నీళ్లున్నా నిష్ఫలం

ABN , First Publish Date - 2020-08-05T10:56:22+05:30 IST

శ్రీశైలం ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నప్పటికీ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రధాన నీటి వనరు అయిన

నీళ్లున్నా నిష్ఫలం

ఎంజీఎల్‌ఐ కింద మరుగున పడిన అదనపు రిజర్వాయర్ల నిర్మాణం

కొత్త ఆయకట్టు స్థిరీకరణపై దృష్టి కరువు


నాగర్‌కర్నూల్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నప్పటికీ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రధాన నీటి వనరు అయిన మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం కింద కృష్ణా జలాలను నిల్వ చేసుకునే సామర్థ్యం అరకొరగానే ఉండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్త మవుతోంది. పథకం ద్వారా 4.25 లక్షల ఎకరాల ఆయక ట్టుకు నీరందించాలనే లక్ష్యంతో వివిధ నిర్మాణాలు చేపట్టారు. రూ.4,896.24 కోట్లతో పనులను చేపట్టినప్పటికీ అత్యంత కీలకమైన రిజర్వాయర్ల నిర్మాణం పూర్తిస్థాయిలో చేయకపోవడం శాపంగా పరిణమించింది. ఈ పథకం ద్వారా నాగర్‌కర్నూల్‌తో పాటు వనపర్తి, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు కూడా సాగు, తాగునీరు అందేలా డిజైన్‌ రూపొందించారు. 


అందుబాటులో నీరున్నా: మహత్మాగాంధీ ఎత్తిపోతల పథకం కింద రెగుమాన్‌గడ్డ వద్ద 30 మెగావాట్ల సామర్థ్యం గల ఐదు మోటార్లను బిగించారు. శ్రీశైలం ప్రాజెక్టు డెడ్‌ స్టోరేజీలో ఉన్నా 810 అడుగుల నుంచి నీటిని పంపింగ్‌ చేసుకునే విధంగా డిజైన్‌ చేశారు. అక్కడి నుంచి సింగవట్నం, జొన్నలబొగుడ, గుడిపల్లి గట్టు ద్వారా 4 లక్షల 25వేల ఎకరాలకు సాగునీరందాల్సి ఉంది. 5 మోటార్ల ద్వారా 4 వేల క్యూసెక్కుల నీటిని పంపింగ్‌ చేయాల్సి ఉండగా కాలువలు, టన్నెళ్ల నిర్మాణం తదనుగుణంగా జరగక పోవడంతో ఏటా సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. 


అదనపు రిజర్వాయర్ల నిర్మాణమెన్నడో?: పథకం ద్వారా 4.25 లక్షల ఎకరాలకు నీరందించాలంటే కనీసం 41 టీఎంసీల నీరు అవసరమవుతుంది. ఎల్లూరు వద్ద 0.35 టీఎంసీలు, సింగోటం 0.55, జొన్నలబొగుడ 2.14, గుడిపల్లి గట్టు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో 0.96 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్ల నిర్మాణాన్ని మాత్రమే పూర్తి చేశారు. కృష్ణానదికి వరద వచ్చిన సందర్భంలో నీటిని స్టోరేజీ చేసుకొని పంటలు ఎండి పోకుండా చూడాలంటే ఇంకా దాదాపు ఒక టీఎంసీలోపు నీటి నిల్వ సామర్థ్యం ఉం డే మరో 40 అదనపు రిజర్వాయర్లు నిర్మించాలని సాగునీటి శాఖకు చెందిన నిపుణులు నాలుగేళ్ల క్రితమే నివేదించారు. పలు సందర్భాల్లో జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అదనపు రిజర్వాయర్ల నిర్మాణం విషయంలో ప్రకటన చేసినా.. ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు.  ప్రస్తుతం జిల్లాలోని 383 చెరువులు, కుంటలను నింపి దానికింద ఉన్న ఆయకట్టుకు నీరందించడం తప్ప కొత్త ఆయకట్టును స్థిరీకరించకపోవడం గమనార్హం.


కల్వకుర్తికి నీరందేనా?: కల్వకుర్తి నియోజకవర్గంలో డీ-82 కాలువ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. ఆవంచ ఆక్విడెక్ట్‌ నుంచి డీ-82 కాలువ నిర్మాణం పూర్తైతే 29వ ప్యాకేజీలో మిడ్జిల్‌లో 5,810 ఎకరాలకు, ఉర్కొండలో 4,562, కల్వకుర్తిలో 36,692, వంగూరు మండలంలో 30,845 ఎకరాలకు నీరందించాల్సి ఉంది. రూ.180 కోట్లు వెచ్చించి డీ-82 కాలువను జంగారె డ్డిపల్లి నుంచి నాగిళ్ల వరకు పూర్తి చేయగలిగితే వెల్దండ మండలంలో 16,370, ఆమన్‌గల్‌లో 2,616, మాడ్గులలో 18,756 ఎకరాలకు నీరందించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ భూసేకరణ ప్రధాన సమస్యగా మారింది. బిల్లులు కూడా నెలల తరబడి పెండింగ్‌లో ఉండటంతో పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి అవకాశం కలగడం లేదు.

Updated Date - 2020-08-05T10:56:22+05:30 IST