పరిష్కారం లేదా..?

ABN , First Publish Date - 2022-09-06T05:49:54+05:30 IST

ఏలూరు జిల్లాలోనే ముఖ్యమైన పట్టణం జంగారెడ్డిగూడెం.

పరిష్కారం లేదా..?
డంపింగ్‌ యార్డు వద్ద రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్త

జంగారెడ్డిగూడెంలో ఎటుచూసినా సమస్యలే 

పేరుకుపోతున్న చెత్త..దుర్వాసనతో జనం ఇబ్బందులు

వెలగని సెంట్రల్‌ లైటింగ్‌ 

ప్రజాప్రతినిధులను నిలదీస్తున్న ప్రజలు

గగ్గోలు పెడుతున్న కౌన్సిలర్లు

జంగారెడ్డిగూడెం, సెప్టెంబరు 5 : ఏలూరు జిల్లాలోనే ముఖ్యమైన పట్టణం జంగారెడ్డిగూడెం. పక్కనే పశ్చిమ ఏజెన్సీ ప్రాంతం కావడం, దీంతో పాటు ముంపు కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు సైతం ఇక్కడ స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేస్తుండ డంతో పట్టణ విస్తీర్ణం పెరగడంతో పాటు స్థిర నివాసాలు పెరిగి జనాభా గణనీయంగా పెరిగింది. దాంతోపాటే సమస్యలు కూడా వృద్ధి చెందాయి. ఇక్కడ సమస్యలతో ప్రజలు అల్లాడిపోతు న్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఎక్కడ సమస్యలు అక్కడే పేరుకు పోతు న్నాయి. ఈ క్రమంలో ఇక్కడ కౌన్సిలర్లు తలలు పట్టుకుంటున్నారు. రోడ్లపైకి వెళ్తుంటే ఓట్లేసిన జనాలకు జవాబు చెప్పలేని పరిస్ధితి. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పరిష్కారం కాకపోవడంతో గగ్గోలు పెడుతున్నారు. 

డంపింగ్‌ యార్డు సమస్య 

జంగారెడ్డిగూడెం బైనేరు వాగు ఒడ్డున మూడెకరాల స్థలంలో తాత్కాలికంగా డంపింగ్‌యార్డు నిర్వహిస్తున్నారు. నిత్యం మున్సిపల్‌ పరిధిలోని 29 వార్డుల్లో ప్రతీ రోజు 37 మెట్రిక్‌ టన్నుల చెత్తను పారిశుధ్య సిబ్బంది సేకరిస్తున్నారు. మొత్తం 95 మంది పారిశుధ్య సిబ్బంది ఉండగా వీరిలో కొంత మంది డ్రైవర్‌లుగా ఉండటంతో సిబ్బంది కొరతే కారణమని అధికారులు చెబు తున్నారు. ప్రతీరోజు పట్టణంలో సేకరించిన 37 మెట్రిక్‌ టన్నుల చెత్తను వాహనాలపై పట్టణంలోని కొవ్వూరు రోడ్డులో ఉన్న బైనేరు వాగు ఒడ్డున డంప్‌ చేస్తున్నారు. వీటితో పాటు కోళ్ల వ్యర్థాలు, జంతువుల కళేబరాలు ఇక్కడే పడేస్తున్నారు. అయితే ఇక్కడే పురాతన కాలం నుంచి ఉన్న శివాలయం, బ్రహ్మం గారి ఆలయాలు ఉండటం, ప్రతీ సోమవారం శివాల యంలో వెయ్యి మందికి పైగా ఇక్కడే అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఆలయాలకు ఆనుకుని ఉన్న డంపింగ్‌ యార్డు నుంచి వచ్చే దుర్వా సనలతో భక్తులు, ప్రజలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. వర్షం వచ్చిందంటే ఈ ప్రాంతం అంతా దుర్వాసనలతో కనీసం అటుగా వెళ్లలేని పరిస్థితి తలెత్తుతోంది. దీనికి సమీపంలోనే కొంతమంది ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. డంపింగ్‌ యార్డులో కొన్ని సమయాల్లో చెత్తను తగల పెట్టడంతో ఆ పొగంతా సమీపంలో నివాసం ఉంటున్న ఇళ్లపైకి వస్తోంది. ఇటీవల ఇక్కడ నివాసం ఉంటున్న ఇద్దరు తీవ్ర అస్వస్తతకు గురై విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందారు.

 వెలగని వీధి లైట్లు

జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రధాన రహదారుల్లో నిర్మించిన సెంట్రల్‌ ఎల్‌ఈడీ లైట్ల దుస్థితి మరింత దారుణం. 2017లో ఈఎస్‌ఎల్‌ ద్వారా పట్టణంలో 20 వాట్స్‌, 70 వాట్స్‌, 120 వాట్స్‌ ఉండే మొత్తం 2,830 ఎల్‌ఈడీ లైట్లను బిగించారు. వీటిని సప్లై చేయడంతో పాటు మెయింటినెన్స్‌ చేసే విధంగా ఏడు సంవత్సరాల పాటు ఈఎస్‌ఎల్‌ ఇక్కడ పనితీరు చూసుకోవాలి. దీనికి గాను ప్రతీనెల ఈఎంఐ కింద మున్సిపాలిటీ సుమారు రూ.3.70 లక్షలు చెల్లిస్తున్నారు. అయితే ఇవి ఎప్పుడు వెలుగుతాయో, ఎప్పుడు ఆరిపోతాయో కూడా ఎవరికీ తెలియదు. రోజుల పాటు వెలగకపోయినా పట్టించుకునే నాధుడే లేరు. దీంతో అసహనానికి గురైన ప్రజలు స్థానిక ప్రజా ప్రతి నిధులను దూషిస్తున్నారు. మొత్తం లైట్లలో 5 శాతం లైట్లు వెలగకపోతే మున్సిపాలిటీ ఈఎస్‌ఎల్‌కు పెనాల్టీ వేయవచ్చు. ఇలానే గతంలో కూడా రూ.70 వేలు పెనాల్టీ వేశారు. కానీ అధికారులు, ప్రజా ప్రతినిధుల మార్పు, నిర్లక్ష్యం, బాధ్యత తీసుకునే అధికారుల కరువవ్వడం కారణంగా ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

వెంటాడుతున్న సమస్యలు

జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రధానంగా పారిశుధ్య సమస్యలు వేధిస్తున్నాయి. మున్సిపల్‌ల్లో మొత్తం 95 మంది పారిశుధ్య సిబ్బంది పనిచేస్తున్నారు. వాస్తవానికి మరో 40 మంది వరకు కార్మికులు ఉండాలని అధికారులు ప్రతిపాదనలు పెడుతున్నారు. అయితే వీరిలో కొంతమంది వాహనాల డ్రైవర్‌లుగా పనిచేస్తుంటే మరికొంత మంది ముఖ్య అధికారుల డ్రైవర్‌లుగా, వారి ఇళ్ల వద్దే పనిచేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గత మున్సిపల్‌ కమిషనర్‌ ఇంట్లో ఏకంగా ఒక డ్రైవర్‌తో పాటు ఆరుగురు పారిశుధ్య కార్మికులు పనిచేసేవారని గతంలో కౌన్సిలర్‌లు అధికారులను నిలదీశారు. ఈ పరిస్థితుల్లో ఏఏ సిబ్బంది ఎక్కడ పనిచేస్తున్నారో తెలియడం లేదు. ఇక డ్రైనేజీ వ్యవస్ధ కూడా అధ్వాన్నంగా ఉన్నాయి. వీటితో పాటు పట్టణంలోని ఇళ్ల ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలాలు  మురుగుగుంటలను తలపిస్తున్నాయి. ఖాళీస్థలాలు ఉన్న యజమానులపై అధికారులు కనీస చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తాగునీటి సమస్యలు కూడా ఉన్నా వెంటనే అధికారులు స్పందించడం లేదని ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందించే పరిస్ధితులు ఏర్పడ్డాయని ఇటీవల జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో ఒక కౌన్సిలర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  

ప్రతీ సమావేశంలో ప్రస్తావిస్తున్నాం

వలవల తాతాజీ, కౌన్సిలర్‌, జంగారెడ్డిగూడెం 

గత 15 నెలలుగా ప్రతీ నెల జరిగే సమావేశంలో ఇదే సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నాం. కానీ వారి పని వారు చేసుకుంటూ వెళ్తున్నారే తప్ప మా గోడు వినిపించుకోవడం లేదు. పక్కనే పవిత్రమైన శివాలయం ఉంటే అక్కడే సేకరించిన చెత్త, కోళ్ల వ్యర్థాలు, జంతువుల కళేభరాలు పడేస్తున్నారు. భక్తులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

త్వరలోనే సమస్యలకు పరిష్కారం

భవానీప్రసాద్‌, కమిషనర్‌, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ

బైనేరు ఒడ్డున ఉన్న డంపింగ్‌ యార్డును త్వరలోనే తరలిస్తాం. స్థల సమస్య నెలకొంది. రానున్న రెండు నెలల్లో వేరే ప్రాంతానికి మారుస్తాం.  సిబ్బందిని పెట్టి రోడ్డుపక్కన లేకుండా లోపలకు తరలిస్తాం.వీధిలైట్ల నిర్వ హణపై ఈఎస్‌ఎల్‌ కంపెనీ వారిని పిలిపించాం. ఆ సమస్య కూడా పరిష్క రిస్తాం. మరో 40 మంది పారిశుధ్య కార్మికుల కోసం ప్రతిపాదనలు పంపాం.


Updated Date - 2022-09-06T05:49:54+05:30 IST