ముంచేసిన కావేరి!

ABN , First Publish Date - 2022-07-02T05:10:44+05:30 IST

గత ఖరీఫ్‌లో పత్తి సాగు చేసిన రైతులు కావేరీ కంపెనీకి చెందిన నాసికరం విత్తనంతోనే నష్టపోయారని నిర్ధారణయింది.

ముంచేసిన కావేరి!

  1.  నిర్ధారించిన అధికారులు, శాస్త్రవేత్తలు
  2.  రూ.16 కోట్లు చెల్లించాలని తేల్చిన కమిటీ
  3.  న్యాయస్థానాన్ని ఆశ్రయించిన యాజమాన్యం
  4.  పరిహారం చెల్లింపునకు బ్రేక్‌

గత ఖరీఫ్‌లో పత్తి సాగు చేసిన రైతులు కావేరీ కంపెనీకి చెందిన నాసికరం విత్తనంతోనే నష్టపోయారని నిర్ధారణయింది. ఈ మేరకు  సంబంధిత విత్తన కంపెనీ రూ.16 కోట్ల పరిహారం చెల్లించాని కలెక్టర్‌   నియమించిన కమిటీ తేల్చి చెప్పింది. దీంతో రైతాంగం ఈ సారి పెట్టుబడి ఖర్చులకైనా డబ్బు అందుతుందని ఆశించింది.  కావేరీ కంపెనీ యాజమాన్యం మాత్రం తాము ఉత్పత్తి చేసిన విత్తనం మేలి రకమని.. వాతావరణ పరిస్థితుల వల్లే దిగుబడి తగ్గిందని హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంది. దీంతో రైతులకు చెల్లించాల్సిన నష్ట పరిహారం కార్యక్రమం ఆగిపోయింది. ప్రభుత్వం స్పందించి ఎలాగైనా తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.


కర్నూలు(అగ్రికల్చర్‌), జూలై 1: ఈ రైతు పేరు శివారెడ్డి. గూడూరు మండలం గుడిపాడు గ్రామం. వ్యవసాయమే ఆధారంగా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గత ఖరీ్‌ఫలో తన నాలుగెకరాల పొలంలో పత్తి సాగు చేసేందుకు నిర్ణయించాడు. కావేరీ కంపెనీకి చెందిన పత్తి విత్తనాలను ప్యాకెట్‌ రూ.730 వంతున 15 ప్యాకెట్లను రూ.10,950 వెచ్చించి కొనుగోలు చేశాడు. మార్కెట్‌లో పత్తికి ఆశించిన ధర పలకడంతో అప్పుల నుంచి బయట పడినట్టేనని అనుకున్నారు. అయితే కాలం చెల్లిన నాసిరకం విత్తనాలు కావడంతో పంట ఎదుగుదల ఆగిపోయింది. చెట్టుకు ఐదారు పిందెలు కూడా రాని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ రైతు కన్నీరు మున్నీరయ్యాడు. ఎకరాకు 10 క్వింటాళ్ల పత్తి వస్తుందనుకుంటే... 3 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే అందడంతో ఈ రైతు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

జిల్లాలో కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, డోన 18 మండలాల్లోని 1,890 మంది రైతులు 7,258 ఎకరాల్లో కావేరి కంపెనీకి చెందిన పత్తి విత్తనాలను వాడి నష్టపోయామని కలెక్టర్‌ వద్ద మొరపెట్టుకున్నారు. దీంతో కలెక్టర్‌ ఆదేశాలపై నంద్యాలకు చెందిన వ్యవసాయశాఖ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు, గుంటూరులోని లాంపామ్‌ ప్రధాన శాస్త్రవేత్తలు గూడూరు తదితర మండలాల్లో రైతులు సాగు చేసిన పత్తి పొలాలను పరిశీలించారు. ఈ పరిశీలనలో విత్తన లోపం వల్లే దిగుబడి తగ్గిందని వ్యవసాయశాఖ కమిషనర్‌కు నివేదిక అందించారు. దీంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు గత సంవత్సరం నవంబరులో కర్నూలు జిల్లా వ్యవసాయశాఖ అధికారి వరలక్ష్మి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నష్టపోయిన రైతులతోపాటు కావేరి కంపెనీ ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసింది. నష్టపోయిన రైతులకు రూ.16 కోట్లు చెల్లించాలని కమిటీ తేల్చి చెప్పింది. నెల రోజుల్లోగా పరిహారాన్ని అందించాలని కంపెనీ యాజమాన్యాన్ని ఆదేశించింది. దీంతో రైతులు తమకు త్వరలోనే పరిహారం అందుతుందని... ప్రస్తుత ఖరీ్‌ఫలో పంటల సాగుకు ఆ డబ్బులు ఉపయోగపడతాయని ఎదురు చూస్తున్నారు. కావేరీ యాజమాన్యం తాము ఉత్పత్తి చేసిన విత్తనం మేలి రకమని.. వాతావరణ పరిస్థితుల వల్లే దిగుబడి తగ్గిందని హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంది. దీంతో రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారం కార్యక్రమం ఆగిపోయింది. ప్రస్తుతం రైతులు పెట్టుబడికి చేతిలో చిల్లిగవ్వ లేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

 ఈసారైనా  పత్తి రైతు  బాగుపడేనా..? 

గత సంవత్సరం నాసిరకం పత్తి విత్తనాలతో పాటు గులాబి రంగు పురుగు తదితర తెగుళ్ల కారణంగా పత్తి రైతులు భారీగా నష్టపోయారు. కనీసం ఈసారైనా ఆ పరిస్థితి నుంచి పత్తి రైతులను గట్టెక్కించేందుకు జిల్లా వ్యవసాయ శాఖ అధికార యం త్రాంగం శ్రద్ధ తీసుకోవాలని రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లాలో దాదాపు రెండున్నర లక్షల హెక్టార్లలో రైతులు పత్తి సాగు చేస్తున్నారు. ఎకరాకు దాదాపు రూ.75వేల నుంచి 80వేల దాకా ఖర్చు పెడుతున్నారు.  అయితే రైతు అవసరాలను తమకు అనుకూలంగా మార్చుకుని పత్తి విత్తన వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. నాసిరకం విత్తనాలతో పాటు కాలం చెల్లిన పత్తి విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు.

జిల్లా కేంద్రమే అడ్డాగా

 నాసిరకం పత్తి విత్తనాలకు కర్నూలు అడ్డాగా మారినట్టు సమాచారం. కొంతమంది ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసుకొని పత్తి వేరు చేసి నాసిరకం విత్తనాలను, కాలం చెల్లిన విత్తనాలను అందమైన ప్యాకెట్లలో నింపుతున్నారు. గ్రామాల్లో తమకు అనుకూలమైన వారిని దళారులుగా నియమించుకుని రైతులకు అంటగడుతున్నారు. మారుమూల గ్రామాల్లోని పాతగిడ్డంగులు, భవనాలను అద్దెకు తీసుకుని నాసిరకంతో పాటు కాలం చెల్లిన పత్తి విత్తనాలను అందమైన ప్యాకెట్లలో నింపే కార్యక్రమాన్ని వ్యాపారులు చేపడుతున్నా అధికారులెవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అడపా దడపా విజిలెన్స అండ్‌ ఎనఫోర్స్‌మెంట్‌ అధికారులు మాత్రం దాడులు చేస్తున్నారు. 

పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలి 

కర్నూలు జిల్లా నాసిరకం విత్తనాలకు చిరునామాగా మారింది. వ్యవసాయాధికారులు ఈ నష్టాన్ని నివారించే చర్యలు చేపట్టడం లేదు. జిల్లా కేంద్రంలోనే ఈ విత్తనాల విక్రయాలు జోరుగా సాగుతున్నా పట్టించుకునే వారే లేరు. గూడూరు మండలంలో నాసిరకం పత్తి విత్తనాలు,  మరి కొన్ని నియోజకవర్గాల్లో మొక్కజొన్న, మిరప తదితర నాసిరకం విత్తనాలను వాడి రైతులు నష్టపోయారు. వ్యవసాయాధికారులకు విత్తన కంపెనీల యాజమాన్యాలు, డీలర్ల నుంచి భారీగా మామూళ్లు అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్య వహారంలో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న వ్యవసాయాధికారులపై ఎన్నోసార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా సంబంధిత కంపెనీ నుంచి రైతులకు పరిహారం అందించాలి. లేకపోతే మళ్లీ రైతులను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. 


- రామకృష్ణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి 


రైతులకు పరిహారం అందించేందుకు చర్యలు

 గత సంవత్సరం ఖరీ్‌ఫలో కావేరి కంపెనీకి చెందిన జాదూరకం పత్తి విత్తనాలను సాగు చేసిన రైతులు దిగుబడి తగ్గి.. నష్టపోయారు. నంద్యాల, గుంటూరు వ్యవసాయ పరిశోధన కేంద్రాల నుంచి శాస్త్రవేత్తలు వచ్చి... పొలాలను పరిశీలించి విత్తన లోపం వల్లనే దిగుబడి తగ్గిందని నిర్ధారించారు. కలెక్టర్‌ ఆదేశాల పై ఏర్పాటైన కమిటీ రైతులకు రూ.16 కోట్లు చెల్లించాలని చెప్పింది.  విత్తన కంపెనీ యాజమాన్యం హైకోర్టుకెళ్లి స్టే తెచ్చింది. ఈ స్టేను వెకేట్‌ చేయించేందుకు ప్రభుత్వం అప్పీల్‌ చేసింది. త్వరలోనే రైతులకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం. 

- శాలురెడ్డి, ఏడీఏ 

Updated Date - 2022-07-02T05:10:44+05:30 IST