఫార్సుల చేయించుకుంటున్నారు.  

Updated Date - 2022-09-07T05:48:15+05:30 IST